ప్రజా తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం: సీఎం

129
  • ఐదేళ్లు ప్రజా సంక్షేమానికి కష్టపడ్డామని వెల్లడి

  • ఏకపక్ష నిర్ణయాలతో ఈసీ విశ్వసనీయత కోల్పోయిందని విమర్శ

అమరావతి, మే 20 (న్యూస్‌టైమ్): ఐదేళ్లు కష్టపడి ప్రజాసంక్షేమానికై పనిచేశామని, ఈ కష్టానికి ప్రజలిచ్చే తీర్పు ఎన్నికల ఫలితాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలింగ్ సమయం ముగిసినా మరుసటి రోజు తెల్లవారు ఝామున 4:30 గంటల వరకు క్యూలో నిలబడి ప్రజలు ఓటువేస్తే అవి లెక్కించడానికి సమయం లేదా? రూ. 9000 కోట్లు ఖర్చుచేసి వీవీప్యాట్లను తీసుకొచ్చింది అలంకారం కోసమా? అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. అమరావతి ప్రజావేదిక వద్ద సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీవీ ప్యాట్ల లెక్కింపుపై తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.

పారదర్శకంగా, ప్రజాస్వామికంగా జరగాల్సిన ఎన్నికలను నరేంద్ర మోదీ కనుసన్నలలో నడిచేలా చేసి ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను ప్రశ్నించే స్థితికి చేర్చుకుందన్నారు. 23 జాతీయ, ప్రాంతీయ పార్టీలు 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని పోరాటం చేస్తుంటే, ఎన్నికల సంఘం మాత్రం సమయాన్ని సాకుగా చూపించి, లెక్కింపు కుదరదని వాదిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య విలువలను ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘం తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని, కేవలం మోదీ ప్రాపకం కోసం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలవల్ల ఎన్నికల సంఘం సభ్యుల మధ్యనే విబేధాలు మొదలయ్యాయని, అందుకే ఈ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో కూడా అనేక అనుమానాలు రేకెత్తాయని చంద్రబాబు తెలియజేశారు. సర్వేలు చేసుకోవడం, చేయించుకోవడం అందరికీ అలవాటుగా మారిందని, తెదేపా 35 ఏళ్లుగా సర్వేలు చేస్తోందని, నూటికి వెయ్యి శాతం ఏపీలో తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెదేపా గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం వల్లే తెదేపా విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. తను ఒక్క పిలుపు ఇస్తే అందరూ వచ్చి అర్ధరాత్రి దాటే వరకూ ఓటు వేశారని, అనేక ఇబ్బందులు పడి తెలంగాణ నుంచి వచ్చి ఓటు వేశారని, సాంకేతికతను దుర్వినియోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

అందుకే వీవీప్యాట్‌ స్లిప్పులపై తన డిమాండ్‌ను అందరూ ఒప్పుకొంటున్నారని చంద్రబాబు చెప్పారు. మాజీ సీఈసీ ఖురేషి కూడా తన అభిప్రాయాలను సమర్థించారని, వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయని, వీవీప్యాట్‌ స్లిప్పులను బాక్సులో వేసి లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని ఖురేషి చెప్పారని, పారదర్శక విధానంతో ఓటర్లలో విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్‌ను ఓటరు చేతికి ఇవ్వాలని, ఓటరు సంతృప్తి చెందాక పక్కనున్న బాక్స్‌లో వేయాలని, ఈవీఎంలలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పుల బాధ్యతలను వేర్వేరు అధికారులు చూస్తున్నారని, 5 వీవీప్యాట్ల లెక్కింపులో తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఇంకా చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని ఈసీ పరిష్కరించాలన్నారు. ఈవీఎంలపై అనేక ఆరోపణలు ఉన్నాయని, ప్రోగ్రామింగ్‌ చిప్‌ నియంత్రణ ద్వారా ఏదైనా చేయొచ్చన్నది అనేక సందర్భాలలో రుజువైందన్నారు.

అయితే, ఎన్నికలు ఇలా జరుగుతాయని మాత్రం తను ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ముందు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో మాట్లాడి ఆ తర్వాత ఢిల్లీ వెళ్తానని, అందరం చర్చించిన తర్వాతే రాష్ట్రపతిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు తమ పక్షానే నిలిచారన్నది తమ వద్ద ఉన్న అంతర్గత సమాచారమని, ఈ విషయంలో నూటికి వెయ్యి శాతం తామే గెలుస్తామన్న ధీమా కలుగుతోందన్నారు. మరోసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలన్న వినతిని రాష్ట్ర ఓటర్లు స్వీకరించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.