జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులను గంట్ల శ్రీనుబాబు దంపతులతో కలిసి పోతుమహంతి నారాయణ్ అధ్వర్యాన జర్నలిస్టులు సత్కరిస్తున్న దృశ్యం

విశాఖపట్నం, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ (ఏపీబీజేఏ) సంయూక్త ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడి జల ఉద్యానవనంలో ‘జర్నలిస్టుల ఉగాది సంబరాలు’ ఘనంగా జరిగాయి. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం (వీజేఎఫ్) అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సారధ్యంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు ముఖ్యఅతిథులుగా పాల్గొని ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు.

ఈసందర్భంగా మేయర్ కుమారి మాట్లాడుతూ తను నగర ప్రధమ పౌరురాలిగా ఎన్నికైన తర్వాత హాజరైన తొలి కార్యక్రమం జర్నలిస్టులది కావడం జీవితంలో మరువలేనిదన్నారు. నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్న తన ప్రయత్నానికి పాత్రికేయుల సహాయం, సహకారాలు ఎంతో అవసరమన్నారు. గంట్ల శ్రీను బాబు, నారాయణ్ సారధ్యంలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు అనేకం అమలు జరుగుతున్నాయన్నారు. నగర పరిధిలోని జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు చేయూతనందిస్తానన్నారు.

కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రామ్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం పాలకమండలి పూర్వపు అధ్యక్షుడు వంకాయల సన్యాసిరావు, సామాజిక కార్యకర్త, గంట్ల శ్రీను బాబు సతీమణి గంట్ల సత్యవతి, జర్నలిస్టుల సంఘం నాయకులు దాడి రవికుమార్, ‘లక్ష్యం’ రవికుమార్, ఇరోతి ఈశ్వరరావు, సాంబశివరావు, ఆనంద్ కుమార్, ‘విధి విలాసం’ చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ మేయర్ దంపతులను, డాక్టర్ రామ్ కుమార్, జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్, పంచాంగ శ్రవణకర్తను కార్యక్రమ నిర్వాహకులు సత్కరించారు. అనంతరం గంట్ల శ్రీనుబాబు, నారాయణ్‌ను మేయర్ దంపతుల చేతుల మీదుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మధురవాడ యూనిట్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.