కరోనా క్వారైంటన్ సెంటర్ వద్ద వాతావరణం
(* బొల్లెపల్లి కిషన్)

అంతులేని ఆవేదన, ఆందోళనను అంతం చేయాల్సిన తరుణమిది. జనంలోని భయాందోళనలు పోగొట్టి ఆసరాగా నిలబడాల్సిన సమయమిది. ప్రజారోగ్యమే అజెండాగా ముందుకు సాగాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల మీద ఉంది. కానీ, జడలు విప్పిన కరోనా మహమ్మారి నుంచి రక్షించాల్సిన ప్రభుత్వాలే ఎవరి బాగోగులు వారే చూసుకోవాలని నీతులు చెప్పే పరిస్థితులు దాపురించాయి. ప్రజల ప్రాణాలను కరోనా దయాదక్షిణ్యాలకు వదిలేసే దయనీయ దుస్థితి తలెత్తింది.

ప్రజల ప్రాణాలు తృణప్రాయంగా గాల్లో కలుస్తున్నా ఈ పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. ఎవరి అజెండా వారికుంది. ప్రధాని దేశాన్ని కరోనా కబంధ హస్తాలకు వదిలేసి రామమందిర నిర్మాణ పనిలో మునిగి తేలుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఒకరు ఉన్న సచివాలయం కూల్చి కొత్త దాన్ని నిర్మించే పనిలో ఉండగా, మరొకరు రాజధానిని మార్చి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ధ్యాసలో మునిగితేలుతున్నారు. ఈ స్థితిలో కళ్లముందే కాదనలేని సత్యంగా కనిపిస్తూనే ఉంది. ఇక అనేక కొవిడ్ ఆస్పత్రుల్లో తగిన మౌలిక సదుపాయాల్లేవనే విమర్శలు అక్షర సత్యాలే.

ఆక్సిజన్ ఉండదు, ఐసీయూ పడకలు తక్కువ, వెంటిలేటర్లు మరింత తక్కువ, అన్నింటికీ మించి వైద్య అధికారులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇప్పుడు వైరస్ కంటే భయమే బాధితులను విగతజీవులుగా మార్చేస్తున్న పరిస్థితులున్నాయి. వారికి ధైర్యం చెప్పి ఆపన్నహస్తం అందించాల్సిన పాలకులు వట్టి మాటలతోనే సరిపుచ్చుకోవడం దారుణం. ఇక కార్పొరేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరించటం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి చర్యలను నియంత్రించే నాథుడే లేకుండా పోయాడు. సామాన్యులు తమకు అన్యాయం జరిగిం దనో, తమకు న్యాయబద్దంగా రావాల్సిన నిధులు, హక్కుల గురించి ప్రశ్నిస్తూనో ఏ కొద్దిపాటి నిరసన ప్రదర్శనకు దిగినా, నిర్ణయించిన సమయానికి మించి ఏ కొద్దిసేపు దుకాణాలు తెరచినా- సాంక్రమిక వ్యాధుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వాలు, ఏ ఒక్క ఆస్పత్రి పైనైనా ఇంతవరకూ కేసు పెట్టారా..? పెట్టినా కఠిన శిక్షలు, జరిమానాలు విధించారా..? అంటే లేదనేది బహిరంగ రహస్యమే.

శవాలతో వ్యాపారం చేస్తున్నారనే నానుడి ఇప్పటి వరకూ విని ఉంటామేమోగానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామంటే కాదనగలమా? ప్రజల ప్రాణాలే వ్యాపారాస్త్రంగా మలుచుకుంటున్న కార్పొరేట్ ఆస్పత్రులు అమానుషంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులున్నాయి. దేశంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం చేయటం, మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం, ఈ స్థితిలో మరణాల నివారణలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రియాశీలంగా చేస్తున్న కృషి ఏమీ అంతగా కనిపించడం లేదు. కొన్ని పద్ధతులు బాగానే ఉన్నా, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించే చర్యలు చేపట్టకుండా పరిస్థితులను గాలికి వదిలేసి కూర్చున్నట్లు స్పష్టమవుతుంది. ప్రయివేటు ఆస్పత్రులపై నియంత్రణ, పారదర్శకమైన సమా చారం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చడం, ఈ మూడింటిలోనూ ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. దీంతో ప్రజలు గాల్లో దీపాల్లా బతికేస్తున్నారు. ఈ స్థితిలో ప్రజల్లోని భయాన్ని పోగొట్టి భరోసాను కల్పించేందుకు పాలకులు కృషి చేయాలి.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, ‘ఘంటారావమ్’ తెలుగు దినపత్రిక; +91 89783 92904)