సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్

నేడు దేవిశ్రీ ప్రసాద్‌ పుట్టినరోజు సందర్భంగా…

హైదరాబాద్, ఆగస్టు 2 (న్యూస్‌టైమ్): కొందరిలో ఇమిడి ఉన్న టాలెంట్ బయట ప్రపంచడానికి తెలియడానికి చాలా సమయం పడుతుంది. తమలో ఉన్నది అనంతమైనా చూపించేది ఆవగింజంతేలా ఎంత ఎదిగినా ఒదిగే గుణం చాలా మందిలో కనిపిస్తుంది. అటువంటి పరికవ్వత కలిగిన విజ్ఞానవంతుల్లో యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌ ఒకరని చెప్పాలి. 20 ఏళ్ల వయసులోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆయన తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాలకి స్వరాల్ని సమకూర్చారు. మెలోడీ అయినా, మాస్‌ బీట్‌ అయినా దేవిశ్రీప్రసాద్‌ తన మార్క్‌ చూపించేవరకు వదిలిపెట్టరు. దేవి ఐటెమ్‌ పాటలంటే యువతకి మరింత ఇష్టం. స్వరాలు సమకూర్చడంతో పాటు, సాహిత్యం సమకూర్చడంలోనూ, గీతాలాపానలోనూ దేవిది అందెవేసిన చేయి. 19 యేళ్ల సినీ ప్రయాణంలో వందకిపైగా చిత్రాలకి స్వరాలు సమకూర్చారాయన.

పలు గీతాలకి సాహిత్యం అందించడంతోపాటు, తన మార్క్‌తో ఆలపించారు కూడా. వేదికలపైన మంచి జోష్‌తో కనిపిస్తూ, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే దేవిశ్రీప్రసాద్‌ ‘కుమారి 21 ఎఫ్‌2 చిత్రంలోని ఓ పాటకి నృత్యాలు కూడా సమకూర్చడం విశేషం. ప్రముఖ రచయిత జి.సత్యమూర్తి, శిరోమణి దంపతులకి తొలి సంతానంగా రామచంద్రాపురం దగ్గర్లోని వెదురుపాకలో జన్మించారు. దేవిశ్రీప్రసాద్‌ అసలు పేరు ప్రసాద్‌. తన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్‌ని తీసుకొని దేవిశ్రీప్రసాద్‌గా మార్చుకొన్నారు. చిన్నటప్పుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకొన్న దేవిశ్రీప్రసాద్, మద్రాసులో మాండొలీన్‌ శ్రీనివాస్‌ దగ్గర మాండొలిన్‌ నేర్చుకొన్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘దేవి’తో స్వరకర్తగా పరిచయమైన దేవిశ్రీప్రసాద్, ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో వెనుదిరిగి చూసుకోలేదు.

‘నీకోసం’, ‘నవ్వుతూ బతకాలిరా’, ‘ఆనందం’, ‘కలుసుకోవాలని’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘వర్షం’.. ఇలా విజయవంతమైన పలు చిత్రాలకి పనిచేశారు. ‘జై లవకుశ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘ఎమ్‌.సి.ఎ’, ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్నారు. పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మురిపించారు కూడా. కథానాయకుడిగా కూడా తెరపై సందడి చేయబోతున్నారనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. అయితే సంగీత దర్శకుడిగా తీరిక లేకుండా ఉండటంతో ఆయన ఎంట్రీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. రామ్‌ హీరోగా వచ్చిన ‘హలో గురూ ప్రేమకోసమే’, మహేష్‌ ‘మహర్షి’ చిత్రానికి కూడా స్వరాలు సమకూర్చారు.

