పెట్టుబడి రాయితీ కోసం టీఆర్ఎస్ వినతి

183

న్యూఢిల్లీ, నవంబర్ 20 (న్యూస్‌టైమ్): పెట్టుబడి రాయితీ కింద తెలంగాణలో రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నట్లు తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి లోక్‌సభలో తెలిపారు. ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఎకరాకు రూ.10వేల రాయితీ ఇవ్వాలని కోరారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా జరిగిన చర్చలో రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆదాయం పెరుగుదల అంశంపై లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడి రాయితీ కింద కేంద్రం మాత్రం ఐదు ఎకరాలకు రూ.6 వేలు మాత్రమే అందజేస్తోందని చెప్పారు. కానీ, తెలంగాణలో ఐదు ఎకరాల భూమి ఉన్న రైతుకు రూ.50 వేల సాయం అందుతోందని తెలిపారు.

దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా స్పందిస్తూ రైతులకు పెట్టుబడి రాయితీని కేంద్రం మొదటిసారిగా అమలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రూ.6వేలు చొప్పున అందించే ఈ ప్రోత్సాహకం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాయని చెబుతూ రైతులకు ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.