గోపరాజు రామచంద్రరావు

‘గోరా’గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు ప్రఖ్యాత సంఘ సంస్కర్తగా అందరికీ తెలుసు. కానీ, ఆయనలోని కనిపించని హేతువాదం, సామాజిక మార్పు తీసుకువచ్చే ఆశయం చాలా తక్కువ మందికే తెలుసు. భారతీయ నాస్తికవాద నేతగా గుర్తింపుపొందిన ‘గోరా’ 1902 నవంబరు 15న ఒడిశాలోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్‌పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.

గోరా, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఛత్రపురంలో 1902, నవంబరు 15న ఉన్నతకుల హిందూ కుటుంబంలో వెంకటసుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. పర్లాకిమిడిలో ప్రాథమిక విద్యాభాసం పూర్తిచేసిన తర్వాత 1913లో పిఠాపురం రాజా కళాశాల ఉన్నత పాఠశాలలో చదివారు. 1920లో పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన గోరా, అప్పుడే ప్రారంభమౌతున్న సహాయ నిరాకరణోద్యమంలో దూకాడు. 1922లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వృక్షశాస్త్రంలో బీఏ చేశారు.

1922లో సరస్వతి గోరాని ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. వివాహనంతరం మధురలోని మిషన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో ప్రత్తి పరిశోధనా సహాయకుడిగా, తర్వాత కొలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకునిగా, 1928లో కాకినాడ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. తాను నడిచే మార్గం తండ్రికి ఇష్టం లేకపోవడంతో 1928లో భార్యపిల్లలతో ఇంటిని వదిలేసి వచ్చాడు. స్వతంత్ర భావాలుగల గోరా ఎక్కడా ఉద్యోగంలో నిలువలేకపోయాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వృక్షశాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యాడు. గోరా పాతికేళ్ళ వయసు వరకు ఆస్తికుడే.

ఆ తరువాత నాస్తిక సిద్ధాంతాలతో జీవితాంతం గోరా కృషిచేశాడు. సంఘం, ఆర్ధిక సమత అనే పత్రికలు నడిపారు. వర్ణవ్యవస్థ, అంటరానితనంపై యుద్ధాన్ని ప్రకటించిన గోరా 1940లో భార్యతో కలసి 1940, ఆగస్టు 10న కృష్ణా జిల్లా, ముదునూరులో ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని 80 మంది యువకులతో గోరా ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభంతో గోరా జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది. 1940 నుంచి 1944 వరకు అక్షరాస్యత, అస్పృశ్యత, సహపంక్తి భోజనాలు వంటి ఉద్యమాలు మడనూరు చుట్టుపక్కల నిర్వహించారు. భారతదేశ స్వాతంత్ర్యం వస్తున్న సందర్భంగా, 1947 ఏప్రిల్లో, నాస్తిక కేంద్రాన్ని విజయవాడలోని పటమటకు తరలించాడు.

1944లో మహాత్మా గాంధీ కోరిక మేరకు అఖిల భారత కాంగ్రేస్‌ ఆర్గనైజర్‌గా అలహాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధునిగానేకాక, సాంఘిక, ఆర్థిక సమానత్వ సాధనకు, మూఢ నమ్మకాల నిర్మూలనకు, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కుల, మత తత్వాల నిర్మూలనకు అనితర కృషి గోరా చేశారు. గాంధీతో నాస్తికత్వంపై చర్చలు జరిపి, అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేసారు. దళితుల దేవాలయ ప్రవేశాన్ని, సమష్టి భోజనాలను, వివాహాలను విస్తృతంగా ఆయన నిర్వహించారు. ఈ విధంగా సాంఘిక సమానత్వ సాధనకు పెద్దఎత్తున కృషి చేయడమేకాక నాస్తికత్వాన్ని నిర్మాణాత్మక జీవిత విధానంగా ప్రతిపాదించారు. దైవకేంద్ర సమాజం నుంచి మానవ కేంద్రం సమాజంవైపు పురోగమించడానికి మతానంతర సామాజిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఎంతగానో తపించారు. 1949, జనవరి 30న గోరా సంపాదకత్వంలో సంఘం తొలి సంచిక వెలువడింది.

