తిరుపతి, సెప్టెంబర్ 20 (న్యూస్‌టైమ్): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం 9.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, పిల్ల‌న‌గ్రోవితో ముర‌ళి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆల‌యంలోని ధ్వ‌జ‌స్థ‌భం వ‌ర‌కు స్వామివారిని చిన్న శేష వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు…

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చేలా భారీ ఏర్పాట్లు చేశారు. కాగా, శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో మొద‌టిరోజు శ‌ని‌వారం రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలో పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌రిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో అనుగ్ర‌హించారు. అనంత‌శ్చ అస్మి నాగానాం, స‌ర్పానాం అస్మి వాసుకిః తాను నాగుల‌లో శేషుడిని, స‌ర్పాల‌లో వాసుకిని అని సాక్షాత్తు ప‌ర‌మాత్మ చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషుడు త‌న శిర‌స్సుపై స‌మ‌స్త భూభారాన్ని మోస్తుంటారు.

ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుక‌లుగా, ఛ‌త్రంగా, వాహ‌నంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని ద‌ర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు డిపి.అనంత‌, శివ‌కుమార్‌, శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.