మాస్కులు పంపిణీ చేస్తున్న శ్రీకాకుళం స్టార్ వాకర్సు క్లబ్ ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ బి.వి. రవిశంకర్

శ్రీకాకుళం, ఆగస్టు 14 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారి లాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలో పర్యావరణ పరిరక్షణనూ అంతే స్థాయిలో గుర్తించి మొక్కలు పెద్దఎత్తున నాటాలని వాకర్సు ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్సు కళాశాల ఆవరణలో స్టార్ వాకర్సు క్లబ్ ఆధ్వర్యంలో వాకర్సు కో ఆర్డినేటర్, సీనియర్ జర్నలిస్ట్ శాసపు జోగినాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా మొక్కలు నాటారు.

వాకర్సు క్లబ్ అధ్వర్యాన మాస్కులు పంపిణీ చేస్తున్న సీనియర్ జర్నలిస్టులు శాసపు జోగినాయుడు, కొంఖ్యాన వేణుగోపాల్

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి బయట పడేందుకు ప్రతీ ఒక్కరూ ప్రభుత్వాలు చెపుతున్న సూచనలు, సలహాలు పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉంటూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరంలో శాంతినగర్, ఆర్ట్సు కళాశాల, రామకృష్ణ నగర్ కాలనీలను స్టార్ వాకర్సు క్లబ్ దత్తత తీసికొని పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. స్టార్ వాకర్సు కో ఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొంఖ్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో ప్రకృతి వైద్యానికి ఆదరణ లభిస్తోందని, అల్లోపతి వైద్యం స్థానంలో హోమియోపతి, ఆయుర్వేద వైద్యానికి డిమాండ్ పెరిగిందని అన్నారు.

స్టార్ వాకర్సు క్లబ్ కో ఆర్డినేటర్ శాసపు జోగినాయుడు పుట్టినరోజు సందర్భంగా వాకర్సు క్లబ్ అధ్వర్యాన వాకర్సు ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరా ప్రసాద్ బృందం మొక్కలు నాటుతున్న దృశ్యం

శ్రీకాకుళం జిల్లాలో స్టార్ వాకర్సు క్లబ్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. స్టార్ వాకర్సు క్లబ్ కో ఆర్డినేటర్ శాసపు జోగినాయుడు మాట్లాడుతూ కొవిడ్-19 కారణంగా ప్రతీ ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు మేరకు కరోనా నియంత్రణా చర్యలు తీసుకోవాలని కోరారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్టుల ఐక్య వేదిక, వాకర్సు ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్టార్ వాకర్సు క్లబ్ ప్రతినిధులు బి.వి. రవిశంకర్, ఎం.మల్లిబాబు, జామి రాధాకృష్ణ, ఐకె రావు, సురేష్, కె.లక్ష్మణరావు, పొన్నాడ భాస్కరరావు, శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టుల ఐక్య వేదిక ప్రతినిధులు రౌతు సూర్యనారాయణ, బి.రమేషుబాబు, పి.పృధ్వీరాజ్, జి. మోహన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి క్లబ్ సభ్యులంతా నమస్కరించారు. దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్తైరాన్ని నింపి వారిని ప్రగతిపథంలో ముందుకు నడిపించిన స్వామి వివేకానంద అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు మాస్కులు శరణ్యమని వక్తలు అన్నారు. ఈ సందర్భంగా మాస్కులు పంపిణీ చేశారు. సేవా రంగంలో, మీడియాలో, ఆధ్యాత్మిక రంగంలో శాసపు జోగినాయుడు మనందరికి ఆదర్శంగా నిలుస్తారని వాకర్సు క్లబ్ ప్రతినిధులు కొనియాడారు.