ఈ ఏడాది వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో పాటు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి కూడా దేవినే సంగీతం అందిస్తున్నారు. ఈరోజు దేవిశ్రీ పుట్టినరోజు. ఒక్కమాటలో చెప్పాలంటే, స్వరాలతో నరాల్లో కరెంటు పుట్టించడం అతనికి మ్యూజిక్‌తో పెట్టిన విద్య. మాటలతో పాటలు కట్టాలన్నా హార్ట్‌బీట్‌తో మెలోడీ పలికించాలన్నా అతను కావల్సిందే. ‘అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం’ అంటూ తెలుగు అక్షరాలతో ఐటెం స్టెప్పులేయించాడు. తను ఎక్కుపెట్టిన ట్యూన్‌ ఏదైనా ‘ఇది ఆరడుగుల బుల్లెట్‌..’ అంటూ ప్రేక్షకుల మదిలోకి దూసుకుపోవాల్సిందే.

‘సరి గమ పదనిసా..’ అంటూ తను గళం విప్పితే ‘ఇట్స్‌ టైమ్‌ టు పార్టీ నౌ..’ అంటూ సినీ ప్రియులు థియేటర్లలో చిందులు తొక్కారు. ‘రింగ రింగ..’ అంటూ టాలీవుడ్‌లో దుమ్ములేపితే, ‘డింకచిక డింకచిక’ అంటూ బాలీవుడ్‌ సైతం పూనకంతో ఊగిపోయింది. క్లాస్, మాస్, రాప్, రాక్, ఫోక్‌ గీతమేదైనా సరే దేవిశ్రీ ప్రసాద్‌ చేతిలో పడిందంటే చాలు నిండైన ఎనర్జీతో సంగీత ప్రియులను సునామీలా ముంచేస్తుంది. అందుకే తరాల భేదమెరుగని స్వరంగా దేవిశ్రీ సంగీతం అందరికీ ఇంపుగా మరిపోయింది.

సంగీతం సృష్టించడం.. సరిగమలతో సరికొత్త ప్రయోగాలు చేయడం.. ఎప్పటికప్పుడు నిత్యనూతనమైన గీతాలతో అలరించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ దాన్ని అవలీలగా చేసి చూపిస్తాడు దేవిశ్రీ ప్రసాద్‌. గీతానికి, సంగీతానికి సరికొత్త బాటలు చూపిన యువ సంగీత దర్శకుడతను. అలతి అలతి పదాలతో పాటల మాలలు కట్టగలడు. ముద్దు ముద్దు పలుకుల నుంచి సరికొత్త బాణీలు సృష్టించగలడు. సరిగమల్లో యవతరపు సువాసనలు చల్లి ఉత్సాహంతో ప్రేక్షకుల నరాలను ఉప్పొంగించగలడు. అందుకే దేవిశ్రీ ప్రసాద్‌ పాట థియేటర్లో వినపడితే చాలు శివాలెత్తి ఆడుతారు సినీ ప్రియులు. కాలు కదపలేని ముసలవ్వలతో కూడా దుమ్ముదులిపే స్టెప్పులేయిస్తాడు. కేవలం గాయకుడిగా, సంగీత దర్శకుడిగానే గాక పాటల రచయితగా, డ్యాన్సర్‌గా, స్టేజ్‌ పెర్ఫార్మర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్‌.

దేవిశ్రీ ప్రసాద్‌ 1979 ఆగస్టు 2న తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాకలో శాస్త్రీయ సంగీతానికి నెలవైన కుటుంబంలో గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ పేరు వెనుక చిన్న ఆసక్తికరమైన కథ ఉంది. దేవిశ్రీ తండ్రికి తమ అత్తమామలంటే మంచి అభిమానం. అందుకే తన అత్తగారి పేరులోని దేవి, మామగారైన ప్రసాద్‌రావు పేరులోని ప్రసాద్‌ను తీసుకొని దేవిశ్రీ ప్రసాద్‌గా నామకరణం చేశాడు. దేవిశ్రీ సంగీత గురువు మాండొలిన్‌ శ్రీనివాస్‌. ఆయన శిక్షణలోనే మాండొలిన్‌ వాయించడంలో నైపుణ్యం సంపాదించాడు దేవిశ్రీ. చిన్నతనం నుంచి సంగీత దర్శకుడు కావాలని కలలు కన్న దేవిశ్రీ ప్రసాద్‌ తాను అనుకున్నట్లుగానే అతి పిన్నవయసులో ఆ కలను నిజం చేసుకొని, తనలోని సంగీత కళను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు.

