న్యూఢిల్లీ, అక్టోబర్ 10 (న్యూస్‌టైమ్): చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా బాగా తగ్గుతో వస్తోంది. నెలరోజుల తరువాత మొట్టమొదటి సారిగా 9 లక్షలకంటే తక్కువ స్థాయికి పడిపోయింది. 9న 8.97 లక్షల కేసులు నమోదు కాగా ఈ రోజు ఆ సంఖ్య 8.93 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 8,93, 952 గా నమోదైంది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 12.94% మాత్రమే.

కోలుకుంటున్నవారి శాతం పెరుగుతున్నకొద్దీ చికిత్సలో ఉన్నవారి శాతం బాగా తగ్గుతూ వస్తున్నది. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 59,06,069 మందిగా నమోదైంది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా 50 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే 50,12, 477 మంది. కోలుకుంటున్నవారు పెరిగేకొద్దీ, ఈ తేడా కూడా పెరుగ్గుతూ వస్తోంది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగేకొద్దీ, జాతీయస్థాయిలో కోలుకుంటున్నవారి శాతం కూడా పెరుగూ వస్తోంది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం85.52% అయింది.

గడిచిన 24 గంటల్లో 78.365 మంది కోలుకున్నారు.కొత్తగా నమోదైన కేసులు 70,496 ఉన్నాయి. మరోవైపు, కొత్తగా వస్తున్న కేసులకంటే కొత్తగా కోలుకుంటున్నవారి సంఖ్య వరుసగా మూడు వారాలుగా పెరుగుతూనే ఉంది. మూడువారాలౌలుగా నమోదవుతున్న కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి.రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వసహకారంతో సాగిస్తున్న కృషిఫలితంగా, ఆస్పత్రులు నాణ్యమైన సేవలందిస్తూ ప్రామాణిక విధానాలు పాటించటం వల్లనే ఇది సాధ్యమైంది. కొత్త కేసులలో 75% మేరకు 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి.

వాటిలో మహారాష్ట, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట ఒక్కటే గరిష్ఠంగా ఒక్క రోజులో 15,000 కేసులు నమోదు చేసింది. 70,496 కొత్తకేసులు గత 24 గంటలలో నమోదయ్యాయి. కొత్త కెసులలో 78% 10 రాష్ట్రాలనుంచే నమోదు కాగా ఇందులో కూడా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 13,000 కేసులు నమోదయ్యాయ్తి. ఆ తరువాత స్థానం 10,000 కేసులతో కర్నాటక నమోదు చేసుకుంది. గడిచిన 24 గంటలలో 964 మరణాలు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 82% కేవలం పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. 37% పైగా కొత్త మరణాలు (358 మంది) మహారాష్ట్రలో నమోదయ్యాయి.

ఎంటర్టైన్మెంట్ పార్కులు, తదితర స్థలాలు తరచూ జనం పెద్ద సంఖ్యలో గుమికూడే ప్రదేశాలు కాబట్టి అక్కడ కోవిడ్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించ వలసిందిగా కోరింది.

కాగా, కేరళ రాష్ట్రంలో కోవిడ్-19 నిర్ధారిత కేసుల సగటు 14 శాతం నుంచి ఒక్కసారిగా 8 శాతానికి దిగిరావడం రాష్ట్ర ఆరోగ్య రంగంలో చర్చకు దారితీసింది. అయితే, కోవిడ్ బారినపడిన వ్యక్తులపై ఒక వారం పరిశీలించాకే ఏదైనా నిర్ణయానికి రాగలమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సుదీర్ఘకాలం అధికంగా నమోదవుతూ వచ్చిన కేసుల సగటు అకస్మాత్తుగా పడిపోవడానికి అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఏదో ఒకరోజుకు పరిమితమైన పరిణామం కావచ్చునని పేర్కొంది. ఏదేమైనా కేసుల నమోదు సగటున 10 శాతంకన్నా దిగువన ఉంచాలని అన్ని జిల్లాలకూ ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఇవాళ ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 933కు చేరింది.

కేరళలో నిన్న 10,000 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఇవాళ 5445 తాజా కేసులతోపాటు 7003 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,579 మంది చికిత్స పొందుతుండగా 2.71 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి కారణంగా పరిశ్రమల మూసివేతతో తమిళనాడునుంచి వెళ్లిపోయిన దాదాపు 2 లక్షలమంది వలస కార్మికులలో 47,000 మంది నెల వ్యవధిలో కోయంబత్తూరు జిల్లాకు తిరిగివచ్చారు.

