హక్కలు-చట్టాల గురించి తెలుసుకోవాల్సిందే!

530

హైదరాబాద్, నవంబర్ 9 (న్యూస్‌టైమ్): రాకేష్‌ ఇంటి సామాను కొనేందుకు కిరాణం దుకాణానికి వెళ్లాడు. మొత్తం సామాను గోనె సంచిలో కట్టించుకొని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంటికొచ్చిన తర్వాత సంచిలో నుంచి సరుకులు తీసి బయటపెట్టాడు. గులాబ్‌ జామున పెట్టెను తీసి దానిపైనున్న వివరాలను చదవసాగాడు. ఈక్రమంలో ఆ గులాబ్‌ జామున పెట్టె వాడకానికి సంబంధించిన ఎక్స్‌పరీ తేదీ ముగిసిందని గుర్తించాడు. సందేహం వచ్చి మిగితా సరుకులూ గబగబా పరిశీలించాడు. మరో రెండు సరుకులపైనా ఎక్స్‌పరీ తేదీ ముగిసిందని ఉండటాన్ని గుర్తించాడు.

ఆ సరుకులను తీసుకెళ్లి సదరు దుకాణదారుడికి ఇచ్చి, కొత్త ప్యాకింగ్‌, వాడకానికి గడువు(ఎక్స్‌పరీ తేదీ) ఉన్నవాటిని తీసుకున్నారు. ఇదొక్కటే కాదు తూకంలో మోసం జరిగినా ధరల్లో వ్యత్యాసం చోటుచేసుకున్నా నాణ్యతలో తేడా జరిగినా చట్టపరంగా ప్రశ్నించడంతో పాటు, జరిమానా సాధించుకునే హక్కు ప్రతీ వినియోగదారుడికి ఉంటుంది. ఈవిషయం తెలిసినా సాక్షాత్తూ ఉన్నత విద్యావంతులైన వినియోగదారుల్లోనూ నిర్లిప్తత రాజ్యమేలుతోంది. ‘మనకు ఎందుకులే?’ అనే ఒకేఒక్క పదం కల్తీ, తూకం మోసాలకు తావిస్తోంది. వినియోగదారులను దగా చేస్తున్నవారు దర్జాగా కాలం గడిపేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికైనా వినియోగదారులు మేల్కొనాలి. వినియోగదారుల హక్కుల చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

ఆన్‌లైన్ మార్కెట్ యుగంలో వినియోగదారుల హక్కులు మృగ్యమవుతున్నాయి. వినియోగదారుడిగా నేరుగా వస్తువును కొని ఉపయోగించుకునే కాలం పోయింది. అవసరార్థం ఏ వస్తువునైనా ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా వస్తువులను కొనితెచ్చుకునే పరిస్థితులు వచ్చాక వినియోగదారుడు మరింతగా మోసాలకు గురవుతున్న స్థితి ఏర్పడింది. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, ఆశించిన మేర నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా, అంతేగాక మరేవిధమైన మోసానికి గురైనా దానిగురించి అడిగే పరిస్థితులు అంతగా లేవు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019 పలువిధాలుగా వినియోగదారులకు రక్షణ కల్పిస్తున్నది.

వినియోగదారుల చట్టం-1986 స్థానంలో వచ్చిన కొత్తచట్టం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధించే విధంగా ఉన్నది. ఇది అన్నిస్థాయిల్లోనూ జిల్లా నుంచి జాతీయస్థాయిదాకా అంత టా వినియోగదారులకు రక్షణగా నిలబడుతున్నది. వినియోగదారులకు నష్టం జరిగినప్పుడు జవాబుదారులను, కారకులను జరిమానాలతోనే సరిపెట్టకుండా కఠినశిక్షలు, జైలుకు పంపటానికి కూడా వెనుకాడని విధంగా కొత్తచట్టం వినియోగదారులకు రక్షణగా ఉంటున్నది. గత చట్టాలతో పోలిస్తే 2019 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అనేకవిధాలుగా విశిష్ఠమైనది. ఈ నూతన చట్టం పలువిధాలుగా వినియోగదారులకు రక్షణ కవచంగా ఉంటున్నది.

