అనధికారిక కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యం!

0
12 వీక్షకులు

మహబూబ్‌నగర్, జనవరి 27 (న్యూస్‌టైమ్): తెలంగాణలో కొలువుల జాతర మొదలవుతుంటే అదే స్థాయిలో పుట్టగొడుగుల్లా కోచింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా సరైన ఫ్యాకల్టీ లేకుండానే కోచింగ్‌ సెంటర్లను నడిపిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లు అమాయక విద్యార్ధులను, పేద తల్లిదండ్రుులను దోచుకుంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని కోచింగ్ సెంటర్లు నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.

తెలంగాణలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపధ్యంలో జిల్లాలో కోకొళ్లలుగా కోచింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. నిరుద్యోగులు ఉద్యోగం వస్తుందన్న ఆశతో కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు సౌకర్యాలు లేని, క్వాలిఫైడ్ బోధనా సిబ్బంది లేని కోచింగ్ సెంటర్లు ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. మా కోచింగ్ సెంటర్‌లో చేరితే ఉద్యోగం గ్యారంటీ అని నిరుద్యోగులను మభ్యపెడుతున్నాయి. కోళ్ల పారంలో కోళ్లను కుక్కినట్లు విద్యార్థులను కోచింగ్‌ సెంటర్లలో కుక్కి విద్యాబోధన చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు, వనపర్తి, గద్వాల, షాద్‌నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జడ్చర్ల వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కోచింగ్ సెంటర్లు భారీగా వెలిశాయి.

ఆయా పట్టణాలకు దగ్గర్లో ఉన్న నిరుద్యోగులు వాటిలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా, లేదా అని చూడకుండానే చేరుతున్నారు. కోచింగ్ సెంటర్లను ప్రారంభించాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా కోచింగ్ కోసం పక్కా భవనం, బోధించడానికి క్వాలిఫైడ్ టీచర్స్, సరైన ఫర్నీచర్, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం వంటి మౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అంతేకాదు కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించే ముందు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పదివేల రూపాయల చలానా కట్టాలి. తమకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆధారాలు చూపాలి. అప్పుడు విద్యాశాఖాధికారులు పక్కా బిల్డింగ్‌ను పరిశీలిస్తారు.

కోచింగ్‌ సెంటర్‌లో సరైన సౌకర్యాలు ఉన్నాయా, లేదా అని పరిశీలిస్తారు. అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారణ అయితే అప్పుడు కోచింగ్ సెంటర్ నడుపుకోవడానికి అనుమతి ఇస్తారు. అప్పటిదాకా కోచింగ్ సెంటర్‌ను నడపడం చట్టవిరుద్దం. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం ఏడు కోచింగ్ సెంటర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ముందుగా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పర్మీషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారుల నుంచి అనుమతి రాకుండానే కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. సరైనా క్వాలిఫికేషన్ లేని టీచర్లతో బోధిస్తున్నారు.

మంచి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు బోధించాలంటే ఎక్కువ వేతనం తీసుకుంటారు కాబట్టి, అనర్హులతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఇలాంటి కోచింగ్ సెంటర్లు జిల్లాలో దాదాపు ముప్పై వరకు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఆశ కల్పించి కోచింగ్‌ సెంటర్లు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విద్యార్ధిసంఘాలు మండిపడుతున్నాయి. అనుమతులు లేని కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.