పచారీ కొట్టోడూ ‘ప్రెస్సే’నట!?

642
  • నేరస్తులు నడిపే వాహనాలపైనా స్టిక్కర్లు!

  • ‘ప్రెస్’ కనపడగానే ఆపేందుకూ సాహసించని పోలీసులు?

విశాఖపట్నం, జూన్ 25 (న్యూస్‌టైమ్): ‘ప్రెస్’ అనే పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ పదం వెనుక ఉన్న ప్రయోజనాల్ని అనుభవించే వారికే తెలుసు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రతి అడ్డమైనోడూ ప్రెస్ అని వాహనాలపై స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతుండడం పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. చివరికి పచారీ కొట్టోడూ, ‘ప్రింటింగ్ ప్రెస్‌’లో పనిచేసుకునే సగటు కార్మికుడు కూడా ‘ప్రెస్’ అనే పదాన్ని తన వాహనంపై రాసుకుని తిరుగుతుండడం క్షమించరాని నేరం అనేదానికంటే కూడా ఆ అక్రమాన్ని చూస్తూ కూడా మిన్నకుండిపోతున్న ‘వ్యవస్థ’ను తప్పుపట్టాలి.

మీడియాలో పనిచేసే మిత్రులే చాలా వరకు ‘ప్రెస్’ ప్రయోజనాలు సరిగా వినియోగించుకోని పరిస్థితుల్లో అక్రమార్కులు, అనధికార వ్యక్తులు ‘ప్రెస్’ పేరిట విచ్చలవిడిగా బోర్డులు తగిలించుకుని రెచ్చిపోతున్నారు. జేబులో గుర్తింపు కార్డు ఉన్న జర్నలిస్టుల పట్ల సైతం కఠినంగా వ్యవహరించే పోలీసులు అనధికార ‘ప్రెస్’ వాళ్ల పట్ల కనీసం స్పందించకపోవడం దారుణం.

ఏదో ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అక్రమార్కులు ఇలాంటి ‘ప్రెస్’ చిట్కాలు వాడుతున్నారనుకుంటే పొరపాటే… నేరాలు చేసే వాళ్లు కూడా తాము వినియోగించే వాహనాలకు ‘ప్రెస్’ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ‘ప్రెస్’ స్టిక్కర్లు అతికించి ఉన్న వాహనాలు ఎన్నో తీవ్రమైన నేరస్తులు పట్టుబడినప్పుడు దొరికిన విషయం ఇక్కడ ప్రస్తుతించడం అవసరం.

నిజమైన మీడియా ప్రతినిధులు (వాళ్లు యజమాని అయినా, రిపోర్టర్ అయినా, వీడియోగ్రాఫర్ అయినా, ఫొటోగ్రాఫర్ అయినా, కనీసం ఆ సంస్థలో పనిచేసే వర్కర్ అయినా) కచ్చితంగా గుర్తింపు కార్డు పొందే ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు అందరికీ ఉండకపోయినా, కనీసం సంస్థ ఇచ్చే గుర్తింపు కార్డయినా ఉంటుంది. కానీ, అనధికార వ్యక్తుల వద్ద ఏం ఉంటుంది? తమ అన్నో, నాన్నో, బావో, ఇంకెవరో మీడియాలో పనిచేసినంత మాత్రాన అందరూ తమ వాహనాలపై ‘ప్రెస్’ అనే స్టిక్కర్లు అతికించుకోవడం ఎంత వరకు సమంజసం? ఇది అందరూ ఆలోచించాల్సిన వాస్తవం.

‘‘ఏంటండీ ప్రతివాడూ ‘ప్రెస్’ అంటాడు… ఎవరు ప్రెస్సో తెల్చుకోలేకపోతున్నాం’’ అనే మాటలు కానిస్టేబుల్, హోం గార్డుల నుంచి వినకూడదనుకుంటే మాత్రం నిజమైన మీడియా మిత్రులే ఇకమీదట ‘ప్రెస్’ అనే పదాన్ని వాడుకోవాల్సి ఉంటుంది.

