నేడు జేఎన్‌టీయూకే దశాబ్ది ఉత్సవాలు

417

కాకినాడ, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ (జెఎన్‌టియుకె) ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 28వ తేదీన దశాబ్ధి ఉత్సవాలు జరిపేందుకు నిర్ణయించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు తెలిపారు. జెఎన్‌టియుకె కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించి దశాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

జెఎన్‌టియుకెలో నిర్వహిస్తున్న కోర్సులు, నిర్మించిన భవనాలు, నూతనంగా ప్రవేశపెట్టిన కోర్సులు, విదేశీ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ప్రవేశపెట్టిన కోర్సులపై, పరిశ్రమలతో అనుసంధానమైన విషయాలపై కూలంకుషంగా విశదీకరించారు. జెఎన్‌టియుకెలో బీటెక్‌ విద్యార్థులకు ఆన్‌ క్యాంపస్‌ 82% నుండి 90% ప్లేస్‌మెంట్స్‌, పిజి విద్యార్థులకు ఆన్‌ క్యాంపస్‌ 52% ప్లేస్‌మెంట్స్‌, ఐసిపి విద్యార్థులకు ఆన్‌ క్యాంపస్‌ 32% నుండి 40% ప్లేస్‌మెంట్స్‌ లభిస్తున్నాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఫుడ్‌ టెక్నాలజీలో బీటెక్‌ కోర్సును ప్రారంభించుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

జెఎన్‌టియుకె ప్రాంగణం అంతా సౌర విద్యుత్‌ సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, పర్యావరణ పరిరక్షణకై గ్రీన్‌ క్యాంపస్‌ను రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ గ్రీనరీ, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ వారితో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే వసతి గృహాలలో సెంట్రలైజ్డ్‌ డైనింగ్‌ హాల్స్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఎంహెచ్‌ఆర్‌డితో అనుసంధానమై ప్రారంభించామని, దీనికై రూ.10కోట్ల నిధులు సమకూరాయని తెలిపారు.

టిసిఎస్‌, విప్రో లిమిటెడ్‌, టుపుల్‌, సిఎస్‌యు వారితో డిజిటల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కొరకు అనుసంధానమై పలు ప్రాజెక్ట్‌లను చేపట్టామని తెలిపారు. ఫుడ్‌ టెక్నాలజీ భవనంలో ఫుడ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీని నెలకొల్పి పరిసర ప్రాంతాలలోని ఆహార పరిశ్రమలకు ఆహార తనిఖీలు చేపడుతున్నామన్నారు. దశాబ్ధి ఉత్సవ వేడుకలకు పూర్వ విద్యార్థి, ప్రిన్సిపాల్‌గాను, డైరెక్టర్‌గాను పనిచేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపిపిఎస్‌సి) ఛైర్మన్‌ డాక్టర్ పి.ఉదయభాస్కర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారన్నారు.

ఫ్యూచర్‌ ఇనిషీయేటివ్స్‌ అను అంశంపై ఆయన తన ప్రసంగాన్ని విశదీకరిస్తారన్నారు. ఈ నేపథ్యంలో జెఎన్‌టియుకె ఇంజనీరింగ్‌ కళాశాలలు, అనుబంధ కళాశాలల విద్యార్థులకు సాంస్కృతిక, క్రీడా పోటీలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించామని, విజేతలకు ఈనెల 28వ తేదీన జరిగే వేడుకల్లో బహుమతి ప్రధానం చేయనున్నామన్నారు. అంతేగాక దశాబ్ధి ఉత్సవాలు సందర్భంగా జెఎన్‌టియుకె సాధించిన విజయాలను సంపుటిగా చేసి ఒక సంచికను విడుదల చేయనున్నామన్నారు.

అలాగే అనుబంధ కళాశాలల్లో పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేస్తామన్నారు. స్మార్ట్‌ క్యాంపస్‌ ఇనిషీయేటివ్స్‌, అవుట్‌ కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఇంజనీరింగ్‌ కరిక్యులమ్‌, ఆవిష్కరణలు, అంకురార్పణల క్రియాశీలక పనితీరును వేగవంతం చేసేందుకు ఇంకను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

ఈనెల 28వ తేదీన జరగనున్న కార్యక్రమంలో జెఎన్‌టియుకెను ఉన్నత శిఖరాలకు చేర్చి ప్రపంచీకరణ సవాళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన విధి విధానాలు, సిద్ధాంతాలు, ప్రణాళికలపై చర్చాగోష్టి జరుగుతుందని, ఈ చర్చాగోష్టిలో జెఎన్‌టియుకె మాజీ ఉపకులపతులు, పాలకమండలి సభ్యులు, విద్యావేత్తలు కలిసి మేథోమథనం సాగించి అనువైన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. జెఎన్‌టియుకె ఉన్నతికి కృషి చేసిన మాజీ ఉపకులపతులను సన్మానిస్తామన్నారు.

ఈ వేడుకలకు మాజీ ఉపకులపతులు, పాలకమండలి సభ్యులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఉన్నత విద్యాశాఖాధికారులు, పూర్వ విద్యార్థులు, యూనివర్శిటీ అధికారులు తదితరులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్ ఐ.శాంతిప్రభ, రిజిస్ట్రార్‌, పిఆర్‌ఓ ప్రొఫెసర్ వి.వి.సుబ్బారావు, ఓఎస్‌డి ప్రొఫెసర్ వి.రవీంద్రనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.