సోలిపేట రామలింగారెడ్డి
(* కామిడి సతీష్‌రెడ్డి)

పాత్రికేయ వృత్తిలో, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని నాలుగుసార్లు శాసనసభ్యునిగా గెలిచి శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ అయిన సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. మృదుస్వభావిగా, పేదల పెన్నిధిగా పేరున్న వారి మరణం అందరిని కలిచి వేసింది. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో జన్మించిన రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి పోలీస్ పటేల్‌గా పనిచేసేవారు.

వారి ఆరుగురు సంతానంలో రామలింగారెడ్డి చిన్నవాడు. విద్యార్థి దశలోనే విప్లవ భావాలు కలిగి పౌరహక్కుల సంఘంలో పనిచేసి మావోయిస్టు దళంలో అజ్ఞాత జీవితం గడిపారు. 1985 సంవత్సరంలో జరిగిన వీరి పెళ్ళికి ప్రస్తుత సీఎం చంద్రశేఖర రావు హాజరై హాజరయ్యారని తెలుస్తోంది. తర్వాత దళం నుండి బయటకు వచ్చి పాత్రికేయుడిగా సుమారు 25 సంవత్సరాలు వివిధ ప్రాంతాల్లో పని చేసి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ముందున్నారు. పాత్రికేయుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ పాత్రికేయుల సమస్యల సాధన కోసం నడుం బిగించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ నేత చంద్రశేఖర రావుతో ఏర్పడిన పరిచయం రాజకీయాల వైపు మళ్లడం 2001లో తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పనిచేయడం వల్ల 2004వ సంవత్సరంలో దొమ్మాట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

తర్వాత 2008 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్ళీ 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా గెలిచి శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ అయిన ఈయన నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల ను పరిష్కరించడంతో పాటు, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైతుల ఆత్మహత్యలపై అనేక వ్యాసాలు రాశారు. వివిధ పత్రికల్లో తాను రాసిన వ్యాసాలు సమాజంలోని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసాయి. తెలంగాణ రాష్ట్రం మంచి విలువలు గల శాసనసభ్యున్ని కోల్పోయింది. రామలింగారెడ్డి విలువల కోసం జీవించే వ్యక్తిగా గుర్తింపుపొందారు. రామలింగారెడ్డి నిత్యం మెదక్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని చెప్పవచ్చు. వారి స్వగ్రామంలో జరిగిన అంతక్రియలకి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు పాల్గొని వారి భౌతికకాయంపై పూలమాల వేసి ఉద్వేగానికిలోను కావడం ముఖ్యమంత్రికి వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది.

అలాగే స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆయన పార్థివదేహాన్ని మోయడాన్ని బట్టి చూస్తే వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తేటతెల్లం చేస్తుంది. నేటి తరం రాజకీయ నాయకులకు మార్గదర్శి సోలిపేట. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమందరం, కోరుకుందాం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.

(* కామిడి సతీష్‌రెడ్డి, జడల్‌పేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ)