రైళ్ల రద్దు ఏప్రిల్ 14 వరకూ పొడిగింపు

78

న్యూఢిల్లీ, మార్చి 25 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ (కొవిడ్-19) కష్టాల నుంచి భారత్ ఇప్పుడప్పుడే భయటపడేలా లేదు. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించి ప్రజల్ని ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నప్పటికీ కొన్ని చోట్ల నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం స్తంభింపజేసినప్పటికీ పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరికొంత కాలం వేచిచూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇందులో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకూ ప్రయాణీకుల రైలు సేవలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అవసరమైన వస్తువుల సరఫరాను నిర్ధారించడానికి సరుకు రవాణా రైళ్లు ఆపరేషన్ మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. కొవిడ్-19 నేపథ్యంలో తీసుకున్న చర్యల కొనసాగింపుగా, భారతీయ రైల్వేలలో ప్రయాణీకుల రైలు సేవలను రద్దు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు (ప్రీమియం రైళ్లతో సహా), ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లను రద్దును వచ్చే నెల పధ్నాలుగు వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయినప్పటికీ, సరుకు రవాణా రైలు కార్యకలాపాలు మాత్రం యథావిథిగా కొనసాగనున్నాయి.