‘ఇంటింట సర్వే తప్పని సరి’

43

ఒంగోలు, మే 21 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా ఇంటింట సర్వే తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కమిషనర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి గురువారం ఆయన జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాధికారి డాక్టర్ అప్పలనాయుడు, స్పెషల్ కలెక్టర్ గంగాధర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డి.సి.హెచ్.యస్. డాక్టర్ ఉష, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాధికారులు డాక్టర్ కె. పద్మావతి, డాక్టర్ యం. మీనాక్షి మహదేవన్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల వారీగా కమిషనర్ సమీక్షిస్తూ 5వ విడత ఇంటింటి సర్వే తప్పని సరిగా గ్రామ, పట్టణాల్లోని అన్ని ప్రాంతాలలో పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి 60 సవత్యరాలపైబడిన వారిని గుర్తించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారి తప్పని సరిగా ఐ.యం.ఎస్. ( ఇన్‌సిడెంట్ మేనేజిమెంట్ సిస్టం)ను ఫాలో అప్ చెయ్యాలని చెప్పారు. ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శతశాతం పూర్తిచేసి బ్లాక్ లాగ్ లక్ష్యాలను సాధించాలని తెలిపారు. ప్రాణాంతక వ్యాధుల వ్యాక్సిన్స్ 108 సర్వీసెస్‌లలో కూడా అందించాలని, మాతాశిశు ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

కరోనా కంటైన్‌మెంట్ జోన్లలో ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు చేసి జోన్‌లో ఉండే ప్రజలకు సేవలందించాలని సూచించారు. యాప్‌లో అప్లోడ్ చేసే డేటా మొత్తం వైద్యాధికారి ఫాలో అప్ చేయాలని, గర్భిణీ స్త్రీలకు, 5 సంవత్సరాల లోపు పిల్లలకు టీకాలు అందించాలన్నారు.