హైదరాబాద్, జులై 24 (న్యూస్‌టైమ్): రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌ను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి KS శ్రీనివాసరాజుతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కళల ఖజానాగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంతోమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారు.

వారందరికీ సంభందించిన డేటా బేస్, ఆన్‌లైన్, మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి KCR కళాకారులకు పూర్వవైభవం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.

అందులో భాగంగా కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలనే సంకల్పంతో మధ్యవర్తులకు తావు లేకుండా, మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా ఆన్‌లైన్ ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేసే విధానం, కళాకారుల డేటాబేస్‌ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి విషయాలు, యాప్ ద్వారా ప్రజలకు, కళాకారుల సమాచారం కోసం ప్రత్యేకంగా T-CULTURE పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ దేశంలోనే మొదటి ప్రయత్నం అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళాకారులకు సైతం సులభంగా ఉండేందుకు ఈ మొబైల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

అంతేగాక, కళాకారులకు ID కార్డ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని MEE SEVAతో అనుసంధానం చేశామన్నారు. ID కార్డు కావాలనుకునే కళాకారులెవరైనా తమ వివరాలు, వారి కళా ప్రదర్శన వివరాలు, వారి గురించి పత్రికలలో వచ్చిన కథనాలను మీ సేవ సెంటర్లలో సమర్పించి 30 రోజులలో తమ ID కార్డ్‌ను పొందవచ్చని మంత్రి వెల్లడించారు. ఈ యాప్ సౌకర్యం ఆగస్టు 1 2020 నుండి అందుబాటులో ఉంటుందన్నారు. మొదటి కార్డును కవి, కళాకారుడుగా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందించారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్. KTR జన్మదినం సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఒక విన్నూత్న మొబైల్ యాప్‌ను రూపొందించినందుకు శాఖ కార్యదర్శి KS శ్రీనివాసరాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here