కాగా, కోవిడ్-19 వ్యాప్తి కారణంగా సేలంలోని బేలూర్ గ్రామంలో ప్రజలు గురువారం స్వీయ దిగ్బంధం ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని పరిధిలోని బెంగుళూరు అర్బన్ ప్రాంతంలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 5121 కేసులు నమోదయ్యాయి. కాగా, కర్ణాటకలోని 12 జిల్లాల్లో క్రియాశీల కేసులు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ పెరుగుతూనే ఉన్నాయి. కాగా, కోవిడ్‌ పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా పాఠశాలలు తెరవకుండా చూడాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్.సురేష్ కుమార్కు లేఖ రాశారు.

మరోవైపు కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదని సిఫారసు చేస్తూ కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ ప్రాథమిక విద్యాశాఖకు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం దిశగా ‘మాస్కు ధారణ, భౌతిక దూరం అనుసరణ, చేతి పరిశుభ్రత పాటించడం’ అనే మూడు ముఖ్యసందేశాల వ్యాప్తి లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన పలు కార్యాలయాలు ఇవాళ ప్రతినబూనాయి. కోవిడ్ ద్వితీయ విజృంభణ ముప్పు ఉన్నందున ప్రజల ప్రాణరక్షణ లక్ష్యంగా నివారణ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో నొక్కి చెప్పారు.

తిరుపతికి చెందిన అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఒకటిన్నర నెల వ్యవధిలో రెండోసారి కరోనా వైరస్ సోకింది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1891 కొత్త కేసులు, 7 మరణాలు నమోదవగా 1878 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 285 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,08,535; క్రియాశీల కేసులు: 26,374; మరణాలు: 1208; డిశ్చార్జి: 1,80,953గా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో అవయవ మార్పించి ఉచితంగా చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సదరు చికిత్సలు ఇకపై ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం పరిధిలోకి వస్తాయి. మహారాష్ట్ర ముంబై మహానగరంలో గూగుల్‌ మ్యాప్ ద్వారా నియంత్రణ మండళ్లను గుర్తించేందుకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వినూత్నరీతలో గూగుల్‌ సంస్థతో జట్టుకట్టింది. తద్వారా గూగుల్ మ్యాప్‌లలో ఈ సమాచారం ముంబై పౌరులకు ఒక్క క్లిక్తో అందుబాటులోకి వస్తుంది. కోవిడ్-19పై అవగాహన ప్రచారం ‘ప్రజా ఉద్యమం’గా రూపొందుతున్న నేపథ్యంలో ప్రాచీన నలుపు/పసుపు రంగ టాక్సీల డ్రైవర్లు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఈ మేరకు కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి చేయాల్సిన, చేయకూడని వాటిగురించి ప్రజలకు తెలిసేలా సమాచార కరపత్రాలను తమ టాక్సీలలో అతికించారు.

గుజరాత్ రాష్ట్రంలో రాపిడ్ యాంటీబాడీ పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ ప్రయోగశాలలను అనుమతిస్తున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం- జిల్లాల్లో లేదా పురపాలికలలోని ముఖ్య ఆరోగ్య అధికారులు కొన్ని షరతులకు లోబడి ప్రైవేట్ ప్రయోగశాలలకు అనుమతి ఇస్తారు. అలాగే ఎలిసా, సీఎల్ఐఏ యాంటీబాడీ పరీక్షల నిర్వహణకూ ప్రైవేట్ ప్రయోగశాలలను అనుమతించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,487 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీ చేసిన తాజా కోవిడ్‌-19 మార్గదర్శకాల ప్రకారం- మధ్యప్రదేశ్‌లో రాజకీయ సభలకు 100 మందికిపైగా హాజరుకారాదన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది.

అయితే, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు తగురీతిలో భౌతిక దూరం పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలనుంచి ఛత్తీస్‌గఢ్‌ వచ్చేవారికి తప్పనిసరి నిర్బంధవైద్య పర్యవేక్షణ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు తెరవకూడదని కూడా నిర్ణయించింది. గురువారంనాటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది.

మరోవైపు ఛత్తీస్గఢ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా నవంబర్ 1న నిర్వహించే ప్రధాన కార్యక్రమాన్ని ఈసారి నిర్వహించరాదని నిర్ణయించింది. అసోం రాష్ట్రంలో నిన్న 1188 కొత్త కేసులు నమోదవగా, 2198 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అసోంలో మొత్తం కేసులు 1,91,397 కాగా, క్రియాశీల 30,767, మరణాలు 794గా ఉన్నాయి. మేఘాలయ రాష్ట్రంలో ప్రస్తుతం 2369 క్రియాశీల కేసులుండగా, 4832 మంది కోలుకున్నారు. నాగాలాండ్‌లో ఇవాళ 21 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది.