అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా టీకాలు

0
11 వీక్షకులు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్

ఒంగోలు, ఏప్రిల్ 27 (న్యూస్‌టైమ్): కంటైన్మెంట్ జోన్‌లో అంగన్ వాడీ కేంద్రాల ద్వారా వ్యాధి నిరోధక టీకాలు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలపై సోమవారం స్థానిక ప్రకాశం భవనం నుంచి నిర్వహించిన వీడియో సమావేశం ద్వారా అన్ని మండలాల అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణీలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వైద్య సేవల కోసం 108 అంబులెన్స్ సేవలు వినియోగించుకునేలా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రసూతి సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. డయాలసిస్, కిమోథెరపి, రక్తమార్పిడి వ్యాధి గ్రస్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా వైద్య శాలలకు వెళ్లడానికి 108 అంబులెన్స్ వాహనాలు వినియోగించాలన్నారు. ఇందుకోసం ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో ప్రజలకు సాధారణ వైద్య సేవలు అందేలా ప్రభుత్వ వైద్యశాలల్లో ఓ.పి.లు ప్రారంభించాలన్నారు. వైద్య విధాన పరిషత్‌కు సంబంధించిన వైద్యశాలల్లో కోవిడ్ బాధితుల కోసం 10 పడకలు వుండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పోరేట్ వైద్యశాలలన్ని పునఃప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రస్తుతం 13 కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. వాటికి అనుబంధంగా వున్న ల్యాబ్, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు తెరుచుకునేలా అధికారులు చూడాలన్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధుల కోసం మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసిన వారిని గుర్తించి ట్రూనాట్ యంత్రాల ద్వారా నమూనాల సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.

కంట్రోల్, కంటైన్మెంట్ సర్వేలెన్స్ అధికారులు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఆయన పలు సూచనలు చేశారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై వుందని కలెక్టర్ తెలిపారు. ర్యాపిడ్, డయాగ్నస్టిక్ కిట్ల ద్వారా కంటైన్మెంట్ జోన్, క్వారంటైన్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి వైద్య పరీక్షలు చేయాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి 14 రోజుల తర్వాత ఇంటికి పంపుతున్న వారిని ఫార్మెట్-ఎ ద్వారా ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ఐసోలేషన్, హోం ఐసోలేషన్, హోం క్వారంటైన్‌లో వున్నవారంతా ఇతరులను కలువకుండా భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అధికారులు, యంత్రాంగమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం పంటలకోత సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు, మిల్లులకు ఆటంకం కల్గించవద్దన్నారు. రెడ్ జోన్ల మినహా ఉపాధి హామీ పనులు, ఇతర నిర్మాణ రంగ పనులు సామాజిక దూరం పాటిస్తూ కొనసాగించేలా చూడాలన్నారు. జనతా బజార్లలో కూరగాయలు, పండ్లు విక్రయించడానికి కేవలం రైతులు, రైతు ఉత్పత్తి సంఘాల ప్రతినిధులకే అనుమతి ఇవ్వాలని ఆయన అధి కారులను ఆదేశించారు.

దళారులు, ట్రేడర్ల ప్రమేయం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో వున్న ప్రజలు ఒక జోన్ నుంచి మరొక జోన్లోకి వెళ్లకుండా అధికారులు నియంత్రించాలని జిల్లా ఎస్.పి. సిద్ధార్డ్ కౌశల్ చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు బాగా పనిచేస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వుండరాదని ఆయన సూచనలు చేశారు. మండల స్థాయిలో పనిచేసే అధికారులు పోలీస్ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. అనుమతి లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలను నియంత్రించాలని ఆయన స్పష్టమైన ఆదేలిచ్చారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో రెండవ విడత ట్రూనాట్ యంత్రాల ద్వారా నమూనాలు సేకరించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. షన్ మోహన్ తెలిపారు.

మొదటి విడతలో వైద్య విధాన పరిషత్ వారు ట్రూనాట్ యంత్రాల ద్వారా నిర్వహించిన పరీక్షలు సత్ఫలితాలను ఇచ్చాయని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, క్షేత్రస్థాయి అనుమతులపై నిర్ణయాధికారాలు తహసిల్దార్లకు వున్నాయని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలకు చెందిన వారు క్వారంటైన్ కేంద్రాల్లో వుంటే 14 రోజుల తర్వాత విడుదల చేయాలనే నిబంధనలో మినహాయింపు లేదని ఆయన స్పష్టం చేశారు. వైద్యశాలలన్ని తమ సేవలు కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జె.సి.-2 కె. నరేంద్ర ప్రసాద్, డి.ఆర్.ఓ. వి. వెంకట సుబ్బయ్య, జడ్.పి. సి.యి.ఓ. కైలాష్ గిరీశ్వర్, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి, డ్వామా పి.డి. శీనారెడ్డి, పి.ఆర్. ఎస్.ఇ. కొండయ్య, డి.యి.ఓ. సుబ్బారావు, ఆర్.డబ్ల్యు .ఎస్. ఎస్.ఇ. సంజీవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here