ఆ తరువాత గాంధీ పేరుతో సంఘం స్థాపించాడు. 1962-63లో భారతదేశమంతా పర్యటించి పార్టీ రహిత ప్రజాస్వామ్యం, నిరాడంబరత్వం గురించి విశేష ప్రచారం చేశాడు. పార్టీరహిత ప్రజాస్వామ్య సిద్ధాంతంపై ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను ఒకే వేదికపైకి తెచ్చి కామన్‌ ప్లాట్‌ఫారం పద్ధతి ప్రవేశపెట్టిన ఘనత గోరాదే. సెక్యులర్‌ వ్యవస్థతో పాటు నాస్తికత్వ వ్యాప్తికీ గోరా ఐదు ఖండాలలో విస్తృతంగా పర్యటించారు. స్వంత ఆస్తి అనేది లేకుండా, పూర్తిగా ప్రజలపై ఆధారపడి తన కార్యక్రమాలు కొనసాగించారు.

1968 జనవరిలో ది ఏథిస్ట్ అనే ఇంగ్లీషు మాసపత్రిక ప్రారంభించి అంతర్జాతీయ సంబంధాలు పెంచుకున్నారు. 1972లో విజయవాడలో మొట్టమొదటి ప్రపంచ నాస్తిక మహాసభలను నిర్వహించారు. అదేవిధంగా 1980లో రెండవ ప్రపంచ నాస్తిక మహాసభలు కూడా విజయవాడలో నిర్వహించగా, 3వ ప్రపంచ నాస్తిక మహాసభలు ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీలో నిర్వహించారు.

గోరాకు తొమ్మిది మంది సంతానం. గోరా తన కుమారులకు వారు పుట్టినప్పటి ప్రపంచ, దేశ పరిస్థితులకు అద్దం పడుతూ విలక్షణమైన పేర్లు పెట్టాడు. ఉప్పు సత్యాగ్రహం సాగుతున్న కాలంలో పుట్టిన కుమారునికి లవణం అని, భారతీయులు చట్ట సభల్లో నిలిచి గెలిచిన కాలంలో పుట్టిన కొడుక్కు విజయం అని, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టిన కుమారులకు సమరం, నియంత అని, తొమ్మిదవ సంతానానికి నవ్ అని పేర్లు పెట్టారు. గాంధీ ఇర్విన్ ఒడంబడిక సందర్భంలో పుట్టిన అమ్మాయికి మైత్రి అని పేరుపెట్టాడు.

మరో కుమార్తె పేరు మనోరమ. ఈ విధంగా సముచితమైన పేర్లు పెట్టే విధానానికి ఆద్యుడయ్యాడు. గోరా ఆచరణ వాది. గ్రహణం సమయంలో గర్భిణులు బయట తిరిగినంతమాత్రాన పుట్టబోయే పిల్లలకి గ్రహణం మొర్రి రాదు అని నిరూపించడానికి గోరా తన భార్యకు గర్భం వచ్చిన ప్రతిసారి గ్రహణం సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెని బయటకి తీసుకువెళ్ళి తిప్పేవారు. గోరా పిల్లలలో ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. గోరా సతీమణి సరస్వతి గోరా కూడా భర్త అడుగుజాడల్లో నడిచారు. ఈమె సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, ఇన్ని కులాలు, మత విశ్వాసాలుంటే సాధ్యంకాదు.

నాస్తిక వాదమొక్కటే శరణ్యం. కులమత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. ఈమె విజయనగరంలో 1912లో జన్మించింది. పదేళ్ల వయసులో గోరాతో పెళ్ళయ్యింది. గోరాతో పాటు సరస్వతీ గోరా 1928 ప్రాంతాల్లో శ్రీలంకలో ఉన్నారు. మతాచారాల్ని ధిక్కంచారు. పైగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కావాలని గ్రహణం చూశారు. రాహువు, కేతువులు మానవ సమాజంలోనే ఉన్నారన్నారు. నిప్పులమీద నడవడమనేది దేవతల మహాత్మ్యం కాదని ఎవరైనా నడవవచ్చని ఆమె స్వయంగా నిప్పుల మీద నడచి రుజువు చేసింది.

దేవదాసీ వ్యవస్థ భ్రష్టాచారమంటూ దేవదాసీలకు స్వయంగా వివాహం జరిపించారు. కుల నిర్మూలన, నాస్తిక వాదాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్లు జైలుశిక్ష అనుభవించారు. అస్పృశ్యతా నివారణ ఉద్యమం చేపట్టారు. మహాత్మా గాంధీజీ ఆమె సేవల్ని గుర్తించి సేవాగ్రామ్ ఆహ్వానించారు. ఆహార కొరత ఉన్న రోజుల్లో కూరగాయలు పండించాలని ఉద్యమించారు. ఈనాం భూముల్ని పొలాలు లేని రైతులకు పంచాలని సత్యాగ్రహం చేపట్టారు. ఆచార్య వినోబాభావే చేపట్టిన సర్వోదయ ఉద్యమాన్ని చేపట్టి దేశమంతా పర్యటించి వినోబాభావే ఆశయాలకు వ్యాప్తి కల్పించారు. మతాన్ని సూచించే ఏ ఆభరణాలు, చిహ్నాలు ఆమె ధరించే వారు కాదు. పుణ్యవతిగా బొట్టు, కాటుక, గాజులు, మంగళసూత్రాలు వంటివి ధరించలేదు.

