రాజకీయ రాబంధులు!

757
  • విశాఖలో భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు

  • కొత్తగా వెలుగులోకి వస్తున్న నమ్మలేని నిజాలు

విశాఖపట్నం, నవంబర్ 9 (న్యూస్‌టైమ్): కొత్త రాష్ట్రం, సరికొత్త వ్యూహాలు, కొండంత ఆశలు, చూస్తుండగా తెలుగు రాష్ట్రాల పెద్ద గద్దలన్నీ రాబందులుగా మారాయి. వీళ్ళ నీచపు బతుకులు ఎంతకు దిజారాయంటే స్మశానంలో శాశ్వత నిద్రలో ఉన్న శవాల దగ్గర కూడా అందినకాడికి రిజిస్ట్రేషన్ చేయించుకొని దర్జాగా దొరికినంత దోచుకున్నారు. భిక్షగాళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళ అంట్లు కడిగే వీళ్ళ దౌర్భాగ్య బతుకులు చెడ.

అన్నీ పక్కా రిజిస్ట్రేషన్లు. మధ్యతరగతి వారు లక్ష్యంగా, వారి చిరు ఆశల బలహీనతలను వారధిలా చేసుకొని కోట్లాది రూపాయలను ఐస్ క్రీంలా ఏంచక్కా తేనుపులు కూడా చప్పరించేశారు. పరిస్థితులు మారుతున్నాయని తెలిసి ఊసరవెల్లి సైతం సిగ్గు పడే విధంగా పార్టీ రంగులు మార్చడానికి వెనుకాడని వైనాలు వెలుగులోకి వస్తున్నాయి. అందిస్తున్న పరిశోధన కథనాలలో ఇది మొదటిది.

ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అక్టోబరు 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఫిర్యాదుల స్వీకరణ గడువు శనివారంతో ముగియనుంది. ఇంకా ఎవరైనా ఫిర్యాదిదారులు ఉంటే వారి నుంచి వినతులు స్వీకరించాలని సిట్‌ నిర్ణయించింది. ఇలాంటి వారి కోసం ఈ నెల 11 నుంచి సిట్‌ కార్యాలయమైన వైఆర్‌పీసీ అతిథి గృహంలో ఒక కౌంటరు ఏర్పాటు చేస్తున్నారు. తొలి ఏడు రోజుల్లో వేలాది అర్జీలు వచ్చాయి. వీటిలో సిట్‌ పరిధిలోని ఏడు అంశాలపై అందినవి 2895 నాన్‌ సిట్‌ పరిధిలోని అంశాలపై 996 వినతులు వచ్చాయి. 1899 ఫిర్యాదులపై సిట్ అధికారులు దర్యాప్తులో ముందుకు సాగుతారు. ప్రస్తుతం వీటి పరిశీలన మొదలైంది. ఇందుకోసం నలుగురు ఉప కలెక్టర్లను ప్రత్యేకంగా తీసుకున్నారు.

ఫిర్యాదుల్లోని అంశాలను ఉప కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రెవెన్యూ వర్గాల వద్ద ఉన్న దస్త్రాలతో సరిపోల్చనున్నారు. ఫిర్యాదుల్లో వాస్తవమెంత ఉందో తేల్చే బాధ్యతను ఉప కలెక్టర్లకు అప్పగించారు. వారిచ్చే నివేదికల ఆధారంగా సిట్‌ బృందం మరో విడత పరిశీలన చేస్తుంది. వందలాదిమంది బాధితులు తరలివచ్చి తమ గోడు వినిపించారు.
విశాఖ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 13 మండలాల్లో భూ అక్రమాలపై ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టాలని తొలుత సిట్‌ నిర్ణయించింది. కానీ జిల్లాలోని ఇతర మండలాల నుంచి కూడా వినతులు అందాయి. అందులో ఎన్నో భిన్న కోణాలు వెలుగుచూసాయి. దస్త్రాలలో దాచని నిజాలు బహాటంగా బయటకు తొంగిచూస్తున్నాయి.

సింహాచలం దేవస్థానం, రెవెన్యూ అధికారులు కలిసి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని తెదేపా నాయకుడు పాశర్ల ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. కప్పరాడ గ్రామంలో సర్వే సంఖ్య 13లో 2 ఎకరాల విలువైన భూమి ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా రాసి ఇచ్చేశారన్నారు. సర్వే సంఖ్య 275లో పలు ఆక్రమణలున్నాయి. గాజువాక, విశాఖ రూరల్, పరవాడ, భీమిలి, ఆనందపురం, చినగదిలి, పెదగదిలి ప్రాంతాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రైవేటు భూముల కబ్జా, 22ఎ వివాదాలపై అధికంగా ఫిర్యాదులు ఆందాయి.