కరోనాపై కఠిన వైఖరి: సీఎం

0
3 వీక్షకులు
కరోనాపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి

అమరావతి, మే 18 (న్యూస్‌టైమ్): కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై మంత్రులు, అధికారుల‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి సోమవారం స‌మీక్ష‌ించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నేదానిపై ప్ర‌తి ఇంటికీ క‌ర‌ప‌త్రం పంచాల‌ని, రెస్టారెంట్లు, మాల్స్ తిరిగి ప్రారంభ‌మ‌య్యేలా ఎస్‌ఓపీ తయారు చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశించారు.

‘‘రాష్ట్రం గుండా స్వగ్రామాలకు కాలినడకన వెళ్తున్న వలస కూలీలపై ఉదారంగా ఉండండి. కూలీల‌కు తాగునీరు, భోజ‌న ఏర్పాట్లు చేస్తూనే ప్రోటోకాల్స్‌ పాటిస్తూ 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం క‌ల్పించండి’’ అని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్. జవహర్‌ రెడ్డి హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. అంతర్‌ రాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలన్నదానిపై కూడా ఈ సమీక్షలో చర్చించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రాష్ట్రంలోకి రావాలనుకుంటున్నవారికి బస్సులు ఎలా ఏర్పాటు చేయాలి? అనే దానిపై కూడా సమీక్ష చేశారు. దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని జగన్‌ అధికారులకు సూచించారు. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ సర్వీసులు, మధ్యలో ఎక్కేందుకు అనుమతి ఇ‍వ్వకూడదని తెలిపారు. బస్టాండ్‌లో దిగిన తరువాత వారికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

కరోనాపై సీఎం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్న అధికారులు, మంత్రులు

బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని దాని వల్ల వారిని ట్రేస్‌ చేయడం సులభంగా ఉంటుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నిర్వహించాలని, బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడపాలని జగన్‌ నిర్ణయించారు. దీనిపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని, ప్రైవేట్‌ బస్సులు కూడా అనుమతినివ్వాలని సీఎం నిర్ణయించారు. ఇక బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పనిచేశారని జగన్‌ అభినందించారు. రాష్ట్రం గుండా నడిచివెళ్తున్నవారికి సహాయంగా నిలిచారన్నారు.

యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకున్నారని కొనియాడారు. ఇటువంటి సమయంలో వీళ్లు మన ఓటర్లా? మన రాష్ట్ర ప్రజలా? అని ఆలోచన చేయడం సరికాదని, మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఇది అని జగన్‌ పేర్కొన్నారు. కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు పోవాలని, ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణ సాధ్యమవుతుందని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వచ్చందంగా ఆరోగ్యపరిస్థితులను తెలియజేయడంపై దృష్టిపెట్టాలని జగన్‌ సూచించారు. ప్రజల్లో ఆందోళన, భయం తొలగించడానికి పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు.

ఇక కరోనా కారణంగా ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ సమీక్షలో చర్చించారు. కారులో ప్రయాణించేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. బస్సులో 20 మందికి మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రతి దుకాణంలో ఐదుగురు మాత్రమే ఉండాలని, పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మంది వరకే అనుమతి ఉందన్నారు. రెస్టారెంట్ల వద్ద టేక్‌ అవేకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. టేక్‌ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందే అని ఆదేశించారు. నైట్‌ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కొనసాగించాలని నిర్ణయించారు. అన్ని దుకాణాలకు ఉదయం 7 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ తెరుచుకునేందుకు అనుమతినిచ్చారు. వీటితో పాటు వార్డు క్లినిక్స్‌ ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. వచ్చే మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలని సీఎం ఆదేశించారు. విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా చూడాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు అదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here