1975 జూలై 26న గోరా మరణించినప్పుడు ఆమె అభిమతానికి అనుగుణంగా ఏ మత సంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు. ‘‘దేవుడు అబద్ధం. నీతి పెరగాలంటే దైవభావం పోవాలి. జాతి, మతం, కులం పేరుతో ప్రజల మధ్య విషం పెరుగుతున్నది. నాస్తికంలో ఈ వివక్షలకు తావులేదు. దేవుడు, కర్మ అనే భావాలు పోతే, మనిషి మతస్తుడిగా కాకుండా మానవుడిగా మిగులుతాడు. సోదరభావం పెరుగుతుంది.’’ అని గోరా భావించాడు. 1975, జూలై 26న విజయవాడలో భారత గ్రామీణ సమాజంలో మార్పులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై ప్రసంగిస్తూనే గోరా తుదిశ్వాస వదిలాడు. 2002లో గోరా శత జయంతి సందర్భంగా, భారత ప్రభుత్వ తపాలాశాఖ గోరా స్మృత్యర్ధం, 5 రూపాయల విలువ కలిగిన ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు.

గోపరాజు రామచంద్రరావుకు నివాళిగా 2002లో ఇండియా పోస్టు విడుదల చేసిన అయిదు రూపాయల తపాలా బిల్ల

మానవులు పుడతారు, చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు… వీరిని ‘మృతంజీవులు’ అని అంటారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు. తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ గోరా గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేద్దాం.

గోరా అణగారిన దళితులకోసం ఎంతగానో పాటుబడ్డారు. దళితులకు అగ్రకులం అంటూ తేడా లేదని జాషువా కుమార్తెను తన కొడుక్కి చేసుకుని ఆదర్శం అంటే ఇదీ అనిపించారు. ఇంక ఆయన కుమార్తె మనోరమను ఓ నిరుపేద దళితునికిచ్చే పెళ్ళి చేసారు. ఆయన్ని ఎక్కడా ఎవరూ తలవనే తలవరు. సంఘం ఆర్థిక సమత అంటూ దళితులతోనే జీవించారు. ఏరీ ఆయన్ని ఏ ఒక్క దళితుడూ తలవడే. ఆ మధ్య ఆయన కుమార్తె చనిపోయినా ఎవరికీ తెలియలేదు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనడమే కాదు సేవాగ్రామ్ అంటూ ఇతరులు వెలి వేసినా వారితోనే జీవించారు. ఉద్యోగం నుండి తీసివేసినా వెరవలేదు దళితుల అభ్యునన్నతికే పాటుబడ్డారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ బ్రతికి కేవలం ఉపన్యాసాలు దంచినవారికి మాత్రం అజేయం అమేయమైన కీర్తి.

గోరా అనేక రచనల్లో ప్రచురితమైన కొన్ని…

 • నాస్తికత్వం(దేవుడులేడు) 1941
 • దేవుని పుట్టుపూర్వోత్తరాలు 1951
 • జీవితంనేర్పిన పాఠాలు 1976
 • నేను నాస్తికుణ్ణి 1976
 • సృష్టి రహస్యం 1976
 • సంఘదృష్టి 1980
 • ఆర్ధిక సమానత్వం 1980
 • నాస్తికత్వం-ప్రశ్నోత్తరాలు 1980
 • నాస్తికత్వం -ఆవశ్యకత 1980
 • ఎన్ ఏథిస్ట్ విథ్ గాంధీ 1951
 • పాజిటివ్ ఏథీయిజమ్ 1972
 • వి బికమ్ ఏథీస్ట్స్
 • ఐ లెర్న్ 1976
 • పీపుల్ అండ్ ప్రోగ్రెస్ 1981
 • ఏ నోట్ ఆన్ ఏథీయిజమ్ 1981
 • ద నీడ్ ఆఫ్ ఏథీయిజమ్