‘వైసీపీ రౌడీలతో కొందరు పోలీసుల దోస్తానా?’ పేరిట ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ ఇటు రాజకీయ, అటు పోలీసు వర్గాలలో కూడా చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని శాంతిభ్రతల పరిస్థితి, పోలీసుల పనితీరు, అధికార పార్టీ అడ్డగోలు వ్యవహారాలు తదితర అంశాలపై ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను ఉద్దేశించి డీజీపీ స్పందనకు ప్రతిస్పందన అన్నట్లు టీడీపీ మరో పోస్టు రూపొందించి తురక కిషోర్ వ్యవహారాన్ని మరోమారు తెరమీదకు తెచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మాచర్ల ఘటనలో తురక కిషోర్‌కు స్టేషన్ బెయిల్ లభించడాన్నే తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా అదే కిశోర్ పోలీసులతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని పార్టీలు చేసుకోవడాన్ని మరింత హైలెట్ చేస్తూ ప్రచారం లంకించుకున్నారు. తెలుగుదేశం నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్న, న్యాయవాదిపై దాడికి పాల్పడినందుకు.. తురక కిషోర్‌పై హత్యాయత్నం కింద కేసు పెట్టిన పోలీసులు అప్పట్లో ఆయనకు స్టేషన్ బెయిల్ కూడా మంజూరుచేశారు.

నాటి దాడిలో పోలీసుల వాహనం కూడా ధ్వంసమైంది. అయితే.. ఒక రోజు వ్యవధిలో తురక కిషోర్‌కు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం సంచలనంగా మారింది. మాచర్ల ఘటనలో తురక కిషోర్‌ సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరు నిందితులను గుర్తించామని గుంటూరు రేంజ్‌ ఐజీ అప్పట్లో మీడియాకు వెల్లడించారు. నిందితులపై 324, 509, 149, 188, 143, 147, 148, 341 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అదే కేసులో నిందితుల్లో ఒకరైన కిశోర్‌తో ఇలా దర్శనమిచ్చేసరికి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.