పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు

4484

చిత్తూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందివ్వాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధికారులను, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలలో ప్రజా సంక్షేమ అమలు గురించి జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, భూగర్భ గనుల శాఖామాత్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించడం జరుగుతున్నదని, గ్రామ వాలంటీర్లు అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తారన్నారు.

ప్రతి 2 వేల జనాభాకు ఒక ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఈ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,11,448 మంది వాలంటీర్లు ఒకే సారి ఉద్యోగాల్లో చేరనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల రుణాలు రూ.27 వేల కోట్లు, వడ్డీ రూ.1800 కోట్లు చెల్లించడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతం గా అధికారులు పని చేయాలని, అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలను అందివ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు కార్యక్రమంను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. అర్హులైన కౌలుదారులందరికీ రుణాలకు అందజేయాలని, ప్రతి నియోజకవర్గానికి భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రతి ఇంటికి రానున్న రోజుల్లో కుళాయి కనెక్షన్‌ను ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని, క్షేత్ర స్థాయిలో ఆర్‌డబ్ల్యూ‌ఎస్ అధికారులు స్థానికంగా ఉంటూ ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. డ్వామా శాఖ ద్వారా జిల్లాలో శ్మశాన వాటికలను గుర్తించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలను అందించాలని తెలిపారు.

స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 14 నియోజకవర్గాలలో డిఎంఅండ్‌హెచ్ఓ, డిసిహెచ్ఎస్ పర్యటించి వైద్య ఆరోగ్య సిబ్బందికి గల సమస్యలను పరిష్కరించడంతో పాటు వైద్య సేవలను మరింతగా ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. అధికారులు వారి శాఖాపరంగా పూర్తి స్థాయి భాధ్యతతో విధులు నిర్వహించాలని స్థానిక శాసన సభ్యులు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందంజలో ఉండే విధంగా కృషి చేయాలన్నారు.

హార్టికల్చర్, ఏపిఎంఐపి శాఖలు సమన్వయంతో పని చేస్తూ రైతులు ఉద్యాన వన పంటల సాగును అవలంబించే విధంగా మరియు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందే పంటల సాగుకు ఆసక్తి చూపేలా క్షేత్ర స్థాయిలో ఈ శాఖల సిబ్బంది అవగాహనా సదస్సులను నిర్వహించాలన్నారు.