విజయవాడ, అక్టోబర్ 17 (న్యూస్‌టైమ్): ద‌ కారం దైత్య‌నాశ‌కం. ఉ కారం విష్ణు నాశ‌కం. ర్‌ కారం రోగ నాశ‌కం. గ‌ కారం పాప నాశ‌కం, ఆ భ‌యనాశ‌క వాచ‌కం. అందుకే ఆ దుర్గా మాత నామాన్ని ఉచ్ఛ‌రించినా, స్మ‌రించినా .. స‌ర్వ పాపాలూ న‌శిస్తాయి. అమ్మ‌వారికి ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు చాలా ప్రీతిక‌ర‌మైన‌వి. ఈ ప‌ది రోజులూ బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌శావ‌తారాల‌లో భ‌క్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై సాక్షాత్క‌రిస్తుంది. ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ స‌న్నిధిలో ద‌స‌రా వేడుక‌ల‌ను ఈ ఏడాది కూడా రాష్ట్ర పండుగ‌గా ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంది. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు ఏటా అత్యంత వైభ‌వంగా జ‌రుగుతుంటాయి. క‌నీసం 15ల‌క్ష‌ల మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు.

కానీ.. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌ధ్యంలో ఈ ఏడాది భ‌క్తుల ర‌ద్దీని పూర్తిగా త‌గ్గించేశారు. రోజుకు 10వేల మందికి మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని అది కూడా ముందుగా ఆన్లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న భ‌క్తుల‌నే అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించే విధంగా దుర్గ‌గుడి అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో న‌వ‌రాత్రుల మొత్తం మీద అమ్మ‌వారిని ల‌క్ష మంది మాత్ర‌మే ద‌ర్శించుకునే వీలుంది. ఉత్స‌వాల్లో భాగంగా అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్ర‌మైన మూలా న‌క్ష‌త్రం రోజున రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ్మ‌వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్తిస్తారు. ముగింపు సంద‌ర్భంగా విజ‌య‌ద‌శ‌మి రోజున దుర్గాదేవిని హంస‌వాహ‌నంపై ఊరేగిస్తారు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే ఈ తెప్పోత్స‌వాన్ని తిల‌కించేందుకు ఈ ఏడాది ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్నారు. జై భ‌వానీ.. జైజై జ‌గ‌జ్జ‌న‌నీ!

ప‌ర‌మ దుర్మార్గుడైన మ‌హిషాసురుడి బారినుంచి దేవ‌త‌ల‌నూ మ‌నుషుల‌నూ ర‌క్షించేందుకు ఘోర యుద్ధం చేసి అత‌డిని వ‌ధించింది దుర్గాదేవి. ఆ స‌మ‌యంలో మ‌హోగ్రంగా క‌నిపిస్తున్న ఆ త‌ల్లిని చూసిన దేవ‌త‌లంద‌రూ అమ్మా నీవు లోకాల‌ను ర‌క్షించే త‌ల్లివి .. ఇంత‌టి ఉగ్ర రూపం మ‌హిషాసురుని వంటి రాక్ష‌స‌వ‌ధ‌కే గానీ మేమెట్లు భ‌రించ‌గ‌లం, శాంత రూపిణివై లోకాల‌ను కాపాడ‌మ‌ని వేడుకున్నారు. అప్పుడా త‌ల్లి క‌రుణార‌స సంపూర్ణ అయిన రాజ రాజేశ్వ‌రీ దేవిగా అవ‌త‌రించింది. నాటి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌ర‌మూ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి మొద‌లు న‌వ‌మి వ‌ర‌కూ జ‌రిగే శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాల‌లో న‌న్ను ఆరాధించిన వారికి ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలూ, సుఖ శాంతులూ క‌లుగుతాయ‌ని వ‌ర‌మిచ్చింది.

