హైదరాబాద్, విజయవాడ, జులై 31 (న్యూస్‌టైమ్): శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఇళ్లలో వరలక్ష్మీ వ్రతం జరుపుకొని అమ్మవారి దర్శనార్ధం ఆలయాలను సందర్శించారు. వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకుని లక్ష్మీదేవి ఆలయాల్లో కుంకుమార్చనలను నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవికి కుంకుమార్చనలు జరిపితే లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉంటుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే కుంకుమ పూజలు జరుపుతారు.

ఉదయం ఆలయాల్లో భక్తుల సంఖ్య స్వల్పంగా ఉన్నా పదిగంటలు దాటిన తర్వాత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండి అమ్మవారి ఆలయాల్లో విశేషపూజలు జరిపారు. ఇక్కడి ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ సన్నిధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయం, విశాఖలోని కనకమహాలక్ష్మి ఆలయంలో వేకువజామున అమ్మవారికి విశేష కుంకుమ పూజలు జరిపారు. శ్రీచక్రార్చన, స్వర్ణపుష్పాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారిని ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల గాజులతో అలంకరించారు. దానిమ్మ, ఆపిల్ పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. పైడితల్లమ్మ ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు, మూల పాపారావు, దూసి కృష్ణమూర్తి పూజలను నిర్వహించారు. కొత్తపేటలోని మన్నార్ రాజగోపాలస్వామివారి ఆలయంలో కొలువైన లక్ష్మీదేవి అమ్మవారికి విశేషపూజలు జరిపారు. వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన నిర్వహించారు. లక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు ఫణిహారం మణిబాబు ఆధ్వర్యంలో మహిళలు స్వహస్తాలతో లక్ష కుంకుమార్చన జరిపారు. శివాలయం వీధిలోని రామలింగేశ్వరస్వామివారి ఆలయంలో కొలువైన సర్వకామదాంబ అమ్మవారి సన్నిధిలో భక్తులు కుంకుమ పూజలు జరిపారు.

గ్రూప్ ఆలయాల కమిషనర్ పర్యవేక్షణ జరిపారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ఆలయ అర్చకుడు ఆరవిల్లి ఉమామహేశ్వర శర్మ పూజాదికాలు జరిపారు. జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలోనూ, కామాక్షి అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ‘శ్రావణ శుక్రవారం’ పూజలు

చిత్తూరు జిల్లాలోని ఓ ఆలయంలో మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించిన దృశ్యం

కాగా, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మివ్రతాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆస్థాన మండపానికి వేంచేశారు. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తిలతో రంగుల రంగుల పూలతో శోభాయమానంగా అలంకరించారు. అమ్మవారిని 9 గ్రంథులతో (నూలుపోగు) అలంకరించారు. అనంతరం ఐదు రకాల ఇడ్లీలు, వడ, అప్పం, పులిహోర వంటి 12 రకాల నైవేధ్యాలను అమ్మవారికి నివేదించారు. ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఇఒ తెలిపారు.

కరోనా ఆంక్షల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే స్థానిక భక్తులను ఈ వ్రతానికి అనుమతించారు. ఈ సందర్భంగా భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల పుష్పాలతో, విద్యుద్దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆస్థాన మండపంలో 4, ఊంజల్‌ మండపంలో 1, తోళప్పగార్డెన్‌లో 1 కలిపి మొత్తం 6 ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు కంకణాలు, పసుపు ధారాలు, పసుపు, కుంకుమ, 2 లక్షల గాజులు పంపిణీ చేసినట్లు వివరించారు. భక్తిశ్రద్ధలతో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. కలికిరిలోని కన్యకాపరమేశ్వరి, ఎల్లమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

ఈ సందర్భంగా ఎల్లమ్మ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి దీవెనలు అందుకొన్నారు. ఎల్లమ్మ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి దీవెనలు అందుకొన్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతంను ఘనంగా నిర్వహించారు.

