విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి (న్యూస్‌టైమ్): ఒకప్పుడు తెలుగుదేశంలోకి సాధారణ కార్యకర్తగా వచ్చిన గోమాడ వాసు ఇవాళ అదు పార్టీకి పారిశ్రామిక రాజధాని అయిన విశాఖపట్నం గాజువాక నియోజకవర్గానికి కీలక నేతగా ఎదిగారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వైఎస్ జగన్ నాయక్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా ఆయన అటువైపు ఆకర్షితులవలేదు.

బీసీ రోడ్డులోని ఎన్టీఆర్ కూడలి పార్కులో మొక్కలు నాకుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

‘అన్న’ నందమూరి తారక రామారావు అంటే ఆయనకు అమితమైన ప్రేమాభిమానం. బహుశా, అదేనేమో ఆయన్ని పార్టీకి అంకితమయ్యేలా చేసింది. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, స్టూడియో అధినేత‌గా, ముఖ్య‌మంత్రిగా ఇలా అన్నిరంగాల‌లోను త‌న‌దైన ముద్ర వేసుకున్న విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌కరామారావు.

బహుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన ఎన్టీఆర్ పౌరాణికం, జాన‌ప‌దం, సాంఘికం, చారిత్రాత్మ‌క పాత్ర‌ల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. ఇక రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న చేసిన సేవ‌లు అశేషం. నేడు ఎన్టీఆర్ 25వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆ మ‌హానుభావుడిని ప్ర‌తి ఒక్క తెలుగోడు స్మ‌రించుకుంటున్నారు.

ఇదే సందర్భంగా గాజువాక బీసీ రోడ్డు కాకతీయ ఐటీఐ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు ఎగబడ్డారు టీడీపీ శ్రేణులు. అయితే, నాయకులు మాత్రం తక్కువనే చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి వార్డుల్లో హల్‌చల్ చేసిన ఏ నాయకుడూ ఇవాళ్టి కార్యక్రమంలో కనిపించకపోవడం శోచనీయం.

చేయరాని అడ్డమైన తప్పులు చేసి పార్టీ నేతల దృష్టిలో పరువు పోగొట్టుకున్న వారినెవరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయవద్దన్నది పార్టీ సిద్ధాంతమైనప్పటికీ ఆయా నాయకులు కనీసం ‘అన్న’ విగ్రహం ఇరుపక్కలకు కూడా రాకపోవడంలో ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. గోమాడ వాసు తన అనుచరులు, అభిమానుల సహాయంతో ఒంటిచేతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వద్ద మన్ననలు పొందారు.

మాజీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ ప్రసాదుల శ్రీను, ఇతర నాయకులు, మహిళా నాయకులతో సమన్వయం చేసుకుని గోమాడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. బీసీ రోడ్డులో ఎన్టీఆర్ వర్ధంతి ఎలా జరుగుతుందో చూద్దామని అప్పటి వరకూ ఎదురుచూసిన ప్రత్యర్ధులు చివరికి ముక్కున వేలేసుకునేలా చేశారు వాసు.

ఇతర వార్డుల నాయకులకు సైతం స్ఫూర్తిగా నిలిచేలా గోమాడ వాసు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ఎమ్మెల్యే కార్యక్రమం తర్వాత చాలా మంది పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అది చూసిన ప్రతిఒక్కరూ తెలుగుదేశానికి తిరుగులేదన్న వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.

ఇక, జూనియ‌ర్ ఎన్టీఆర్, నందమూరి క‌ళ్యాణ్ రామ్‌లు త‌మ ట్విట్ట‌ర్ వేదిక ద్వారా త‌మ తాత‌ని స్మరించుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ ధ్రువ తార మీరే అంటూ కామెంట్ చేశారు. ఇక నారా రోహిత్ 25వ వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ ఎన్టీఆర్ ఫొటో ఒక‌టి షేర్ చేశారు. యన్టీఆర్ తన 44 ఏళ్ళ సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై చెరగని ముద్ర వేసారు. హిందీలో ‘నయా ఆద్మీ’, ‘చండీ రాణి’ అనే రెండు సినిమాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించారు.

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు అమరావతికి బయలుదేరి వెళ్లారు. అటు ఉదయం 9 గంటలకు రసుల్‌పుర నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు నిర్వహించిన అమరజ్యోతి ర్యాలీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి సుహాసిని పాల్గొన్నారు.

10 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో లెజండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను తెలంగాణ తెలుగుదేశం ఏర్పాటు చేసింది. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

అనకాపల్లిలో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న మళ్ల సురేంద్ర

కాగా, విశాఖ జిల్లా అనకాపల్లి చిన్న హై స్కూల్ వద్ద వేగి వీధిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మళ్ళ సురేంద్ర నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మంచి ఆశయాలతో తెలుగుదేశంని స్థాపించారని, ఎన్టీఆర్ భారతదేశంలోనే గుర్తింపు పొందిన వ్యక్తిని, ఆయన నటించిన చిత్రాలు నేటికి కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటున్నాయని, ఆయన ఆశయాలను కార్యకర్తలు అందరూ అనుసరించి మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని తెలియజేశారు. కార్యక్రమంలో మరిసెట్టి శంకర్రావు, వేగి కృష్ణ, పేతకంశెట్టి వెంకట్ రావు, సాలపు నాయుడు, కొణతాల తులసి, కారుబాబు, కర్రీ నాయుడు, దొడ్డి జగదీశ్, పెంటకోట వర ప్రసాద్, మందుగుడు రవి, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.