ఈ ఎన్నికలు భావితరాలకు కీలకం: అబ్దుల్ అజీజ్

1514

నెల్లూరు, మార్చి 19 (న్యూస్‌టైమ్): నమ్మకానికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు భావితరాలకు ఎంతో కీలకం కాబోతున్నాయని, ప్రతీ కార్యకర్తా సైనికునిలా పనిచేసి టిడిపి విజయానికి కృషి చేయాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార సన్నాహక కార్యక్రమంలో భాగంగా స్థానిక గోమతి నగర్లోని క్యాంప్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అత్యంత క్రమశిక్షణతో ఉన్న రూరల్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్నికల సమరంలో ఉత్సాహంగా పాల్గొంటున్నామని సంతోషం వ్యక్తం చేసారు. అభివృద్ధికి ప్రతీక అయిన చంద్రబాబులాంటి పాలకుని వెంట నడవడం అదృష్టంగా భావిస్తూ, పార్టీ విజయానికి అహర్నిశలూ శ్రమిస్తామని అజీజ్ నిశ్చయించారు. పటిష్టమైన ప్రణాళికతో కార్యకర్తలందరినీ కలుపుకుంటూ రూరల్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి గెలుపు సాధించనున్నామని అజీజ్ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో రూరల్ నియోజకవర్గ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, హరిబాబు యాదవ్, జెన్ని రమణయ్య, బద్దెపూడి రవీంద్ర, కార్పొరేటర్లు రాజానాయుడు, సత్య నాగేశ్వర్ రావు, వెంకన్న యాదవ్, పొత్తూరి శైలజ, కొమరగిరి శైలజ, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.