వారియర్స్‌పై విమర్శలు తగదు

0
4 వీక్షకులు
  • కరోనా నియంత్రణలో తెలంగాణ భేష్

హైదరాబాద్, మే 21 (న్యూస్‌టైమ్): ‘‘గాంధీ వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారు. వాళ్ళపై ఆరోపణలు చేయటం సరికాదు’’ అని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘‘కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చెయ్యటానికి భయపడుతున్నారు.. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పని చేస్తోంది. కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా ప్రకటన చేస్తోంది’’ అని మంత్రి తెలిపారు.

గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి రాష్ట్రంలో తాజా కరోనా పరిస్థితులను వివరించారు. కరోన పాజిటివ్ వచ్చిన మొదట్లో ఎవరన్నా చనిపోతే వారి కుటుంబ సభ్యులు సైతం చూడడానికి దగ్గరికి రాలేదని, దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదని, అమెరికా, ఇటలీ లాంటి దేశాలలో వందలమంది చనిపోతే కుటుంబ సభ్యులు లేకపోతే ప్రభుత్వాలే అంత్యక్రియలు చేశాయని అన్నారు.

‘‘ఏప్రిల్ 29వ తేదీన వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే పేషంట్ కరోనా పాజిటివ్‌తో గాంధీలో చేరారు. ఇరవైనాలుగు గంటలలోపే 30వ తేదీన చనిపోయారు. దీనితో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందితో గాంధీకి వచ్చారు. 1వ తేదీన చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబ సభ్యులు అందరూ క్వారంటైన్‌లో ఉన్నారు. భార్యకి చెప్తే షాక్‌కి గురవుతుంది అని గంభీరమైన సందర్భంలో చెప్పకుండా ఉండడమే మేలని చుట్టాలు చెప్పిన నేపథ్యంలో మృతదేహాన్ని పోలీస్‌లకు అప్పగించి జీహెచ్ఎంసీ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించారు’’ అని మంత్రి వివరించారు.

బంధువులకు చెప్పకుండా కరోనా వచ్చిన మధుసూదన్‌ను ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిందని వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కోలుకుని బయటకి వచ్చాక గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ‘‘రాపిడ్ కిట్స్ మీద నమ్మకంలేదని మొదటి నుండి చెప్తున్నాము. ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా అదే చెప్పింది అని మంత్రి అన్నారు. ‘‘కోవిడ్ పరీక్షలు, చికిత్స ప్రభుత్వ రంగంలోనే అందిచాలని ఆ సామర్ధ్యం మనకి ఉందని సీఎం చెప్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరీక్షలు, చికిత్స అందిస్తున్నము’’ అని మంత్రి అన్నారు. ‘‘ఒక వ్యక్తి కి పాజిటివ్ అని తేలితే వారి కుటుంబ సభ్యులు, పాజిటివ్ వ్యక్తి కలిసిన వారందరినీ ట్రేస్ చేసి తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నాం. అవసరం అయితే క్వారంటైన్ చేస్తున్నాము. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు చేయగలరా? అని మంత్రి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు అన్నీ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యం అవుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించుకుని తదుపరి చర్యలు తీసుకుంటాము’’ అని మంత్రి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here