అమరావతి, జులై 30 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పడుతున్న పాట్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయినా, అక్కడక్కడ దొర్లుతున్న లోపాలు, క్షేత్రస్థాయిలో శాఖలు, విభాగాల మధ్య చోటుచేసుకుంటున్న సమన్వయ లోపం వంటి చిన్నచిన్న కారణాల దృష్ట్యా ఆశించిన ఫలితం కనిపించకపోగా, అప్రతిష్టపాలుకావాల్సి వస్తోంది. తాజాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టుచేసిన వీడియో ఆ విషయాన్నే ఎత్తిచూపుతోంది. అదేంటో మీరూ ఓ లుక్కేయండి. ఇక దాదాపు ఇలాంటివే తాజా వార్తల వివరాల్లోకి వెళ్లే… గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటేపూడి నలంద కాలేజ్ క్వారంటైన్ సెంటర్‌లో కరోనా పేషెంట్లు ఆందోళనకు దిగారు. భోజన వసతులు సరిగాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్‌లో మూడు రోజుల నుంచి మంచి నీరు, మరుగుదొడ్లు, కనీస వసతులు లేవని ఎమ్మార్వోపై బాధితులు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో, బాధితులు మధ్య వాదన జరిగింది.

కనీస వసతులు లేకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోతామని తెలిపారు. బాధితులకు సమాధానం చేప్పలేక తహసిల్దార్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా, నెల్లూరు జీజీహెచ్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. జైలులో ఖైదీలకంటే కరోనా బాధితుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ప్రతిపక్షాలు, బాధితులు వాపోతున్నారు. కరోనా బాధితులని వైద్యులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాయిలెట్స్ వద్ద ముందుకు పడి కరోనా బాధితుడు మృతి చెందాడు. ఎప్పుడు మృతి చెందాడో తెలియని పరిస్థితి. టాయిలెట్స్ శుభ్రపరిచేందుకు వెళ్లిన పారిశుధ్య కార్మికులు మృతదేహాన్ని గమనించారు.

ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయలక్ష్మిపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. కరోనా కట్టడి కోసం గ్రామ కట్టుబాటును మత్స్యకార కుటుంబాలు విధించుకున్నాయి. గ్రామం విడిచి వెళ్లకూడదని, బయటి వారు గ్రామంలోకి రాకూడదంటూ గ్రామస్తులంతా స్వీయ లాక్‌డౌన్ విధించుకున్నారు. అయితే, బయటకు వెళ్లి గ్రామ కట్టుబాటును అతిక్రమించారంటూ పామేజీ లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లోని ఫర్నిచర్, కారు, బైకులను గ్రామస్తులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి దాడి చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు గ్రామం విడిచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో గ్రామంలో పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈనెల 22వ తేదీన ఇదే గ్రామంలో లక్ష్మయ్య సోదరుడు పామేజీ శ్రీనివాసరావు, లీలావతి కుటుంబంపై కూడా గ్రామస్తులు దాడి చేశారు.

తిరుపతిలోని అంధుల ఆశ్రమంలో చోటుచేసుకున్న దారుణం మరీ విచారకరం. అంధుల ఆశ్రమంలో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా వచ్చిన వ్యక్తిని క్వారంటైన్‌కు పంపకుండా, సొంత ఊరికి వార్డెన్ పంపారు. సహచరుల సాయంతో క్వారంటైన్‌లో అంధుడైన కరోనా బాధితుడు చేరాడు. అంధుల హాస్టల్ నుంచి మిగిలిన 22 మందిని కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆహార సరఫరా కూడా వార్డన్ నిలిపివేశాడు. దీంతో ఆకలితో అలమటిస్తున్నారు. తమకు ఎవ్వరూ లేరని, భూతిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని హాస్టల్‌లోనే ఉంటామని అంధులు వేడుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇస్తే హాస్టల్‌లో ఉండనిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇక, కొవిడ్‌ బాధితులను ఆస్పత్రికి వచ్చిన గంటలోపే బెడ్‌పైకి చేర్చాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కానీ, నిన్న విజయవాడ కొవిడ్‌ ఆస్పత్రిలో పడక కోసం ఓ బాధితురాలు ఏకంగా ఐదుగంటలపాటు ఎదురుచూసింది. చివరకు ఆ పడిగాపుల్లోనే పడరాని నరకం అనుభవిస్తూ ప్రాణాలు వదిలేసింది. బాధితుల కథనం ప్రకారం, విజయవాడ సూర్యారావుపేటకు చెందిన ఓ మహిళకు(49) రెండు రోజుల నుంచి విరేచనాలు అవుతున్నాయి. జ్వరం మాత్రం లేదు. అయినా కుటుంబ సభ్యులు అనుమానంతో గత సోమవారం కరోనా పరీక్ష చేయించారు. వైద్యాధికారులు బుధవారం ఉదయం ఫోన్‌చేసి పాజిటివ్‌ తేలినట్టు చెప్పారు.

కుటుంబ సభ్యులు ఆలస్యం చేయకుండా చికిత్స కోసం ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రికి కారులో వచ్చారు. అక్కడ ఎవరూ వారిని పట్టించుకోలేదు. అప్పటినుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు, అంటే ఐదు గంటలపాటు తీసుకువెళ్లిన కారులోనే బాధితురాలు బాధపడుతూ ఉంది. ఆమె ఊపిరి అందక చాలా ఇబ్బంది పడుతుండటంతో ఆస్పత్రి వైద్య సిబ్బందిని బెడ్‌ కోసం కుటుంబ సభ్యులు ప్రాథేయపడ్డారు. డాక్టర్ల కాళ్లా.. వేళ్లా పడితే, మధ్యాహ్నం మూడు గంటలకు వీల్‌ఛైర్‌లో బాధితురాలిని క్యాజువాలిటీలోకి తీసుకెళ్లారు. అయితే, ఆ వార్డులో మంచాలు ఖాళీ లేవు. ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న ఆమెను అక్కడే కటిక నేలపై పడుకోబెట్టేసి వీల్‌ఛైర్‌ తీసుకుపోయారు. ‘ఊపిరి అందడం లేదు. బతికించా’లంటూ బాధితురాలు అక్కడి వైద్యుల కాళ్లు పట్టుకుని వేడుకోవడంతో, ఆ పక్కన బెడ్‌పై ఉన్న రోగికి అమర్చిన ఆక్సిజన్‌ తీసుకువచ్చి ఆమెకు అమర్చారు. దీంతో ఆ రోగి బంధువులు గొడవకు దిగారు. మళ్లీ దాన్ని ఆ రోగికే వైద్యులు అమర్చారు.

ఎప్పుడయినా ఆక్సిజన్‌ తీసేశారో ఆ క్షణమే ఆ బాధితురాలి ఊపిరి ఆగిపోయింది. ఆమె కుటుంబసభ్యులు పెద్దపెట్టున విలపిస్తూ, ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహించారు.