ఆటో-బైక్ ఢీ: ఇద్దరు దుర్మరణం

2350

విశాఖపట్నం, అక్టోబర్ 30 (న్యూస్‌టైమ్): నాతవరం మండలం మొండికండి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ఆ ప్రమాదంలో ఒక మహిళ, యువకుడు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసును నాతవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుండగా, డెంగీ లక్షణాలతో విద్యార్థిని మృతి చెందిన ఘటన హుకుంపేట మండలం కొట్నాపల్లిలో చోటుచేసుకుంది. పాడేరు ఏపీఆర్‌జేసీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ నెల 21న అనారోగ్యానికి గురైంది. పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా తండ్రి పాడేరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

24న ఆరోగ్య పరిస్థితి విషమించటంతో వెంటనే ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డెంగీగా అనుమానించిన వైద్యులు అప్పటికే పరిస్థితి విషమించిందని, వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందిందని కుటుంబ సభ్యులు చెప్పారు.