అధికారుల కక్ష సాధింపు చర్యలు: మాజీ ఎమ్మెల్యే పీలా

3019

విశాఖపట్నం, జులై 19 (న్యూస్‌టైమ్): విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా అధికారుల కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. కశింకోట మండలంలోని బయ్యవరం ఎన్టీఆర్ నగర్‌లోని గృహాలకు విద్యుత్ తొలగించడం పట్ల ఆయన అధికారుల చర్యలను ఖండించారు.

గత ఎన్నికలలో బయ్యవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఓట్లు వచ్చాయని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఇళ్లలో మాత్రమే ఇలా జరగడం కక్ష రాజకీయాలా? అని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే పార్టీ నాయకులు మళ్ళ సురేంద్ర, బాబర్‌లను ఎన్టీఆర్ కాలనీకి పంపించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు.

తర్వాత అధికారులతో మాట్లాడిన ఆయన తొలగించిన మీటర్లను, కరెంట్‌ను పునరుద్దరణ చేయించారు. తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, సానుభూతి పరులను గాని కక్ష సాధింపు చర్యలకు ఎవరు పాల్పడిన వూరుకునేది లేదని, అవసరం అయితే పొరటాలకైన తాను సిద్ధం అని అన్నారు.