దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వ్యవహారం క్రమంగా రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకొంటోంది. ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధానంగా వివాదం రోజుకోమలుపు తిరుగుతోంది. బీజేపీ, జనసేన పార్టీల వంటివి కూడా ఆలయాలపై దాడి ఘటనలకు నిరసనగా ఉద్యమిస్తున్నప్పటికీ టీడీపీ మాత్రం వైసీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కోణంలో దాడికి దిగింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వరసపెట్టి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనపై రేగిన దుమారం తరహాలోనే ఇప్పుడు రామతీర్థం ఘటనకూ రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుండడాన్ని దిగమింగుకోలేకపోతున్న టీడీపీ నాయకులు కావాలనే హిందూ ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్న కొత్త వాదనను వైసీపీ తెరపైకి తెచ్చింది.

అయితే, ఆ ప్రచారాన్ని సమర్ధమంతంగానే ఎదుర్కొనేందుకు విపక్ష టీడీపీ కూడా ఎదురుదాడికి సిద్ధమైంది. ఆరోజు రామతీర్థంలో తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారని రెండు రోజుల ముందే ప్రకటించినా అదే రోజు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి రామతీర్థంలో పర్యటించడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నను టీడీపీ నేతలు మీడియా ముఖంగా తెరమీదకు తెచ్చారు. పైగా విజయసాయి పర్యటనలో మందీమార్బాలంతో హంగామా చేశారని, అంగబలం, అర్థబలం చూపించేందుకు తహతహలాడారనీ, తమ పవర్‌తో మొదట కొండపైకి ఎక్కి, దిగిన తర్వాత పెద్ద రచ్చే జరిగిందంటున్నారు తెలుగుదేశం నాయకులు.

వ్యూహం వికటించి, సాయిరెడ్డికి ఊహించని షాక్‌ తగిలిందని, ప్రతిపక్షనేత చంద్రబాబు కొండపైకి ఎక్కినా గుడిలోకి వెళ్లకుండా తాళాలు వేయించారని, అప్పటివరకు కూల్‌గా ఉన్న వాతావరణం విజయసాయి ఎంట్రీతో రాజకీయ రణరంగాన్ని తలపించిందనీ ఆరోపిస్తున్నారు. ఇంతకీ విజయసాయి పర్యటన వైసీపీకి కలిసిరాకపోగా, విజయనగరం జిల్లాలో ఆ పార్టీకి కొంత మేరకు వ్యతిరేకత మూటగట్టిందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన నిరసనలు, దాడులు ఏ పార్టీకి ప్లస్‌ అయ్యాయి? ఏ పార్టీకి మైనస్‌ అయాయన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎంపీ విజయ్‌సాయి రెడ్డి ఎంట్రీతో వైసీపీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యిందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయట. జనవరి 28న రామతీర్థంలో గుర్తుతెలియని దుండగలు రాముడి విగ్రహ శిరస్సును ఖండించారు. ఆ శిరస్సును ఎదురుగా ఉన్న కోనేరులో పడేశారు. ఈ విషయం పూజారి ద్వారా బయటకు పొక్కడంతో పెద్ద దుమారమే రేగింది. మరుసటి రోజు విజయనగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. అప్పటికే ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, రామతీర్థం ఘటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు, హిందూత్వ సంస్థలు అక్కడికి చేరుకుని ఆందోళనలు ప్రారంభించాయి. నిందితులను శిక్షించాలంటూ నిరహార దీక్షలు చేపట్టి నిరసన తెలిపారు. అయితే, చంద్రబాబు రామతీర్థం పర్యటన ఈ నెల 2న ఖరారైంది. కానీ ఒకటవ తేదీన విజయసాయిరెడ్డి ఇదంతా చంద్రబాబు ఆయన కుమారుడు టీడీపీ నేతలతో చేయించారంటూ ఆరోపించడంతో రగులుతున్న వివాదానికి ఆజ్యం పోసినట్లయింది.

చంద్రబాబు రామతీర్దం వెళ్తున్న సమయానికే విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం పర్యటనకు బయల్దేరారు. అప్పటికే బీజేపీ నేతలు, హిందూత్వ సంస్ధలు అక్కడ దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు వస్తున్నారన్న విషయం తెలిసి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇదే సమయానికి విజయసాయిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకోవడంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు కొండపైకి వెళ్లారు. అయితే తిరిగి కిందకు వచ్చిన విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలపై వాటర్ ప్యాకెట్లు, చెప్పులు విసిరారు. వారి కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు.

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు పోలీసులే విజయనగరంలో లారీలు అడ్డుపెట్టి ఆటంకాలు కలిగించారు. రామతీర్దంలో పోటాపోటి నినాదాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి పోలీసులు చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన సమయంలో విజయసాయిరెడ్డికి ఎలా అనుమతి ఇచ్చారన్న దానిపై దుమారం రేగింది. అలాగే కొండపైన రాముని దేవాలయంలోకి చంద్రబాబు లోపలికి వెళ్లకుండా బయట నుంచి తాళాలు వేశారు. కానీ విజయసాయిరెడ్డి వెళ్లినప్పుడు మాత్రం ఆ తాళాలు తెరిచారు. రామతీర్థానికి విజయసాయిరెడ్డి సడన్ టూర్‌తో అది రచ్చగా మారి చివరకు టీడీపీకే కలిసి వచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో ఇటు టీడీపీని అటు వైసీపీ శ్రేణులను అడిగినా ఇదే ఆన్సర్‌ ఇస్తున్నారట. అస్సలు ఆ సమయంలో విజయసాయిరెడ్డి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

టీడీపీ, బీజేపీ, హిందూత్వ సంస్థల ప్రతినిధుల ప్రతిఘటన సెగ విజయసాయిరెడ్డికి గట్టిగానే తగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన మాటలు, చేతలతో ఎదుటి వారిని ఇరకాటంలో పడేసే విజయసాయిరెడ్డికి మొదటిసారి క్షేత్రస్థాయిలో తనపై ఎంత వ్యతిరేకత ఉందో నేరుగా చూశారట. ఎప్పుడు లేనిది, విజయసాయిరెడ్డి ముఖంలో ఒకింత టెన్షన్ కూడా కనిపించిందంటున్నారు. వైసీపీ నాయకులపై వాటర్ ప్యాకెట్లు విసిరింది ఎవరన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు, సొంత పార్టీ నాయకులే విజయసాయిరెడ్డిపై ఇలా కసి తీర్చుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా రామతీర్థం పర్యటన ఎపిసోడ్‌ టీడీపీకే ప్లస్‌ అయ్యిందనే టాక్‌ జిల్లాలో జోరుగా సాగుతోందట. అంతేకాదు చంద్రబాబు మాటల్లో జోష్ కనిపించిందని, ఆ పార్టీ నేతలంటున్నారు.

విజయసాయిరెడ్డి ఫుణ్యమా అని, వైసీపీకి కలిసిరాకపోగా ఆ పార్టీ వారే ఇరకాటంలో పడ్డారని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో మాన్సాస్‌ ట్రస్ట్ చైర్మన్‌ పదవి నుంచి పూసపాటి ఆశోక్‌గజపతి రాజును తొలగించడం, ఆయనపై విమర్శలు చేయడం, తదనంతర పరిణామాలు కూడా ఫ్యాన్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న చర్చ జరుగుతోంది. మరోవైపు, బీజేపీ హిందూత్వ సంస్థలతో కలిసి రామతీర్థం ఘటనపై పోరాటాన్ని కొనసాగిస్తోంది. మొత్తానికి రాముడి చుట్టూ రాజకీయం తిరుగుతోందనే చెప్పాలి.