తన 20 ఏళ్ల వయసులో ‘దేవి’ (1999) సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే మంచి విజయాన్నందుకున్నాడు. ఇది మ్యూజికల్‌గా మంచి హిట్‌ అవడంతో పాటు దానిలోని ‘నీ నవ్వే నాగస్వరమే’ పాటకు మంచి ఆదరణ లభించింది. ‘దేవి’తో చిత్రసీమకు తన పేరును పరిచయం చేసిన దేవిశ్రీ ‘ఆనందం’తో దాన్నొక నామంలా జపించేలా సంగీతంతో మాయచేశాడు. యువతరానికి ‘‘కనులు తెరిచినా కనులు మూసినా..’’ తన గీతాలే గుర్తుకుతెచ్చేలా ‘ఒక మెరుపు..’ ల్లాంటి స్వరాల జల్లును కురిపించాడు. ‘చికు ఛం.. చికు ఛంఛం.. ఒక నిమిషం ఆనందం’ అంటూ ప్రేక్షకులతో థియేటర్లలో చిందులు వేయించాడు దేవిశ్రీ. అక్కడి నుంచి ‘కలుసుకోవాలని’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘వర్షం’, ‘వెంకీ’ చిత్రాలతో వరుస మ్యూజికల్‌ హిట్లు అందుకున్నారు.

నిజానికి పలానా సంగీత దర్శకుడి పాటల్లో ఏది అత్యుత్తమం అంటే కొంచెం ఆలోచించైనా పలానా పలానా చిత్రాలని గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ దేవిశ్రీ విషయంలో ఇది అసాధ్యమైన పని ఎందుకంటే తను అందించిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్టే వాటిలో నుంచి కొన్ని పాటలను ఎంపిక చేసుకోని చెప్పమంటే కడివెడు అమృతంలోంచి ఓ అత్యుత్తమ అమృత బిందువు తీయమన్నట్లే ఉంటుంది.

సాధారణంగా చిత్రసీమలోకి వచ్చిన వెంటనే ఓ యువ సంగీత దర్శకుడిని అగ్రకథానాయకుడి సినిమాకు ఎంపిక చేసుకోవాలంటే దర్శక, నిర్మాతలు కొంత వెనుక ముందు ఆలోచిస్తుంటారు. యువ హీరోల శైలికి తగ్గట్లు స్వరాలిచ్చినట్లు అగ్రహీరోలకు ఇవ్వలేడేమో అన్న భయం ఉంటుంది. కానీ దేవిశ్రీ దీనికి అతీతుడు. ఏ తరం కథానాయకుడితోనైనా తనదైన సంగీతంతో ఉర్రూతలూగించేలా స్టెప్పులేయిస్తాడు దేవిశ్రీ. చిరంజీవితో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘అందరివాడు’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’, ‘ఖైదీ నెం.150’, నాగార్జునతో ‘మన్మథుడు’, ‘మాస్‌’, ‘కింగ్‌’, ‘డమరుకం’, వెంకటేష్‌తో ‘తులసి’, ‘నమో వెంకటేశ’, బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్‌’, పవన్‌ కల్యాణ్‌తో ‘జల్సా’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ లాంటి మంచి మ్యూజికల్‌ హిట్లు ఇచ్చాడు దేవిశ్రీ. ఇక ప్రస్తుతం పరిశ్రమలో యువహీరోలు అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, రామ్, నాగచైతన్య, నాని, రవితేజ, సిద్ధార్థ, రాజ్‌తరుణ్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లరి నరేష్‌ తదితరులందరి చిత్రాలకు చక్కటి సంగీతాన్నందించి మెప్పించాడు దేవిశ్రీ ప్రసాద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here