న్యాయమూర్తుల ఎంపిక, నియామకంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు న్యాయ, ఇటు రాజకీయ వర్గాలలో సంచలనాత్మకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేశారని సందేహం వ్యక్తంచేసిన ఆయన కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు, సుప్రీంకోర్టు సీజేకు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధమున్న కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారణ జరపాలని కోరారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్ టెలీకాస్ట్ చేయాలన్నారు. లైవ్ టెలీకాస్ట్ పద్ధతి విదేశాల్లో ఉందని, విదేశాల్లోలోగా మన దేశంలోనూ వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్చువల్ కోర్టులపై తన సూచనలను సీజేకు మెయిల్ చేశానని తెలిపారు.

‘‘రాజకీయ నాయకులపై కోర్టులో విచారణ జరిగినప్పుడు లైవ్ ఇవ్వాలి. కోర్టులో విచారణ లైవ్ టెలీకాస్ట్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఏపీని 15 సంవత్సరాలు పాటు పరిపాలించిన చంద్రబాబు కేసులు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసులు విషయంలో లైవ్ టెలీకాస్ట్ చేయాలి. కోర్టులపై ముఖ్యమంత్రి లేఖ రాయటం ఇదేమీ కొత్త కాదని, గతంలో ముఖ్యమంత్రి సంజీవయ్య కూడా కోర్టులపై లేఖ రాశారు’’ అని గుర్తు చేశారు.

జగన్ అన్ని విషయాలలో మొండిగా వెళతారని, జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో ఆరోపణలు వ్యక్తిగతంగా తాను నమ్మను అన్నారు. ‘‘ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు ఎలా నిర్ధారిస్తారు? భూములు కొనుగోలు చేయకూడదా? తప్పా? ముఖ్యమంత్రి కొడుకు వ్యాపారం చేయకూడదా? అనేది జగన్ వాదన. న్యాయవ్యవస్థలో లోపాలను రాజకీయ వ్యవస్థలు సరిదిద్దాలి. చట్టం ముందు జడ్జీలు అతీతులు కాదు.’’ అని వ్యాఖ్యానించారు.

న్యాయ వ్యవస్థలపై ఆరోపణలు విషయంలో చర్చ గౌరవంగా జరగాలని, న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు వస్తే ప్రజలకు నష్టమని, ప్రభుత్వం ఏ పని అయినా చట్టబద్దంగా చేయాలని అన్నారు. జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేశారన్నారు మాజీ ఎంపీ. కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చన్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారని, ఆ తర్వాత కోర్టుల తీర్పుకు లోబడి ఎన్టీఆర్ ప్రజాసేవ చేశారన్నారు. సుప్రీంకోర్టు సీజేకు ఏపీ ప్రజా ప్రతినిధుల కేసుల విచారణపై ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.