ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

85
  • 42 మందితో తొలి విడత జాబితా విడుదలచేసిన జీఏడీ

అమరావతి, జూన్ 22 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రభుత్వం పాలనా యంత్రాంగంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా తమకు అనుకూలమైన అధికారులతో పాలన మరింత సులభతరం చేయాలన్న యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన వెంటనే ఉన్నత స్థాయిలోని పలువురు అధికారులను బదిలీలు చేసి కొత్తవారిని నియమించిన జగన్ తాజాగా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీల ఫైల్‌ను క్లియర్ చేశారు. ఈ మేరకు 42 మంది అధికారులతో కూడిన జాబితాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) విడుదల చేసింది.

ప్రస్తుతం విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న జి.సృజనను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌గా నియమించడంతో పాటు అక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం. హరినారాయణను ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీచేసింది ప్రభుత్వం. అదే విధంగా రంజిత్ బాషాను రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌గా, గంధం చంద్రుడును ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, షాన్మోహన్‌ను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఎల్.శివశంకర్‌ను విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, లక్ష్మీ షాను తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, దినేష్ కుమార్‌ను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, హిమాన్షు సుఖ్లాను రాష్ట్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌గా, వి.చిన వీరభద్రుడును సర్వ శిక్ష అభియాన్ ఎస్పీడీగా, పి.రాజాబాబును సెర్ప్ సీఈవోగా, బి.రాజశేఖర్‌ను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా, వై.మధుసూదన్ రెడ్డిని మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్‌గా, బి.ఉదయలక్ష్మిని కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా, కాంతిలాల్ దండేను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శిగా, శశిభూషన్ కుమార్‌ను జీఏడీ సర్వీసెస్ కార్యదర్శిగా, ఆర్పీ సిసోడియాను జీఏడీ ముఖ్యకార్యదర్శిగా, ముద్దాడ రవిచంద్రను సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, ముఖేష్ కుమార్ మీనాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా, వాణీమోహన్‌ను సహకార శాఖ కమిషనర్‌గా, భానుప్రకాశ్‌ను ఖనిజాభివృద్ది సంస్థ ఎండీగా, డి.వరప్రసాద్‌ను కార్మిక శాఖ కమిషనర్‌గా, హెచ్.అరుణ్ కుమార్‌ను వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌గా, ప్రవీణ్ కుమార్‌ను ఏపీటీడీసీ ఎండీగా, కె.కన్నబాబును విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా, ప్రసన్న వెంకటేష్‌ను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా, ఎం. రామారావును బీసీ కార్పొరేషన్ ఎండీగా, కార్తికేయ మిశ్రాను ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా, ఎ. మల్లికార్జునను ఆరోగ్యశ్రీ సీఈవోగా, నాగలక్ష్మిని ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా, పీఎస్. గిరిషాను తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా, వి.విజయరామరాజునుఏపీ మార్క్‌ఫెడ్ ఎండీగా, కేవీఎన్ చక్రధరబాబును ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా, కె.మాధవిలతను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, కృతికా సుఖ్లాను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, ఎం. గౌతమిని కడప జేసీగా, పి.ప్రశాంతిని అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా, కె.శ్రీనివాసులును శ్రీకాకుళం జేసీగా, డి.మార్కండేయులును చిత్తూరు జేసీగా నియమించడంతో పాటు, వెంకయ్య చౌదరి, గుర్రాల శ్రీనివాస్, పి. కోటేశ్వరరావు, సి.నాగరాణిలను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.