కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో నది స్నానాలకు నిరాకరణ…

కర్నూలు, మహబూబ్‌నగర్, నవంబర్ 20 (న్యూస్‌టైమ్): కొవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. నది స్నానాలకు అనుమతించనప్పటిక భక్తులు, యాత్రికుల కోరిక మేరకు అధికారులు జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో విస్తృత ఏర్పాట్లే చేశాయి.

పుష్కరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 1వరకు తుంగభద్ర పుష్కరాలు కొనసాగుతాయని అన్నారు. పుష్కరాలకు సబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఘాట్‌లలోకి అనుమతిస్తామని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నది స్నానాలను పూర్తిగా నిషేధించినట్టు మంత్రి చెప్పారు. తెలిపారు.

పుష్కరాాల సందర్భంగా ఏర్పాటుచేసిన స్వాగత తోరణం

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని చెప్పారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పుష్కరాల పేరిట వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మరోవైపు తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని సూచించారు. ఈ మేరకు ఘాట్ల వద్ద స్ప్రింకర్లను ఏర్పాటు చేశారు. ఇంకోవైపు, అలంపూర్‌ పుష్కరఘాట్‌ వద్ద తుంగభద్ర నది పుష్కరాల ప్రారంభోత్సవానికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై స్థానిక ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు.

అలంపూర్‌ ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మధ్యాహ్నం 1:23 గంటలకు మంత్రులు అధికారికంగా పుష్కరాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ముందు నుంచే అనుమతించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నందువల్ల సీఎం కేసీఆర్‌ రావడం లేదని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. వరప్రదాయినిగా సాగునీరై పసిడి పంటలతో ఆకలి తీర్చుతూ తీరం పొడవునా పుణ్యక్షేత్రాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ భక్తులను పుణీతులను చేసే తుంగభద్ర తల్లికి పుష్కర సమయం ఆరంభమైంది. కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ర్పాట్లు పూర్తి చేశారు.

అలంపూర్‌తోపాటు పుల్లూరు, రాజోళి, వేణిసోంపురం ఘాట్లను సిద్ధం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సారిగా జరుగుతున్న ఈ పుష్కరాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. తాగునీటి సౌకర్యంతోపాటు ఘాట్ల వద్ద షవర్లు, విద్యుద్దీపాలు, పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. అయిజ నుంచి 15 కిలోమీటర్లు, గద్వాల నుంచి అయిజ మీదుగా 45 కిలోమీటర్లు, అలంపూర్‌ చౌరస్తా నుంచి 57 కిలోమీటర్లు, రాయిచూర్‌ నుంచి వేణిసోంపురం 63 కిలోమీటర్లు, అలంపూర్‌ చౌరస్తా నుంచి శాంతినగర్‌కు 29 కిలోమీటర్లు, అక్కడి నుంచి 9 కిలోమీటర్లు, గద్వాల నుంచి అయిజ మీదుగా 68 కిలోమీటర్లు, కర్నూల్‌ నుంచి సుంకేసుల మీదుగా 30 కిలోమీటర్లు రాజోళి ఘాట్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

పుష్కరఘాట్లలో జల్లు స్నానానికి ఏర్పాటుచేసిన స్పింక్లర్లు

ఇక, పుల్లూరు ఘాట్‌‌కు ఉండవెల్లి మండలంలోని ఈ ఘాట్‌కు చేరాలంటే 44వ హైవేపై ఉన్న అలంపూర్‌ చౌరస్తా నుంచి 7 కిలోమీటర్లు, గద్వాల నుంచి 55 కిలోమీటర్లు, కర్నూల్‌ నుంచి 12 కిలోమీటర్లు వెళ్లాలి. అలాగే, అలంపూర్‌ ఘాట్‌‌కు హైదరాబాద్‌-బెంగళూరు హైవేకు ఎడమ వైపునకు 15 కిలోమీటర్లు వెళ్లాలి. భాగ్యనగరం నుంచి 215 కిలోమీటర్ల దూరం. కర్నూల్‌ నుంచి 30 కిలోమీటర్లు, రాయిచూర్‌ నుంచి 113 కిలోమీటర్లు, మహబూబ్‌నగర్‌ నుంచి 128 కిలోమీటర్లు, గద్వాల నుంచి 61 కిలోమీటర్లు దూరం వెళ్లాలి.