స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని అభిషేకం పూజలు నిర్వహించారు. నిమ్మనపల్లి మండలంలో వరలక్ష్మీదేవి ప్రతిమలను ఆలయాల్లో, ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకుని వ్రతాన్ని ఆచరించారు. పెద్దమండ్యం మండలంలో వరలక్ష్మీ వ్రతం పండుగ శుఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవినే పసుపుతో ప్రతి మందేసి బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించి వేద మంత్రాల మధ్య పూజ మహిళలు అర్చకులు మనికంట శర్మ పాల్గొన్నారు. మదనపల్లె రెడ్డెప్ప నాయుడు కాలనీలో మదనపల్లె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో వరలక్ష్మివ్రతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బగా కళాశాల సెక్రటరీ, కరెస్పాండంట్‌ డాక్టర్‌ యెన్‌. విజయ భాస్కర్‌ చౌదరి మాట్లాడారు. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణ మాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది. రామసముద్రం మండలంలో పలు దేవాలయాల్లో మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనిల్‌ స్వామి మాట్లాడుతూ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయన్నారు. పీలేరు శ్రీచైతన్య స్కూల్‌లో విద్యార్థులు వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని వైభవగా జరుపుకొన్నట్లు ఎజిఎం శ్రీనివాసులు, ప్రిన్సిపాల్‌ జె. సుమన్‌ గౌడ్‌ తెలిపారు. స్థానిక భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని లక్ష్మీదేవి చిత్ర పటానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అస్టైశ్వర్యాలూ లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రైమరీ ఇన్‌చార్జ్‌ సునంద, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కరోనా ఆంక్షల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ…

కరోనా వ్యాప్తి దృష్ట్యా సామూహిక వ్రతాలకు దూరంగా హైదరాబాద్‌లోని ఓ కుటుంబం తమ ఇంట్లో నిరాడంబరంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన దృశ్యం

కరోనా ఆంక్షల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజల్లో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా మహిళలు ముఖానికి మాస్క్‌లు ధరించి ఆలయాలకు హాజరయ్యారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం వేడుకగా సాగింది. మహిళలకు ఆలయం తరపున పూజా సామగ్రిని అందజేశారు. ఇఒ ఆధ్వర్యంలో వేదపండితులు, పూజారులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మీ వ్రతం వలన ధన వస్తు కనకలావా లభిస్తాయని ఉద్దేశంతో ప్రజలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు జరుపుకుంటారు. ఉదయం వరలక్ష్మి అమ్మవారిని సుందరంగా అలంకరించి వివిధ పుష్పాలతో అలంకరించి పిండివంటలతో బంగారుపాళ్యంలో పూజ కార్యక్రమాలు జరుపుకొన్నారు. ఏర్పేడు మండలంలోని మహిళలు భక్తిశ్రద్ధలతో వర లక్ష్మివ్రతం నిర్వహించారు. చిందేపల్లి సిద్ధేశ్వరలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నేతి దీపాలు వెలిగించారు. ఎస్‌ఆర్‌ పురం గ్రామంలో మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేసుకున్నారు.

మండలంలోని వివిధ ఆలయాలలో, ఇంట్లో అమ్మవారి ప్రతిమతో ఘనంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేసుకున్నారు. మండలంలోని వివిపురం గ్రామ పంచాయతీ ఆరిమాకుల పల్లి గ్రామంలో వెలసిన ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి ప్రతిమను ప్రత్యేకంగా తయారు చేసి ఆలయ పూజారి వెంకటాచలపతి ఆచార్యులు అమ్మవారికి పూలమాలలతో, పండ్లతో, నిమ్మకాయలతో అలంకరించి, మంత్రాలు చదివి, పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చంద్రగిరి మండలంలో పలు ఆలయాల్లో వరలక్ష్మి వ్రతమహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. చంద్రగిరి గ్రామ దేవత మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో అర్చకులు అరుణ సహచర బృందం, మహిళలతో కలిసి వరలక్ష్మీ వ్రతం నోమును నోచారు.

ఈ సందర్భంగా కార్యనిర్వాహణాధికారి మహిళలకు పసుపు కుంకుమ గాజులు అందజేశారు. చంద్రగిరి పూటలమ్మ ఆలయం, సంతోషిమాత ఆలయం తదితరాల్లో వరలక్ష్మి వ్రత పూజలు అత్యంత రమణీయంగా నిర్వహించారు. తిరుపతి అర్బన్‌ శెట్టిపల్లి పంచాయతిలోని తిరుమలనగర్‌లోని శ్రీ భక్తిసిద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో జైసితారాం స్వామిజీ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడు ఆలయంలో వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

శ్రావణ మాసంలో ప్రతి రోజును అంత్యంత పవిత్ర దినంగా భావిస్తుంటారు. అందులో భాగంగా కొన్ని వారాలను ఇష్టదేవతల రోజుగా భావించి పవిత్రమైన పూజలు చేసే సాంప్రదాయం తరతరాల నుండి వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మిపవిత్రరోజుగా కొలుస్తూ ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఉదయాన్నే దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఈ పవిత్ర రోజును అత్యంత భక్తి శద్ద్రలతో వరలక్ష్మీ వ్రతాలను చేశారు. కొన్ని దేవాలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను చేసి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్ని వరలక్ష్మీ వత్రాల సందడి నెలకొంది.

