సిక్కోలుపై కరోనా పంజా!

238
(* పోతుమహంతి నారాయణ్)

పచ్చని పొలాల మధ్య ఉన్న కాగువాడ కుగ్రామము. దేశ పటంలోకి ఒక్కసారిగా వెళ్ళిపోయింది. ఇదేమైనా ఆ గ్రామం విజయం సాధించి వెళ్ళిందా అనుకొంటే అక్కడ పప్పులో కాలేసినట్లే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పాలకులకు గత ఐదు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కోవిడ్-19 రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా వరకూ పాకింది. కరోనా ఫ్రీ జిల్లాగా చేద్దామని నిరంతరం తపించిన కలెక్టర్ నివాస్ ఆశలు అడియాసలే అయ్యాయి. చీమ చిటుక్కుమంటే ఆ వివరాలను జిల్లా ప్రజలకు ఎప్పుడెప్పుడా చేరవేస్తామా అంటూ 24 గంటలూ నిద్రాహారాలు మాని పనిచేస్తున్న సమాచార, పౌర సంబంధాల శాఖ కూడా ఒక్కసారిగా డీలా పడిపోయింది.

గత నెల 20వ తేదీ నుండి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో పలు మీడియా సంస్థలు ఇప్పటికే కలెక్టర్ ఇంటర్వ్యూలు తీసుకొని ప్రముఖంగా ప్రచురించాయి. అయినా ఫలితం లేకపోయింది. మండల స్థాయిలోని ఒక అధికారి చేసిన తప్పిదానికి శ్రీకాకుళం జిల్లా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలోని మెట్రో రైల్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి గత నెల 19వ తేదీన పాతపట్నం మండలం కాగువాడు గ్రామానికి వచ్చాడు. అక్కడకు దగ్గరలోని పెద్ద సీదికి చెందిన ఆ వ్యక్తి కాగువాడలోని అత్తారింటికి చేరుకున్నాడు.

విషయాన్ని గమనించిన వాలంటీర్ ఆయనను హౌస్ క్వారంటైన్ చేశాడు. 14 రోజులు దాటాక ఆ వ్యక్తి వాలంటీర్ కన్నుగప్పి జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించాడు. ఈ విషయాన్ని వాలంటీర్ పాతపట్నం మండల ఉన్నతాధికారికి తెలియజేయడం, అధికారి దాన్ని పెడచెవిన పెట్టడంతో చివరకు శ్రీకాకుళం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చేందుకు కారణమైనట్లు విమర్శలు పెల్లుబికాయి. ఆ వ్యక్తి వల్ల ఇంకా ఎందరికి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. పాతపట్నం మండలంలోని 18 గ్రామాల్లో అధికారులు, హెల్త్ వర్కర్లు, పోలీసుల సహకారంతో జల్లెడ పడుతున్నారు. ఈ నెల 22వ తేదీన జహంగీర్‌పూర్‌లోని ఢిల్లీ మెట్రో రైలు నుండి ఫోన్ రావడం, కలెక్టర్ నుండి కరోనా లేనట్లు ధ్రువీకరణ పత్రంతో విధుల్లో చేరవలసిందిగా పేర్కొనడంతో వెంటనే ఆయన పాతపట్నంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 పరీక్షలు చేసుకున్నాడు.

అక్కడ పాజిటివ్ రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై సదరు వ్యక్తి అత్త, మామ, మరదలకు మరొకరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారు నలుగురికి కాకినాడలోని కరోనా టెస్టింగ్ సెంటర్‌లో పాజిటివ్, సదరు వ్యక్తికి నెగిటివ్ రావడంతో ఒక్కసారిగా జిల్లాలో ఓ కుదుపు వచ్చింది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసులు లేవన్న దానికి చెక్ పడింది. ఇక మిగిలింది విజయనగరం జిల్లా మాత్రమే. ఆ వ్యక్తి ఆ జిల్లాలో కూడా తిరగడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి వచ్చే వారిలో కరోనా లక్షణాలు ఉంటే సదరు వ్యక్తి నుండి కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర వర్గాలకు అది సోకుతోంది.

ఇది ఒక చైన్ ఆధారంగా ఉంటోంది. ఇప్పటికే విజయవాడలోని కృష్ణ లంకలో ఒక లారీ డ్రైవర్ నుండి 40 మందికి పైగా కరోనా సోకడాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ వ్యాధి ఉన్నవారిని ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తే దాని వ్యాప్తిని సునాయాసంగా నియంత్రించే అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలోని అల్లిపురానికి చెందిన ఒక వ్యక్తికి ఆ లక్షణాలు కనిపించడం, వెంటనే హుటాహుటిన ఆయనతో పాటు కుటుంబ సభ్యులను ఊపిరితిత్తుల ఆసుపత్రిలో చేర్చడం ఫలితంగా భార్యాభర్తలకు మెరుగైన చికిత్స అందించడంతో ఇద్దరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

వారి నుండి ఇతరులెవరికీ కరోనా సోకలేదు, అంటే అధికారులు, హెల్త్ వర్కర్లు వాలంటీర్లు ఎంత అప్రమత్తంగా ఉంటే సమాజానికి అంత ప్రయోజనం చేకూరుతుంది. శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ నివాస్ జిల్లా కేంద్రంలో ఉంటూ పరిస్థితిని ప్రతిరోజు అంచనా వేస్తునప్పటికీ పాతపట్నం మండలంలోని వ్యక్తి కదలికలను అక్కడి అధికారులు గుర్తించడంలో అలసత్వంగా వ్యవహరించడం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. సదరు వ్యక్తి నుండి ఇంకా ఎంతమందికి పాజిటివ్ వచ్చిందనేది పరీక్షలో గాని తేలదు.

(* రచయిత: సీనియర్ జర్నలిస్టు: 98491 47350)