వినియోగదారుల కోసం అనేక రక్షణలు ఈ కొత్త చట్టంలో పొందుపర్చబడినాయి. వినియోగదారుల వివాద కేసులు సత్వర పరిష్కారం, వస్తువులు సరుకులుగా మారే క్రమంలో వాటి నిర్వహణ కూడా సమర్థవంతంగా నిర్వహించబడే అవకాశం ఉన్నది. వస్తు కొనుగోలు ఏ రూపంలో చేసినా ఆన్‌లైన్, ఆఫ్‌లై న్, మల్టీలెవల్ మార్కెటింగ్ తదితర విధానాల ద్వారా వినియోగదారులు వస్తు కొనుగోలు చేసినా వినియోగదారుడిగానే పరిగణిస్తూ అతనికి ఈ చట్టం రక్షణగా నిలుస్తున్నది. అలాగే ఈ చట్టంతో మార్కెట్‌లో స్వేచ్ఛాపూరిత పోటీ, వస్తువులకు సంబంధించి వాస్తవ సమాచారం తదితరాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

వినియోగదారుల హక్కుల విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, నాణ్యమైన సరకులు పొందే హక్కు ఉంటుంది. అలాగే ఇష్టమైన వస్తువును ఎంపిక చేసుకునే హక్కు, సమాచారం పొందే హక్కు, ఫిర్యాదు చేసే హక్కు, వస్తువుకు సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకునే హక్కుల వంటివి వినియోగదారుల హక్కులుగానే పరిగణించబడుతాయి. వీటితో పాటు కొత్త వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలో మరిన్ని హక్కులు పొందుపర్చబడినాయి.

1.కొత్త చట్టం ప్రకారం.. వినియోగదారుడు వస్తువును కొనుగోలు చేసిన తర్వాత మోసం జరిగిందని భావించినప్పుడు, ఆ వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినాసరే ఎక్కడినుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. గతంలో అయితే ఎక్కడ వస్తువును కొనుగోలు చేశా రో అక్కడే ఫిర్యాదు చేయటానికి అవకాశం ఉండేది. కొత్త చట్టం కారణం గా వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా ఆ వస్తు ఉత్పత్తి/ తయారీదారులపై ఫిర్యాదుచేసే అవకాశం ఉన్నది. 2.వస్తువును కొనుగో లు చేసిన తర్వాత తనకు తగురీతిలో న్యాయం జరుగలేదని భావించినప్పుడు అతనికి నష్టపరిహారం పొందే హక్కు కొత్త చట్టం కల్పించింది.

ఈ వెసులుబాటు కారణంగా కొనుగోలుదారులు వస్తు నాణ్యతా ప్రమాణాల పై, ఉపయోగ విలువపై వస్తు ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులపై కేసువేసి నష్టపరిహారం పొందవచ్చు. వస్తు నాణ్యతలో లోపాలున్నప్పుడు వారెంటీతో సంబంధం లేకుండానే తగురీతిలో నష్టపరిహారం కోరవచ్చు. దానికి అమ్మకందారు, తయారీదారులు బాధ్యత వహించాలి. 3.అపస వ్య, అక్రమ వ్యాపార పద్ధతుల ద్వారా వినియోగదారులకు నష్టం జరిగినప్పుడు కొనుగోలుదారులను ఒక సామాజిక సమూహం (తరగతి)గా పరిగణించి వారి రక్షణకు కొత్తచట్టం అండగా నిలుస్తుంది.

4.వినియోగ దారులు తమ ఫిర్యాదులను జిల్లాస్థాయి కన్స్యూమర్ కోర్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. 5.వినియోగదారుడు ఏ విషయంపై అయినా ఫిర్యాదు చేసినప్పుడు అదెందుకు తిరస్కరించబడిం దో తెలుసుకునే హక్కు ఉంటుంది. ఫిర్యాదుదారుని వాదన లేదా ఫిర్యాదు వినకుండా ఏ స్థాయిలో కూడా తిరస్కరించే అధికారం ఎవరికీ లేదు.

వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019లో మరో ఏడు ముఖ్య రక్షణలున్నాయి. అవి, 1.అక్రమ పద్ధతులు, లావాదేవీలను ఈ చట్టం నిరోధిస్తుంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. 2. ఆన్‌లైన్ అమ్మకాలు, టెలీ షాపింగ్, మల్టీ మార్కెటింగ్, ప్రత్యక్ష అమ్మకాలు లాంటివన్నీ ఈ చట్టపరిధిలోకి వస్తాయి. 3.వస్తువులు, సేవలు, నిర్మాణాలు, ఇండ్ల నిర్మాణా లు, ఫ్లాట్ల అమ్మకాల వంటివన్నీ కూడా వినియోగదారుల చట్టపరిధిలోకి వస్తాయి.

4. వస్తు ఉత్పత్తిలో నాణ్యతాలో పం, ఉత్పత్తి లోపం తదితర విషయాల్లో వినియోగదారునికి హానీ, లేదా నష్టం జరిగినప్పుడు చట్టం వినియోగదారునికి రక్షణగా నిలుస్తుంది. 5.ఏ సందర్భంలోనైనా అవసరమని భావించినప్పుడు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిర్దిష్ట వస్తు సముదాయాన్ని సాంతం వెనక్కిపిలిపించే హక్కు కలిగి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్నవి కేవలం సలహా, సూచనల వరకే పరిమితమై ఉండేవి. కొత్త చట్టం పూర్తిగా చట్టబద్ధత కలిగిన సంస్థగా సర్వాధికారాలు కలిగి ఉన్నది. 6. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం కూడా ఈ చట్టం ద్వారా ఏర్పడింది. ఇవన్నీ జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కూడా పనిచేస్తూ వినియోగదారులకు సత్వర న్యాయం అందిస్తాయి. 7.ప్రచార ప్రలోభాల ద్వారా వినియోగదారులను మోసపుచ్చే విధానాలకు చెక్‌పెట్టే విధంగా కొత్త చట్టం అధికారాలు కలిగి ఉన్నది.

ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో వినియోగదారులు అనేక రూపా ల్లో మోసాలకు గురవుతున్నారు. ఉత్పత్తిదారుడు, అమ్మకందారుడు ఎక్క డా కనిపించని ఆన్‌లైన్ యుగంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019, కొనుగోలుదారులకు పెద్ద ఆసరా, ఆయుధమని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ కొత్త చట్టం వెలుగులో చైతన్య వంతంగా ఆలోచించాలి. వినియోగదారులుగా తమ హక్కుల రక్షణకు పోరాడాలి. అంతిమంగా అవినీతి, అక్రమ వ్యాపారాలకు చరమగీతం పాడాలి. చైతన్యవంతమైన వినియోగహక్కుల స్పృహతోనే ఆరోగ్యకరమైన సామాజిక జీవనం సాధ్యం చేసుకోవాలి.

  • వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలివీ…

ఇండియన్ టెలీగ్రాఫ్‌ చట్టం(1865), పోస్టాఫీసు చట్టం(1898), ఇండియన్ సేల్స్‌ అండ్‌ గూడ్స్‌ చట్టం(1937), బీమా చట్టం(1938), డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ చట్టం (1940), డ్రగ్‌ కంట్రోల్‌ చట్టం(ఔషధ నియంత్రణ చట్టం) (1950), ఇండియన్ స్టాండర్డ్‌ ఇనస్టిట్యూషన(సర్టిఫికేషన్) చట్టం(1950), ఆహార కల్తీ నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్‌ ఫుడ్‌ అల్టరేషన్ చట్టం) (1954), డ్రగ్స్‌, మ్యాజిక్‌ రెమిడీ్‌స్‌(అభ్యంతరకర ప్రకటనలు) చట్టం(1954), నిత్యావసరాల చట్టం(1955), జీవిత బీమా చట్టం (1956), ట్రేడ్‌, మర్చండైజ్‌ మార్క్‌ చట్టం(1958), మోనోపలీస్‌, రిసిట్రక్టివ్‌ ట్రేడ్‌ ప్రాక్టీస్‌ చట్టం(1969), ప్రైజ్‌, చిట్స్‌, మనీ సర్క్యులేషన స్కీమ్స్‌ చట్టం(1970), తూనికలు, కొలతల ప్రమాణాల చట్టం(1977), ప్రివెన్షన్ ఆఫ్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌, మెయింటెనెన్స్ ఆఫ్‌ సప్లయిస్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ చట్టం(1980), వాయివు (కాలుష్య నియంత్రణ) చట్టం (1981), గృహోపకరణ విద్యుత పరికాలక్వాలిటీ కంట్రోల్‌ చట్టం(1951), చిట్‌ ఫండ్స్‌ చట్టం(1982), తూనికలు, కొలతల ప్రమాణాల ఎన్‌ఫోర్సుమెంట్‌ చట్టం (1985), బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్‌ చట్టం (1986), వినియోగదారుల రక్షణ చట్టం (1986), పరిసరాల పరిరక్షణ (ఎన్‌ఫోర్సుమెంట్‌ ప్రొటెక్షన్‌) చట్టం (1986), ఎలక్ట్రికల్‌ అప్లయన్సెస్‌ (క్వాలిటీ కంట్రోల్‌) ఆర్డర్‌ (1986), ఎలక్ట్రికల్‌ వైర్స్‌, కేబుల్స్‌ అప్లయన్సెస్‌, యాక్సెసరీస్‌ చట్టం (1993), కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రెగ్యులేషన్‌ చట్టం (1995), ఇనఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం (2000), ఇండియన్‌ ఎలక్ర్టిసిటీ చట్టం (2003). వినియోగదారులందరికి ఉపయోగపడే ఈ చట్టాల్లో ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతున్నాయి. తనకు అన్యాయం జరిగినప్పుడు వినియోగదారుడు ఫిర్యాదు ద్వారా లేదా కోర్టులో కేసుద్వారా న్యాయం పొందొచ్చు.

  • వినియోగదారులెవరు?

వినియోగదారులంటే ఎవరు? అనే సందేహం కలగవచ్చు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసిన వారు వినియోగదారులు. అలాగే కొనుగోలుదారుల అనుమతితో ఆ వస్తువుల లేదా సేవలను వినియోగించుకునేవారు సైతం వినియోగదారులే. దీని ప్రకారం మనమందరం ఏదో ఒకరకంగా వినియోగదారులమే.

  • ఫిర్యాదు ఎవరు చేయాలి?

వినియోగదారుడు, వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ, కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం, అనేక మంది వినియోగదారుల పక్షాన ఒకరుగానీ లేదా కొందరు గానీ ఫిర్యాదు చేయవచ్చు.

  • చట్టరీత్యా రక్షణ ఎప్పుడు పొందాలి?

అమ్మకందారుడు అక్రమ వ్యాపారం చేస్తున్న సందర్భాలోనూ, నిర్భంద వ్యాపారాన్ని కొనసాగిస్తున్నపుడు, తాను కొనుగోలు చేసిన వస్తువులోగానీ, కొనుగోలు చేస్తున్న వస్తువులో గానీ లోపాలు గమనించినప్పుడు, తాను అద్దెకు తీసుకున్న లేదా ఖరీదు చేసిన సేవల విషయంలో లోపాలు గమనించిన సందర్భంలో, తాను కొనుగోలు చేస్తున్న వస్తువులకు నిర్ణయించిన ధరకంటే ఎక్కువ ధరను వ్యాపారి వసూలు చేసిన సందర్భంలోనూ, లేబుల్‌ మీద ప్రచరించిన ధరకంటే ఎక్కువ ధర వసూలు చేసినప్పుడు, ప్రాణాలకు హానీ చేసే, భద్రతలకు ముప్పు తెచ్చే వస్తువుల్ని వ్యాపారస్తుడు విక్రయుంచే సందర్భాల్లోనూ పొందవచ్చు.

  • ఎంఆర్‌పీ చూసిన తర్వాతే చెల్లింపులు

కూల్‌డ్రింక్స్‌ 250 ఎంఎల్‌ బాటిల్‌పై ఎంఆర్‌పీ ధర రూ.10 ఉంటే దానిని రూ.20లకు విక్రయించినా నోరు మెదపకుండా తీసుకుని తాగుతున్నారే తప్ప ఎవరికీ ఫిర్యాదు చేయలేని పరిస్థితి. సినిమా థియేటర్‌కు వెళితే రూ.10కి వచ్చే తినుబండారాలు రూ.30లకు విక్రయించినా ఎవరూ ప్రశ్నించరు. ఇలా ప్రతీ చోట వినియోగదారుడు మోసపోతున్నా ఎవరికి చెప్పాలో తెలియక కొందరైతే మనకెందుకులే అంటూ రాజీపడుతూ మోసానికి గురవుతున్నారు. గుడ్డిగా ఏ వస్తువును కొనవద్దు. ముందుగా కొనదలిచిన వస్తువు గురించి పూర్తి సమాచారం సేకరించాలి.

ఒకే తెగకు చెందిన రెండు ప్యాకేజీలలో దేనిలో నెట్‌కంటెంట్స్‌ ఎక్కువగా ఉన్నాయో చూసి కొనాలి. కాస్మోటిక్‌ ఉత్పత్తులపై తప్పనిసరిగా వస్తువు ధర, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ, తయారీదారుని చిరునామా, వస్తువు బరువు ముద్రించాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్‌పీపై మరో స్టిక్కర్‌ అంటించి దాని ధర మార్చి అమ్మడం నేరం. మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్త వహించాలి. వస్తువు నాణ్యతపై రాజీ పడవద్దు.