తుంగే పానీ గంగే స్నానే అన్నది ఆ ర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పు ణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం. అ త్యంత ప్రాశస్త్యమున్న తుంగభద్ర నదీ పుష్కరాలకు భక్తులు సైతం అదేస్థాయిలో ప్రాధాన్యమిస్తారు. తుంగభద్ర పుష్కరాలను అత్యం త కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. నేటి నుంచి 12 రోజుల పాటు జరిగే పుష్కరాల నిర్వహణ ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణులు, 65 ఏళ్ల పైబడిన వారికి అనుమతి లేదు. కరోనా నెగటివ్‌ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కర ఘాట్లోకి అనుమతిస్తారు. టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ అనంతరం అనుమతి ఇవ్వనున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి పుష్కరఘాట్‌ వద్దకు అనుమతి నిరాకరించనున్నారు.

పశ్చిమ కనుమల నుంచి మొదలై…

కర్ణాటక ఎగువ భాగాన ఉన్న పశ్చిమ కనుమలలో ఉద్భవించినవే తుంగ, భద్ర నదులు. ఈ రెండు నదులు కలిసి తుంగభద్రగా మారి కర్ణాటకలో కృష్ణా పరీవాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ ఏపీలో కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద ప్రవేశిస్తుంది. తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కుటుకనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం పులికల్‌, రాజోళి, పుల్లూరు మీదుగా సాగుతూ నదీ తీరంలో కొలువైన దేవాదిదేవతల పాదాలను అభిషేకిస్తూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర నది రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో సంగమం అవుతుంది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో కృష్ణ, తుంగభద్రలు జలకళను సంతరించుకున్నాయి. అలంపూర్‌ పుణ్యక్షేత్రం వద్ద భక్తులు స్నానాలు చేయడానికి విశాలమైన పుష్కర ఘాట్లు సిద్ధంగా ఉన్నాయి.

పుష్కరాల నేపథ్యంలో కేసీ కెనాల్‌ ఇండెంట్‌ మేరకు 12 రోజుల పాటు 2.592 టీఎంసీల నీటిని టీబీ డ్యాం నుంచి విడుదల చేయనున్నారు. దీంతో పుష్కలంగా నీటి లభ్యత ఉండనున్నది. నదీ స్నానానికి అనుమతి ఇచ్చినా జల్లు స్నానాలు చేయడమే శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతనే పుష్కరస్నానానికి అనుమతి ఇస్తారు. ఆరేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడిన వృద్ధులు, గర్భిణులకు ప్రవేశం లేదు.

పుష్కర స్నానం.. పుణ్య ఫలం…

విద్యుత్ కాంతుల మధ్య తుంగభద్ర నది వారధి అందాలు

ఒక్కో రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు వస్తాయి. అందుకే 12 నదులను పుష్కర నదులని, 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని పిలుస్తారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27, తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు, నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి. ఇక శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుందని అంటారు. ఈ సమయంలో ఆ నదిలో స్నానమాచరించిన వారి పాపాలు తొలిగి పుణ్యం సిద్ధిస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి.

పీఠాధిపతుల ప్రత్యేక పూజలు…

అలంపూర్‌ క్షేత్రంలో శుక్రవారం మంత్రుల సమక్షంలో పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. మొదట దేవతా స్నానం, యతి స్నానం, రాజ స్నానం చేశారు. ఈ పవిత్ర కార్యక్రమాల కోసం పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి, తొగుట శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదనానందస్వామి, సాయి ధామం ఆశ్రమ అధిపతి రఘునందన స్వామి హాజరయ్యారు. తెలంగాణలో తుంగభద్ర కేవలం జోగుళాంబగద్వాల జిల్లాలోని అలంపూర్‌ నియోజకవర్గంలో మాత్రమే ప్రవహిస్తుంది. అయిజ మండలం కుటుకనూరు వద్ద ప్రవేశించి అలంపూర్‌ దాటిన తర్వాత గొందిమల్ల వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. రాష్ట్రంలో 90 కిలోమీటర్ల మేర తుంగభద్ర ప్రవాహం సాగుతుంది. ప్రస్తుతం కొవిడ్‌ నిబంధనల మేరకు కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు.

