ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే టూర్లలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు గిరిజనులను దింసా నృత్యానికి వాడుకుంటారు

ఏపీటీడీసీకి ఆదాయం.. ఆదివాసీలకు అంతంతమాత్రం

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా…

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

అందమైన కొండలు, కోనలు, వాగులు, వంకలు వున్న గిరిజన ప్రాంతంలో పర్యాటక రంగం మెండుగా అభివృద్ధి చెందుతున్నా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల జీవన స్థితిగతుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. తరతరాలుగా ఆదివాసీలు పాలకుల దోపిడీకి గురవుతున్నారు. నాడు బ్రిటిష్ వారి దగ్గర నుంచి నేటి పాలకుల వరకు చూస్తే నష్టపోయేది ఆదివాసీలు మాత్రమే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆదివాసీలకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు.

ఎన్నికల ముందు ఇస్తున్న హామీలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. గిరిజనులు అవిద్య, అనాగరీకరణ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చివరకు ప్రభుత్వాలు సైతం దగా చేస్తున్నాయి. తమకు ఎంతో మేలు జరుగుతుందని నమ్మి అదరిస్తున్న పార్టీలు సైతం అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో అదమరిచి వ్యవహరిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా, ప్రకృతిసిద్ధంగా వున్న వనరులను సైతం సొమ్ము చేసుకుని అడవికి, అదివాసీలకు మధ్య వున్న తల్లీ బిడ్డల బంధానికి విఘాతం కలిగిస్తున్నారు. గిరిజనేతరులు గిరిజన ప్రాంతంలో ఎలాంటి అమ్మకాలు గాని, కొనుగోళ్లు గాని, వ్యాపారాలు గాని చేయరాదని 1/70 లాంటి అనేక చట్టాలు చెబుతుండగా వీటన్నింటికి భిన్నంగా ప్రభుత్వం పాలన ముసుగులో ప్రణాళికాబద్ధంగా ఆదివాసీలకు చెందాల్సిన వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు, అనంతగిరిలో బొర్రా గుహలు పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. వందల సంవత్సరాల క్రితం గిరిజనులు కాగడాల ద్వారా బొర్రా గుహల్లోని చీకటిని ఛేదించి వెలుగులో అందాలను చూపించేవారు. తద్వారా పర్యాటకులు ఇచ్చే మొత్తంతో జీవించేవారు.

ప్రభుత్వం దీనికి భిన్నంగా అంతా మేమే చూస్తామన్న ధోరణితో గిరిజనుల బతుకుతెరువుల మీద పెత్తనం చేసే ప్రయత్నాలు మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానిక గిరిజనులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికారు. అయితే వాస్తవంగా నాల్గో తరగతి ఉద్యోగాలు తప్పితే అధికంగా జీతంవచ్చే జీతాలు గిరిజనులకు దక్కడం లేదు. గిరిజనుల అభ్యున్నతికి వీలుగా అటవీ పరిరక్షణ చట్టాలున్నప్పటికీ అవి సక్రమంగా అమలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) వారు అనంతగిరి మండలం బొర్రా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలను స్వాధీనం చేసుకున్నారు.

1997 నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తమ అధీనంలో నిర్వహిస్తూ అక్కడ గిరిజనులు కొంతమందికి మాత్రమే గైడ్లుగా అవకాశం కల్పించారు. పర్యాటక శాఖ బొర్రా ప్రవేశానికి, లోపల కెమేరా అనుమతికి రుసుం వసూలు చేస్తోంది. అలాగే ఈ ప్రాంతంలో రెస్టారెంట్, క్లాక్ రూమ్ లు కూడా వున్నాయి. వీటి ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా గిరిజనులకు మాత్రం అంతంతమాత్రంగానే నిధులు వెచ్చిస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వచ్చిన ఆదాయంలో 20 శాతాన్ని లెక్కగట్టి స్థానిక గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు చెల్లించడం ద్వారా గిరిజనులను ఆదుకుంటామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఎ/ఆర్, 199-77, 3297 మరియు 9098(8) సెక్షన్ నెంబర్ 191 వరుస సంఖ్య (జె) ప్రకారం నిధులు ఇస్తామని ఒప్పందం ఉన్నప్పటికీ గిరిజనులకు తగిన సహకారం దక్కడం లేదు. 1997 నుంచి జంగిల్ బెల్, తైడా, అనంతగిరి రీసార్ట్స్, అరకులోయలో పున్నమి వేలీ రెస్టారెంట్స్ ద్వారా నేటివరకు వందల కోట్లు సొమ్ము ఆర్జించారు. ఒక్క బొర్రా గుహల్లోనే 1997 నుంచి ఈ ఏడాది మార్చి వరకు 40 కోట్లు ఆదాయం వస్తుందని పర్యాటక శాఖ ఐటీడీఏ అధికారులకు తెలిపారు.

దీని ప్రకారం 23 సం.ల్లో బొర్రా గ్రామ పంచాయతీకి ఆదాయం 20 శాతంగా లెక్క కడితే రూ. 8 కోట్లు చెల్లించాల్సి వుంది. ఈ మేరకు 2015లో ఒత్తిడి చేస్తే రూ.15 లక్షలు చెల్లించారు. 2017లో మరో పది లక్షలు చెల్లించారు. మొత్తంగా 8 కోట్లకు 25 లక్షలు మాత్రమే చెల్లించారు. ఆ తరువాత ఐటీడీఏ పీఓ ఒత్తిడి మేరకు మరో 13 లక్షల 80 వేలు మాత్రమే చెల్లించారు. ఇప్పటికి ఇంకా 7 కోట్ల 61 లక్షల 25 వేల రూపాయలు చెల్లించాల్సి వుంది. ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో వున్న పర్యాటక శాఖ కోట్ల రూపాయలు వసూలు చేసి 20 శాతంగా వున్న ఏడు కోట్లకు పైగా మొత్తం బకాయి వుండటాన్ని బట్టి గిరిజన ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి పేరుతో ఎలా మోసం చేస్తున్నారో అర్ధమవుతుంది. కాఫీ పెంపకం విస్తారంగా జరుగుతున్నా తద్వారా కూడా గిరిజనులకు మేలు జరగడం లేదు. జీసీసీ, మైనింగ్ విభాగాల ద్వారా కూడా అదివాసీలకు అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు దక్కడం లేదన్న విమర్శలున్నాయి. అరుకు ఉత్సవ్, బెలూన్ ఫెస్టివల్ పేరిట అధిక మొత్తాన్ని వృథా చేస్తున్నారు తప్పితే ఆదివాసీల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయడం లేదు. మరోపక్క పాలకుల ఉదాసీన వైఖరిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వ్యక్తులు కూడా అనధికారికంగా గిరిజనుల భూములను దోచుకుంటున్నారు. రిసార్ట్స్, రెస్టారెంట్ పేరుతో వ్యాపారాలు సాగిస్తున్నారు.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్; +91 94919 99678, ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)