  • ఇలా ఫిర్యాదు చేయండి…

ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు నాణ్యత లేదనో, ధర ఎక్కువగా తీసుకున్నారనో, ముగింపు తేదీ గడిచిందనో, తూకంలో తేడా ఉందనో నిర్ధారణకు వచ్చినప్పుడు జిల్లా కేంద్రంలో ఉండే వినియోగదారుల ఫోరంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. తెల్లకాగితంపై వివరాలు రాసి ఫిర్యాదు చేయవచ్చు. న్యాయవాది అవసరం కూడా లేదు. ఫిర్యాదుదారుడైనా లేదా అతని ఏజెంట్‌ ఫోరంలో నేరుగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. లేదా పోస్టు ద్వారా కూడా పంపుకునే అవకాశం ఉంది. వినియోగదారుడి ఫిర్యాదుపై త్వరగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

తూకంలో మోసాలపై స్థానికంగా ఉన్న తూనికలు, కొలతల శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. వారు చర్యలు తీసుకోకపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. ఫిర్యాదుపత్రంలో ఫిర్యాదుదారుని పూర్తి పేరు, చిరునామా తప్పనిసరిగా ఫిర్యాదులో పేర్కొనాలి. అవతలి పార్టీపూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గల కారణాలు ఎప్పుడు ఏ విధంగా మోసం లేదా నష్టం జరిగిందో పేర్కొనాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, రశీదు, ఇతర వివరాలు జత చేయాలి.

మనం కొనే వస్తువు లేదా సేవల విలువ రూ.20లక్షల వరకు ఉంటే జిల్లా ఫోరంలో, రూ.20లక్షలకు మించి రూ.1కోటి వరకు ఉంటే రాష్ట్ర కమిషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన, నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్లలోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణాలు చూపితే రెండేళ్లు దాటిన తరువాత ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉంది. వస్తువు లేదా సేవ విలువ, కోరే నష్టపరిహారం లక్ష రూపాయల లోపు ఉంటే కోర్టు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1 లక్ష నుంచి రూ.5లక్షల వరకు రూ.230లు వసూలు చేస్తారు. రూ.10లక్షల వరకు రూ.400లు, ఆపైన రూ.500ల కోర్టుకు చెల్లించాల్సి ఉంటుంది.

  • 5 హక్కులు.. వినియోగ దారులకు ‘పంచ’ప్రాణాలు

1. భద్రత హక్కు: వినియోగదారుడు కొనే వస్తువులు, పొందే సేవలు తక్షణ అవసరాలు తీర్చేవిగానే కాకుండా దీర్ఘకాలం మన్నికలా ఉండాలి. అవి వినియోగదారులు ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ఈ భద్రత పొందడానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలి. వీలైనంతవరకు ఐఎ్‌సఐ, ఆగ్‌మార్క్స్‌, హాలోగ్రామ్‌ వంటి నాణ్యతా చిహ్నాలు గల వస్తువులు కొనుగోలు చేయాలి.

2. సమాచారం పొందే హక్కు: వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవలు నాణ్యతా ప్రమాణాలు, ధరల గురించి సంపూర్ణ సమాచారం పొందవచ్చు.

3. వస్తువుల ఎంపిక హక్కు: అనేక రకాల వస్తువులను, సేవలను తగిన సరసమైన ధరలలో పొందడం వినియోగదారుల హక్కు

4. అభిప్రాయం వినిపించే హక్కు: వినియోగదారుల వేదికలపై తమఅభిప్రాయాలు వినిపించవచ్చు. ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసే పలు సంఘాలలో ప్రాతినిథ్యం పొందగల రాజకీయేతర, వాణిజ్యేతర వినియోగదారుల సంఘాలను ఏర్పరుచుకోవడం కూడా ప్రాథమిక హక్కు.

5. న్యాయపోరాటం: అన్యాయమైన వాణిజ్యవిధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్దమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు. వినియోగదారులకు హక్కులతోపాటు బాధ్యతలూ ఉన్నాయి.

వినియోగదారులు తమకు జరిగిన నష్టంపై వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేసేందుకు, సలహాలు పొందేందుకు ఫోన్ చేయాల్సిన నంబర్లు ఇవీ..
1967, 18004250003

  • బిల్లు తప్పనిసరిగా తీసుకోండి

కొనుగోలు చేసే సమయంలో సరైన రశీదును అడిగి తీసుకోవాలి. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారెంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫోరంలో సమర్పించడానికి ఉపయోగపడతాయి. నాసిరకం వస్తువులను విక్రయించిన వారిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడానికి వెనుకాడొద్దు.