హస్తినలో హింస: 20కి పెరిగిన మరణాలు

73

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (న్యూస్‌టైమ్): ఢిల్లీలో హింస తీవ్రస్థాయికి చేరుకుంది. సవరించిన పౌరసత్వ చట్టంపై ఈశాన్య ఢిల్లీ మత హింసలో మరణించిన వారి సంఖ్య 20కి చేరుకుంది. ఈశాన్య ఢిల్లీ అంతటా రెండు రోజుల నిరంతర హింస, వినాశనం తరువాత అర్ధరాత్రి ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణ నిర్వహించింది. హింసలో గాయపడిన వారందరికీ భద్రత, తక్షణ వైద్య సహాయం అందేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఇంతలో, అన్ని స్టేషన్లలో అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు తెరిచారని, సాధారణ సేవలు తిరిగి ప్రారంభమైనట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు.

ఈశాన్య ఢిల్లీలో సవరించిన పౌరసత్వ చట్టంపై మత హింస పెరిగింది, వీధుల్లో ఉల్లాసంగా నడుస్తున్న అల్లర్లను తనిఖీ చేయడానికి పోలీసులు కష్టపడుతున్నారు. దుకాణాలను తగలబెట్టారు. దోచుకున్నారు. రాత్రిపూట కాల్పుల సంఘటనల తరువాత, దేశ రాజధానిలో ఉద్రిక్తత మరింత పెరిగింది.

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సుమారు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను, హింసను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఘర్షణలను అదుపు చేసే బాధ్యతను జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌కు కేంద్రం అప్పగించినట్లు సమాచారం.

ఈ క్రమంలో నిన్న రాత్రి జాఫ్రాబాద్‌, సీలాంపూర్‌ సహా ఈశాన్య ఢిల్లీలో అజిత్‌ దోవల్‌ పర్యటించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో అజిత్‌ దోవల్‌ చర్చలు జరిపారు. ఇవాళ జాతీయ భద్రత వ్యవహారాల మంత్రివర్గ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి అజిత్‌ దోవల్‌ హాజరై ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను వివరించే అవకాశం ఉంది. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గత రెండు రోజుల్లో మూడుసార్లు సమీక్ష జరిపారు.

ఈశాన్య ఢిల్లీలో ఘటనపై ఢిల్లీ హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలపై హైకోర్టు మధ్యాహ్నం 12 గంటలకు విచారించనుంది. విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, నగరంలో హింసాత్మక చర్యలు ఆపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు. ఆయన ఢిల్లీ ఆందోళనలో గాయడినవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఈ హిసాత్మక ఘటనల్లో చాలా మంది మృత్యువాత పడుతున్నారనీ, వందల సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు గాయాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనలు తెలియజేస్తే శాంతియుతంగా ఉండాలి. కానీ, ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునేలా వ్యవహరించకూడదని సీఎం అన్నారు. ఈ హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అల్లర్లలో హిందువులు, ముస్లింలు చనిపోయారని సీఎం తెలిపారు. గత రెండు, మూడు నెలలుగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో శాంతియుతంగా ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తే, ఢిల్లీలో మాత్రం నిత్యం అల్లర్లు జరుగుతున్నాయి.

కాగా, ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో 4 ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ విధించిన ప్రాంతాలు మౌజ్‌పూర్‌, జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌, కరవాల్‌నగర్‌.