శ్రీమన్యంకొండ దేవాలయంకు భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో గోవిందనామస్మరణం మార్మోగింది. జిల్లా కేంద్రమైన రేణుక ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వరలక్ష్మీ వ్రతాన్ని తిలకించి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో సైతం సామూహిక వరలక్ష్మీ వత్రాలను నిర్వహించారు. ఇళ్లలో సైతం వరలక్ష్మీ వ్రతాలను జరుపుకున్న వారు వాయినం ఇచ్చి మహిళలను సాంప్రదాయంగా సత్కరించుకున్నారు. ఏ దేవాలయంలో చూసిన మహిళలు ఒకరికి మరోకరు వాయినం ఇచ్చుకుని సందడి చేశారు.

అమాంతం పెరిగిన పూలు, పండ్ల ధరలు…

ఇప్పుడు పువ్వులు, పండ్లు కూడా తమ తడాఖా చూపిస్తున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పువ్వులు కూడా సామాన్యులను వెక్కిరిస్తున్నాయి. కనకాంబరాలు కొనలేరు పొమ్మంటున్నాయి.. చామంతులు మీ వల్ల కాదంటూ చిన్నచూపు చూస్తున్నాయి. గులాబీలు గుచ్చుకుంటున్నాయి.. కలువ పూలు కస్సుబుస్సుమంటున్నాయి. బంతిపూలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. మల్లెలు మరిచిపోమంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ సామూహిక వరలక్ష్మీ వ్రతాలతో కళకళలాడిన నేపథ్యంలో పూలు, పండ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అసలే శ్రావణమాసం, అందులోనూ వరలక్ష్మీ వ్రతం మరి ఇంకేం చుక్కలనంటిన పువ్వుల ధరలతో సామాన్యులకు నిజంగానే చుక్కలు కనిపిస్తున్నాయి.

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళల హడావిడి అంతా ఇంతా కాదు. ఇక మహిళా లోకం శ్రావణ మాసంలో నిర్వహించే పూజాపునస్కారాలు చూసి డిమాండ్‌ను బట్టి ధరలు పెంచేస్తున్నారు పూలు, పండ్ల వ్యాపారులు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూల ధరలు ఆకాశాన్ని తాకాయి. కొనలేకున్నా కొనక తప్పని పరిస్థితి కాబట్టి వ్యాపారులు మాత్రం ధరల విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన ధరలకు, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రెక్కలొచ్చాయనే చెప్పాలి. పూల మార్కెట్‌లో వ్యాపారులు చెబుతున్న ధరలను చూస్తే షాప్ తినే పరిస్థితి. 1000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన చిన్న బుట్టలోకి కూడా పూలు రాని పరిస్థితి.

అయినప్పటికీ తప్పని సరి కావడంతో పూల ధరలు షాక్ కొడుతున్నా కొనుగోలు చేయక తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు, పట్టణాల్లో కనకాంబరం పూలు కిలో రూ. 2 వేలకు చేరుకుంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేజీ చామంతులు ఆరు వందలు. మూర మల్లెపూలు 150కి తక్కువ లేదు. ఒక్క కలువపువ్వు 100. గులాబీలు కిలో రూ. 500 వరకూ పలుకుతుండగా, బంతిపూల ధర కిలోకు రూ. 80 పలికింది. ఇది హైదరాబాద్ పూల మార్కెట్‌లోని తాజా ధరలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఓ రేంజ్‌లో ధరలు పెంచి అమ్ముతున్నా, మహిళలు ధరలు చూసి నూరేళ్ల బెడుతున్నా, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా ధరలు మాత్రం ఫిక్స్ అంటూ తేల్చి చెబుతున్నారు దుకాణందారులు. ఇక అధిక ధరలు ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తమకు అవసరమైన మేరకు పూలను కొనుగోలు చేసి వెళుతున్నారు.

సాధారణ రోజుల ధరలతో పోల్చి చూస్తే పండుగ సమయాల్లో పూల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మామూలు రోజుల్లో ధరలకు, శ్రావణ మాసంలో ధరలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. పది రూపాయల ధర పలకని పూలకు శ్రావణంలో వందల డిమాండ్ వస్తోంది. మొత్తానికి పూల షాపుల వంక చూడాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నడిపించే మధ్యతరగతి కుటుంబాలకు వరలక్ష్మీ వ్రతం వంటి పండుగలు జరుపుకోవాలన్నా మండుతున్న ధరలతో ఇబ్బందికరంగానే ఉంటుంది.