ఇమేజిన్‌టు ఇనోవేట్‌కు విశాఖ ఆతిధ్యం

4498
  • రఘు విద్యా సంస్థల నిర్వహణలో ఈ-బైక్‌, గో కార్ట్‌ చాంపియన్‌ షిప్‌

  • విజేతలకు రూ 6లక్షల నగదు పురస్కారాలు

  • రఘు విద్యా సంస్థల చైర్మన్‌ కలిదిండి రఘు

విశాఖపట్నం, సెస్టెంబర్ 25 (న్యూస్‌టైమ్): రఘు విద్యా సంస్థల నిర్వహణలో ఈ నెల 29వ తేదీ వరకు ఇమేజిన్‌ టు ఇన్నోవేట్‌ కార్యక్రమాన్ని నగరంలో నిర్వహిస్తున్నట్లు రఘు విద్యా సంస్థల చైర్మన్‌ కలిదిండి రఘు తెలిపారు. దేశంలో నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తున్న ఈ కార్యక్రమానికి రఘు విద్యా సంస్థలు సహకారంతో నిర్వహించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి ఈ-బైక్‌, గో కార్ట్‌ చాంపియన్‌షిప్‌లను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.

దేశం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో యువత ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారన్నారు. విద్యార్థులు రూపొందించి, తీర్చిదిద్దిన ఈ-వాహనాలను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతోందన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థల నిపుణులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఐదు రోజుల కార్యక్రమంలో 50 బృందాలు పాల్గొంటాయన్నారు. ఒక్కో బృందంలో 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు. విద్యార్థుల తీర్చిదిద్దిన వాహనాలకు సాంకేతిక ప్రమాణాలు, టెరైన్‌ టెస్ట్‌, బ్రేక్‌ టెస్ట్‌, యాక్సలరేషన్‌ టెస్ట్‌ వంటివి పరీక్షించడం జరుగుతుందన్నారు.

విశాఖ నగరం తొలిసారిగా జాతీయ స్థాయి మోటారు స్పోర్ట్సు ఈవెంట్‌కు వేదికగా నిలుస్తోందన్నారు. అంతర్జాతీయ ఫార్ములా రేసర్లు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందన్నారు. బుధవారం మద్యాహ్నం 3 గంటలకు రఘు విద్యా సంస్థల్లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇమేజిన్‌ టు ఇన్నోవేట్‌ సీఈఓ సుభాష్‌ పిల్ళై, పోలీస్‌ కమీషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా, జీఎస్‌టీ అడిషనల్‌ కమిషనర్‌ ఎస్‌.నరసింహా రెడ్డి, టీ హబ్‌ ఉపాధ్యక్షుడు(కార్పొరేట్‌ ఇన్నేవేషన్‌) డాక్టర్‌ టి.శాంత తదితరులు హాజరయ్యారు. విజేతలకు రూ 6 లక్షల నగదు బహుమతులు, 100కు పైగా ట్రోఫీలు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు రఘు.