దళితుల సంక్షేమానికి కృషి: మంత్రి కొప్పుల

71

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (న్యూస్‌టైమ్): తెలంగాణ షెడ్యూల్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం మంగళవారం స్థానిక డీఎస్ఎస్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి తెలంగాణ షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి చైర్మన్ కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్‌డిఎఫ్ సమావేశాలు జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.

బడ్జెట్ ప్రతిపాదనలు ప్రణాళికాబద్ధంగా ఉండాలని, విడుదలైన నిధులను ఖచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కొత్త చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టంతో షెడ్యూల్ కులాలకు సామాజిక భద్రత, ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని పేర్కొన్నారు. మిగితా సామాజిక వర్గాలకు ఎస్సీలకు అంతరం తగ్గుతుందని, ఒక ఆర్థిక సంవత్సరంలో ఖర్చు కాని నిధులను తర్వాతి సంవత్సరం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ అదే సంవత్సరం ఖచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు.

ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్, 37 ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.