అయితే అనంత రూపిణి అయిన అమ్మ‌వారిని ఏ రూపంలో అర్చించాలీ అని మార్క‌డేంయ మ‌హ‌ర్షికి ఓ సందేహం వ‌చ్చింది. నేరుగా బ్ర‌హ్మ‌దేవుడిని క‌లిశాడు. దాంతో సాక్షాత్తూ సృష్టిక‌ర్తే న‌వ‌దుర్గా రూపాల‌ను వ‌ర్ణించాడు. జ‌గ‌న్మాత స‌క‌ల చ‌రాచ‌ర జ‌గ‌త్తును సృష్టించేందుకు శ్రీదుర్గ‌, మ‌హాల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి, గాయ‌త్రి, శార‌దాదేవి రూపాల‌ను ధ‌రించింది. ఈ పంచ రూపాల‌లో అది ప్ర‌కృతిస్వ‌రూపం క‌నుక దుర్గ‌మ్మ మహిషాసురుణ్ని స‌హ‌రించిన త‌రువాత ప‌విత్ర కృష్ణా తీరంలోని ఇంద్ర‌కీలాద్రిపై స్వ‌యంభువుగా అవ‌త‌రించింది. సాధార‌ణ రోజుల్లో కంటే ఈ ప‌ది రోజుల్లో క‌న‌క‌ప్ర‌భ‌ల‌తో వెల‌సిన దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు కోటి రెట్లు పుణ్యం ద‌క్కుతుంద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోన్న విజయవాడలో చారిత్రాత్మ‌కం కలిగిన ఆలయాల్లో మొగల్రాజపురం ధనకొండ ఒక‌టి.. దుర్గాభవానీ ఆలయం, దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ఇక్క‌డి ప్రజలు నమ్ముతారు. ఇంద్రకీలాద్రిపై అమ్మ కొలువు తీరడానికి ముందు, ఇంకోచోట వెలిసిందని భక్తుల నమ్మకం. ‘దక్షిణాన కదిలిందిరా మా అమ్మ దుర్గా ఉత్తరానికొచ్చింది రా’ అనే గీతం ప్రకారం కూడా దుర్గా అమ్మవారు దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండపైన వెలిసింద‌ని భ‌క్తుల విశ్వాసం.

విషయం ఇప్పటి తరంలో చాలా మందికి పెద్దగా తెలీదు. విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండపై వెలసిందని నమ్ముతారు. ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి, రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటున్నారు స్థానికులు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఎంతటి మహిమాన్వితురాలో మొగల్రాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా అంతే మహిమగలదని భక్తుల విశ్వాసం. మొగల్రాజపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీకచ్రకపీఠంపై పాదముద్రలు, నేత్రంతో వెలసిందంటారు. ఇది నిజమేన‌ని అంటానికి సాక్ష్యంగా ఇప్పటికీ అంతరాలయంలో అమ్మ‌వారి పాద ముద్రలు, నేత్రంతో ఉన్న శ్రీచక్రపీఠం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ రూపం కనపడదు.. అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది. స్థానికుల కధనం ప్రకారం దశాబ్దాల క్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చి, నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట.

అమ్మ కరుణించి కొంత ధనాన్నిని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లు ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని, చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించింద‌ట. గుహ వద్ద నుంచి కిందకు బయల్దేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనుక నుంచి శబ్దాలు, ఇతర చప్పుళ్లు వినబడటంతో వెనక్కి తిరిగాడట. వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు దిగువుగా అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది. ప్రస్తుతానికి కొండ కింద నుండి పైకి వెళ్లడానికి చక్కటి మెట్లు ఆపై నుంచి గుడి వరకు సిమెంట్‌ రోడ్డు ఉంది.

అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చే భక్తులు పైన పొంగళ్లు చేసుకొవడానికి షెడ్డు, కాలి మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి గర్బగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతార్భగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే మొగల్రాజపురంలోని బోయపాటి మాధవరావు రోడ్డు నుంచి ఈ గుడికి వెళ్లవచ్చు. ప్ర‌తి ఏటా ఇక్క‌డ న‌వ‌రాత్రుల పాటు అమ్మ‌వారికి ఉత్స‌వాలు చేయ‌డం ఆన‌క దసరా పండగ రోజున మేళ‌తాళాలు, మంగ‌ళ‌వాయిద్యాల‌తో అమ్మ‌వారిని న‌గ‌ర పుర‌వీధుల్ల‌తో ఊరేగింపు జ‌ర‌ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. అమ్మ‌వారి మ‌హ‌త్యం తెలిసిన భ‌క్తులు ఏటా దేశం న‌లుమూల‌ల నుంచి ద‌స‌రా ఉత్స‌వాల స‌మ‌యంలో ఇక్క‌డికి విచ్చేస్తూ ధ‌న‌కొండ‌పై వెల‌సిన క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని వెళుతుంటారు.