యుద్ధ ప్రాతిపదికన పొగాకు వేలం

0
20 వీక్షకులు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్

ఒంగోలు, ఏప్రిల్ 18 (న్యూస్‌టైమ్): విపత్తు సమయంలో రైతులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన పొగాకు వేలం కేంద్రాలను తెరవాలని పొగాకు బోర్డ్ అధికారులు, కంపెనీల యజమానులను ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శనివారం స్థానిక ఎన్.టి.ఆర్ కళా క్షేత్రంలో పొగాకు బోర్డు అధికారులు, కంపెనీ యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. క్లిష్టమైన పరిస్థితులలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసిన అవసరం వుందని కలెక్టర్ చెప్పారు. రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పర్యావరణ విపత్తు చట్టం ప్రకారం రైతుల సంక్షేమం కోసం జిల్లా కేంద్రం ఒంగోలులో 2, టంగుటూరులో 2 వేలం కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

సంక్షోభంలో వున్న రైతులకు ఊరట కల్పించడానికి పొగాకు కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలు ముందుకు రావాలని ఆయన సూచించారు. వేలంలో పాల్గొనకుండా రైతులను ఇబ్బంది పెట్టాలని ఆయా కంపెనీలు ప్రయత్నిస్తే వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో 10 వేలం కేంద్రాలు వుండగా మార్చి 21వ తేదీన లాక్‌డౌన్‌తో పొగాకు కొనుగోళ్లు నిలిచాయన్నారు. జిల్లాలో 82.44 మిలియన్ కేజీల పొగాకు పండిందని, 3.64 మిలియన్ కేజీల పొగాకును ఆయా కంపెనీలు కొనుగోలు చేశాయని పొగాకు బోర్డు ప్రాంతీయ మేనేజర్ కలెక్టర్‌కు వివరించారు. వేలం కేంద్రాల్లో సుమరుగా 30 కంపెనీల బయ్యర్లు పాల్గొంటారని, అన్ని వేలం కేంద్రాల్లో 400 మంది ఉద్యోగులు, రైతులు, కూలీలు రావడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టి రైతులకు ఆశలు చిగురించేలా వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం, రవాణా వాహనాలకు ప్రత్యేక అనుమతులు, బయ్యర్లకు అనుమతులు ఇస్తామని ఆయన తెలిపారు. బోర్డు అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆదిశగా పనిచేయాలని ఆయన సూచించారు. పొగాకు బోర్డులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రకాశం భవనంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుచేస్తున్నామని ఆయన వివరించారు. వేలం కేంద్రాల వద్ద ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, తగు జాగ్రత్త చర్యల కోసం వైద్య సిబ్బందిని కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ జి.ఉమామహేశ్వరరావు, ఇండియన్ టొబాకో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చినబాబు, ఐ.టి.సి, జి.పి.ఐ, పోలిశెట్టి, ఏ.ఓ.ఐ, ప్రగతి, మారుతి కంపెనీల ప్రతినిధులు, రైతు నాయకులు మా రెడ్డి సుబ్బారెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here