నేటి నుంచి చంద్రబాబు యాత్ర

105

అమరావతి, ఫిబ్రవరి 19 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ అరాచక, విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం నుంచి ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని తెలుగుదేశం ప్రకటించింది. నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేసేందుకు ఏక తాటిపై కదలిరావాలంటూ పార్టీ శ్రేణులకు నాయకులు పిలుపునిచ్చారు.

వైసీపీ నియంతృత్వ పాలనను ప్రజలలో ఎండగట్టడమే ఏకైక నినాదంగా ఈ యాత్ర సాగనున్నట్లు టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో వెల్లడించింది. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా నష్టపోతున్నా ప్రభుత్వం గ్రహించే స్థితిలో లేదని, ఈ పరిస్థితి మారాలంటే ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాల్సి ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అందుకే ఫిబ్రవరి 19 నుండి చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర చేస్తున్నారని, ఈ యాత్రలో ప్రజలంతా పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.

మరోవైపు, చైతన్య యాత్రకు మార్టూరు ముస్తాబైంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అమరావతి రాజధాని మూడు ముక్కల అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దృఢసంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు బస్సు యాత్రను ఆయన నిర్వహించనుండగా తొలిరోజు బుధవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరు నుంచే ప్రారంభిస్తారు.

ఇది విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కల్పిస్తూ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యేలా ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ముందస్తుగా సమావేశమై సన్నాహాలు చేశారు. స్వయంగా పర్యవేక్షిస్తూ అధినేత పర్యటనలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధతో జాతీయ రహదారిపై బస్సు యాత్ర వచ్చే వీధులు, సభ నిర్వహించే కూడళ్లను పరిశీలించి సిద్ధం చేశారు.

అందులో భాగంగా జాతీయ రహదారి సర్వీసు మార్గంలో డేగరమూడి కూడలి నుంచి మార్టూరు, జొన్నతాళి, ఇసుకదర్శి, కోనంకి, కోలలపూడి కూడలి, బొల్లాపల్లి టోల్‌ప్లాజా వరకూ తోరణాలు, జెండాలు, ప్లెక్సీలతో పసుపుమయంగా మార్చారు. వేలాది మంది అభిమానులకు మార్గమధ్యలో అల్పాహారం, భోజనం వంటి సదుపాయాలను కల్పించారు.

ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాగంగా స్థానిక అద్దంకి బస్టాండ్‌లో బుధవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం జిల్లా తెదేపా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ పరిశీలించారు. సభకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకటరావు హాజరుకానున్నారు.

యాత్ర సందర్భంగా త్రోవగుంట నుంచి ఫైఓవర్‌ మీదుగా అద్దంకి బస్టాండ్‌ వరకు నిర్వహించనున్న ర్యాలీపై ఆయన పార్టీ నాయకులతో చర్చించారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దాయనేని ధర్మ తదితరులు ఉన్నారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు చంద్రబాబునాయుడు జిల్లా సరిహద్దులోని బొప్పూడి చేరుకుంటారని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. అక్కడి ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం చైతన్య యాత్ర ప్రారంభిస్తారన్నారు. ముందుగా యద్దనపూడి మండలం సూరవరపుపల్లె కూడలి నుంచి డేగరమూడి కూడలి, మార్టూరు చేరుకుంటారాని చెప్పారు. 11 గంటలకు స్థానిక ఎస్బీఐ ప్రధాన కూడలిలో ప్రజలనుద్దేశించి బస్సు పైభాగం నుంచే ప్రసంగిస్తారని, తర్వాత జొన్నతాళి కూడలిగా ఇసుకదర్శి క్యాంపు కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలువేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. 12 గంటలకు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద అద్దంకి నియోజకవర్గంలోని ప్రవేశిస్తారని వివరించారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరై అధినేత బస్సు యాత్రను దిగ్విజయం చేయాలని కోరారు.