మొన్నీమధ్య ఈ వార్త రాసిన  ఓ మా ప్రతినిధికి ఓ పెద్దాయన తారసపడ్డాడట. ఆయన నడుపుతున్న ద్విచక్ర వాహనంపై ఉన్న ప్రెస్ స్టిక్కర్ చూసి ఆయన ఏదో పత్రికకు సీనియర్ రిపోర్టరో లేక, సబ్ ఎడిటరో అయి ఉంటారని భావించారట. తీరా ఆరా తీస్తే చివరికి ఆయన మార్కెట్లో ఓ పచారీ కొట్టాయన అని తేలిందట. కర్రీ పాయింట్లకు, హోటళ్లకూ అరువుపై సరకులు సరఫరా చేసే ఆ పెద్దాయన సాయంత్రం పూట అదే దుకాణాలకు వెళ్లి బాకీలు వసూలు చేసుకుంటారట. అలా వెళ్లేటప్పుడు అవతలివాళ్లను బెదిరించాలన్న ఉద్దేశంతోనో లేక పోలీసు కేసుల నుంచి తప్పించుకోవచ్చన్న ఆలోచనతోనే ఆయన వాహనానికి ప్రెస్ అన్న స్టిక్కర్ తగిలించుకున్నారు.

ఇది న్యాయం కాదన్న భావనతో మా ప్రతినిధి ఆ పెద్దాయనను ఏ ప్రెస్ అని నిలదీస్తే సెక్రటరీకి చెబుతాను, ప్రెసిడెంట్ వద్ద పంచాయతీ పెడతానంటూ ప్రగల్భాలు పలికాడట.

ఇలాంటి బోగస్ విలేకరులకు వత్తాసు  పలుకుతున్నది ఎవరో? ఐదు వేలకో పది వేలకో లేక పాతిక వేలకో అమ్ముకోవడానికి ఇదేమీ అక్రెడిటేషన్ కార్డు కాదు. జర్నలిస్టుకు లభించిన గుర్తింపు. చివరికి ఈ గుర్తింపునూ లేకుండా చేసే అడ్డగోలు బ్యాచ్ తయారైందనడానికి ఇలాంటి ఉదాహరణలు అనేకం.

ఈ ఉదంతం కేవలం పచారీ కొట్టాయన వాహనానికే పరిమితం అయిందనుకుంటే పొరపాటే. మద్యం దుకాణాలలో పనిచేసేవారు, వడ్డీ వ్యాపారులు, చిల్లర నేరాలకు పాల్పడే వారు, క్రైమ్ రికార్డెలకెక్కినా వారూ ఇలా ఒకరేమిటి ఈ ఫీల్డ్‌తో సంబంధం లేని వారు ఎంతో మంది ‘ప్రెస్’ను తగిలించుకుని ధర్జాగా తిరుగుతున్నారు. గతంలో ఎప్పుడో ఎక్కడో పనిచేసిన, లేదా తమ స్నేహితుడో, కుటుంబ సభ్యుడో ‘ప్రెస్’లో పనిచేసిన అనుభవం ఉండవచ్చు. అలాగని ఇప్పుడు ఆ రంగంతో ఏ మాత్రం సంబంధం లేదు కాబట్టి అదే పేరును దుర్వినియోగపర్చడం సరైనది కాదన్న ఇంగితం కూడా లేకపోవడం శోచనీయం.

సమాజంలో నాలుగో స్తంభానికి ఉన్న గౌరవాన్ని పెంచకపోయినా పరవాలేదు. కనీసం దాని పరువు బజారుకీడ్చే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై అటు పోలీసులు, ఇటు జర్నలిస్టు సంఘాలూ ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఓసారి ‘ప్రెస్’, ‘పోలీస్’ అని కనిపించే వాహనాలపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే అడ్డగోలు వ్యవహారాలు చాలా వరకు వెలుగులోకి వస్తాయనడంలో సందేహం లేదు. ఈ అనధికార ‘ప్రెస్’ వల్ల నిజమైన మీడియా మిత్రులు నష్టపోయే ప్రమాదం రాకముందే మేల్కొనాల్సి ఉంది. చివరికి మీడియాతో సంబంధం లేని వాహనాలపై కూడా ‘ప్రెస్’ స్టిక్కర్ వచ్చిచేరుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించి ఈ అనధికార ‘ప్రెస్’ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.