వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలన

213

కాకినాడ, ఏప్రిల్ 10 (న్యూస్‌టైమ్): తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలలో గురువారంనాడు పోలింగ్ నిర్వహించడానికి, బుధవారం సాయంకాలానికి ఆయా పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ టీమ్‌లు చేరుకున్నాయి. జిల్లాలోని 19 నియోజకవర్గాల ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రీబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎమ్‌లు, సిబ్బంది రవాణా ఉదయం 9 గంటల నుండి మొదలైయింది.

ఆయా నియోజకవర్గాలలో రూట్‌లు వారిగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పోలింగ్ పార్టీలను పోలింగ్ స్టేషన్లకు తరలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఈవీఎమ్‌లు సిబ్బంది తరలింపు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు. కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కార్తికేయమిశ్రా కాకినాడలోని కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌లో నియోజకవర్గాల వారీగా ఈవీఎమ్‌లు, సిబ్బంది రవాణాను వెబ్ కాస్టింగ్ ద్వారా బుధవారం పరిశీలించారు. ఈ మేరకు ప్రతీ నియోజకవర్గ కేంద్రాన్ని వెబ్ కాస్టింగ్ కోసం అనుసంధానం చేసారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ బుధవారం ఉదయం నుండి ఆయా నియోజక వర్గాలలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎమ్‌లు, పోలింగ్ సిబ్బంది తరలింపు మొదలైయిందని, మధ్యాహ్నం నాటికి సిబ్బంది అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని అన్నారు.

అదే విధంగా పోలింగ్ నిర్వహించే సిబ్బందికి ఆహార పంపిణీ ఏర్పాట్లు చేసారని తెలిపారు. జిల్లాలో గుర్తించిన 1437 సమస్యత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తోపాటు మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగిందని అన్నారు. ఏజెన్సీలోని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈవీఎమ్‌లు, వివిపాట్‌ల నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కోసం 70 మంది బెల్ ఇంజనీర్ల సేవలను వినియోగిస్తున్నామని అన్నారు.

ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు 3 ఇంజనీర్లు అందుబాటులో వుంటారని, ఏజెన్సీ ప్రాంతానికి 9 మంది ఇంజనీర్లను పంపుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం ఉదయం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల మాక్ పోల్ నిర్వహించడం, వాటిని క్లీయర్ చేసి పోలింగ్ నిర్వహించవలసి వున్నందున, ఈ సమయాన్ని ఉదయం 5.30కే నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. బుధవారం ఉదయం మెక్లారిన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కాకినాడ సిటీ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ కార్తికేయమిశ్రా పరిశీలించారు.

ఈ సెంటరులో ఎన్నికల సామాగ్రి పంపిణీ రూట్‌లు వారీగా ఈవీఎమ్‌లు, సిబ్బంది రవాణాను, కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషన్ సుమిత్ కుమార్ గాంధీ, కాకినాడ నియోజకవర్గ అధికారిణి ఆర్‌డీఓ జి.రాజకుమారి ఉన్నారు.