నిరాడంబరంగా ‘నిజరూపం’

0
16 వీక్షకులు
స్వామివారికి పట్టువస్త్రాలు, పూజాసామగ్రి అందజేస్తున్న ఆలయ పాలకమండలి అధ్యక్షురాలు సంచయిత గజపతిరాజు
  • స్వామివారి సేవలో తరించిన శ్రీనుబాబు

విశాఖపట్నం, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): సింహచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం నిరాడంబరంగా సాగింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల రాకను పూర్తిగా నిలిపివేసిన దృష్ట్యా భక్తులు లేకుండానే స్వామివారి చందనోత్సవం సంప్రదాయబద్దంగా ముగించారు. ఆలయ చరిత్రలోనే తొలిసారి భక్తులు లేకుండా స్వామివారి చందనోత్సవం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం. వెంకటేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పించగా, ఆలయ పాలకమండలి అధ్యక్షురాలి హోదాలో సంచయిత గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే నిజరూప దర్శనానికి లక్షలలో భక్తులు తరలివచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈసారి భక్తులు ఎవరికీ కూడా చందనోత్సవంలో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. సంచయిత గజపతితో పాటు ఎంపిక చేసిన ఆలయ అధికారులు, పూజారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు, స్వామివారి నిజరూప దర్శనానికి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించిన భక్తులకు గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించారు.

ప్రతి ఏటా సింహాద్రి అప్పన్న చందనోత్సవ కార్యక్రమంలో దాదాపు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొంటారు. స్వామివారి పట్టాభిషేకం కూడా ఏకాంతంగానే నిర్వహించారు. కాగా, ఈ నెల 2వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని తెలంగాణలోని భద్రాచలం ఆలయంలో కూడా భక్తులు లేకుండానే శ్రీ సీతారామకళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుమల వెంకన్న దర్శనాన్ని కూడా భక్తులకు నిలిపివేశారు. ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి భక్తులకు దర్శనం నిలిపివేశారు.

అప్పన్న చంద్రనోత్సవ ప్రసాదంగా శీతల పానీయాన్ని పంపిణీ చేస్తున్న గంట్ల శ్రీనుబాబు, బంటుపల్లి మహేష్ బృందం

ఇదిలావుండగా అప్పన్న చందనోత్సవంలో పాల్గొన్న నేషనల్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఎన్‌జేయూ) జాతీయ కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం (వీజేఎఫ్) అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తన బృందంతో కలిసి స్వామివారి సేవలో తరించారు. భక్తులు లేకపోవడంతో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు, పారిశుధ్య సిబ్బందికి, పోలీసులకు శీతల పానీయాలు, ప్రసాదం పంపిణీ చేశారు. ఆదివారం కొండ దిగువన కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ బంటుపల్లి మహేష్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీనుబాబు పాల్గొన్నారు. తొలుత కొండ దిగువన విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, సింహాచలం దేవస్థానం ఉద్యోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు, యాచకులకు స్వామివారి ప్రసాదంగా వీటిని అందజేశారు.

ఈ సందర్బంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ చందనోత్సవం నేపథ్యంలో భక్తులకు దర్శనం లేకపోయినప్పటికీ ఉద్యోగులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలతో పాటు అడవివరం సహకార బ్యాంకు డైరెక్టర్ బంటుపల్లి మహేష్ సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మెంటు రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here