అమరావతి, ఆగస్టు 25 (న్యూస్‌టైమ్): కోనసీమ లంకల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. ఆయన జూమ్ యాప్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. 1986, 2006 తరువాత అంతటి స్థాయిలో వరద వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వరద బాధితులకు సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాయని గుర్తు చేసిన ఆయన ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వరద సహాయ చర్యల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

మరోవైపు, బుధవారం మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం వరద ప్రభావిత ప్రాంతాలైన కేసనకుర్రుపాలెం, పల్లిగూడెంలలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చినరాజప్ప ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఓ వైపు కరోనా మరోవైపు వరదలతో అధికారులు, ముంపు బారిన పడిన గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారని అన్నారు. వరద వచ్చే సమయాల్లో ఏటి గట్టులు పటిష్టం చేసే ముందు జాగ్రత్త చర్యలను చేపట్టలేదని ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. గత ఏడాది వరద బాధితులకు రూ.5వేలు సాయం ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు బాధితులకు రూ. 2 వేలు ప్రకటించడం సరికాదన్నారు.

కనీసం రూ.10 వేలు అయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వరద ముంపు గ్రామాల్లో నిద్రాహారాలు లేక ప్రజలు అలమటిస్తున్నారని, ఏటి గట్లపైకి వెళ్లి ప్రజలకు కనీసం ఆహారమైనా అందించాలని అధికారులను ఆయన కోరారు. మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలోని గోదావరి వరద బాధితుల పునరావాస కేంద్రాలను పోలవరం శాసన సభ్యుడు తెల్లం బాలరాజు పరిశీలించారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రంలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని బాలరాజు సూచించారు.

41 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here