ప్రగతిపథంలో గిరిజన గ్రామం

2090

విశాఖపట్నం, మార్చి 16 (న్యూస్‌టైమ్‌): విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలానికి చెందిన ఎంకె పట్నం సమీపంలోని ఒక జనావాస ప్రాంతం. అక్కడ కేవలం 16 గిరిజన కుటుంబాలు మాత్రమే నివాసముంటున్నాయి. వీళ్ళందరికీ కలిపి గుట్టలు, పొదలు, రాళ్ళూరప్పలతో కూడిన 48 ఎకరాల భూమి ఉంది. ఏళ్ళ తరబడి అక్కడ మనుష సంచారం కూడా లేకపోవడంతో ఆ భూముల వద్దకు వెల్లేందుకు వీరు భయపడేవారు. ఉపాధి హామీ కార్యకలాపాల గురించి తెలుసుకున్న ఈ గిరిజనులంతా అధికారులను కలిసి తమ భూమికి కూడా సాగు యోగ్యం కల్పించమన్నారు.

విషయం తెలుసుకున్న ఉపాధి హామీ అధికారులు వారి కోసం 2,83,854 రూపాయల విలువైన పనిని, 2,806 పనిదినాలను మంజూరు చేశారు. ప్రభుత్వం స్పందించి సహకారం అందించేందుకు ముందుకు రావడంతో ఆ 16 కుటుంబాలవారూ తామే పనివాళ్ళుగా మారి 6 నెలలు కష్టపడి భూమిని చదునుచేశారు. ఉపాధి హామీ అధికారులే కాకుండా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సైతం వీరి పనులను పర్యవేక్షించి సలహాలను అందించారు. అంతే, 48 ఎకరాల బంజరు భూమి కాస్తా చిన్న చిన్న కమతాలుగా మారింది. వాననీటిని ఒడిసిపట్టే ఏర్పాట్లు కూడా కల్పించుకున్నారు.

ఇప్పుడా పొలంలో ఖరీఫ్‌లో వరిని వేసి రెండో పంటగా పత్తి, కంది, టొమోటో పంటలను వేస్తున్నారు. ఆ 16 గిరిజన కుటుంబాలు ఇప్పుడు రైతులుగా సగర్వంగా జీవిస్తున్నారు. తాము పండించిన పంటలో తమ అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలినది అమ్ముకుంటూ ఆనందంగా ఉన్నారు. తమ జీవితాల్లో వెలుగు తెచ్చిన ఉపాధిహామీ పథకాన్నీ హర్షిస్తూ, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.