అయిజ మండలం వేణిసోంపురం, రాజోళి మండల కేంద్రం, ఉండవెల్లి మండలం పుల్లూరు, అలంపూర్‌ మండల కేంద్రాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఈ ఘాట్ల వద్ద మాత్రమే స్నానం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం తదితర మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వలంటీర్లు సైతం నిరంతర సేవలు అందించనున్నారు. గద్వాల ఆర్డీవో రాములు నోడల్‌ అధికారిగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. కర్నూల్‌ నగరంలోనే ఎనిమిది ఘాట్లు సిద్ధం చేశారు. కర్నూల్‌లోని సంకల్‌భాగ్‌పుష్కర ఘాట్‌ను సీఎం జగన్‌ సందర్శించి పుష్కరాలు ప్రారంభించనున్నారు. మంత్రాలయం పుష్కర ఘాట్‌కు భక్తులు భారీగా హాజరయ్యారని అధికారులు తెలిపారు.

తుంగభద్ర తీరాన ఆలయాలు…

శృంగేరి శారదాంబ దేవాలయం (చిక్మగుళూరు), పంపావతి దేవాలయం(కంప్లి), హరిహరేశ్వర దేవాలయం(హంపి). ఆంధ్రప్రదేశ్‌‌ పరిధిలో రాఘవేంద్రస్వామి ఆలయం, (మంత్రాలయం), గురజాల ఇసుక రామలింగేశ్వరస్వామి దేవాలయం, కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరాలయం. తెలంగాణలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం (వేణిసోంపురం), వైకుంఠ నారాయణ స్వామి ఆలయం (రాజోళి), సూర్యనారాయణ స్వామి ఆలయం (పుల్లూరు), జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు (అలంపూర్‌), సంగమేశ్వరాలయం.

తుంగభద్ర పుష్కరాలకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. ప్రధానంగా రెవెన్యూ, పురపాలిక, పోలీసు, వైద్యఆరోగ్య, దేవాదాయశాఖ, విద్యుత్తు శాఖ, అగ్నిమాపకశాఖ ఉద్యోగులతోపాటు గజ ఈతగాళ్లు ఘాట్ల వద్ద విధులు నిర్వహించనున్నారు. పుష్కర స్నానాలకు ఏర్పాటు చేసిన నాలుగు ఘాట్లలో మొత్తం 2,435 మంది అధికారులు, సిబ్బంది, కార్మికులు విధుల్లో ఉండనున్నారు. వీరంతా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ, సహకారాలు అందిస్తారు. ప్రధానంగా అలంపూర్‌ ఆలయంలో 12 మంది ఈవోలు, పది మంది సిబ్బంది, అలాగే ప్రతి ఘాట్‌ వద్ద ఒక ఈవోతో పాటు నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు.

విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో ఒక ఏఈతో పాటు ఆరుగురు సిబ్బంది విద్యుత్తు అంతరాయం కలగకుండా విధులు నిర్వహించనున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 121 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది 55 మంది విధుల్లో పాల్గొంటారు. గజ ఈతగాళ్లు 140 మంది, కార్మికులు 340 మంది పుష్కరాల సందర్భంగా పనిచేయనున్నారు. ఇతర శాఖలకు చెందిన 96 మంది అధికారులు పుష్కర ఘాట్‌ విధుల్లో పాల్గొంటారు. దీంతో పాటు నాలుగు పుష్కరఘాట్లలో రెవెన్యూ, పోలీసు, ఆశా కార్యకర్తల రిసెస్షన్‌ సెంటర్లలో మరో 155 మంది పాల్గొననున్నారు. ప్రత్యేకంగా అలంపూర్‌ ఆలయం వద్ద 104 వాహనాన్ని అందుబాటులో ఉంచారు.

తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పుష్కర ఘాట్ల వద్ద కంట్రోల్‌ రూమ్‌, సహాయ కేంద్రం, ప్రజలకు సూచనలు ఇచ్చే కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వీటికి అదనంగా కలెక్టర్‌ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఏమైనా సమస్యలుంటే 08546-274007, 7993499501 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.

తుంగభద్ర పుష్కరాలకు నదిలో నీరు లేదన్న బెంగ తీరింది. జిల్లాలోని నాలుగు పుష్కర ఘాట్లలో ఒకరోజు ముందుగానే నీరు వచ్చింది. రెండు రోజుల క్రితం కర్ణాటక నుంచి నీరు వదలడంతో పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా అయింది. అయితే అన్ని ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయడంతో కొవిడ్‌ నేపథ్యంలో భక్తులు జల్లు స్నానాలకే ప్రాధాన్యమిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.