ఆంగ్లమాధ్యమం అమలుకు ఆక్షేపణలెందుకో?

106
కుమార్ యాదవ్

వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం గ్రామీణ పేద పిల్లలకందరికీ వరమనే చెప్పాలి. కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ప్రవేటు, కార్పొరేటు బడుల్లో పూర్తి ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతున్నా పట్టించుకోని వారు ప్రభుత్వ బడులకు మాత్రం అడ్డుచెప్పి రభస చేయడం తగదు. తెలుగుభాషా పరిరక్షణ కేవలం ప్రభుత్వబడులలో చదివే పేదపిల్లలే చేయాలా? అదే కార్పొరేట్ పాఠశాలలోనూ తెలుగు అమలుకు ఎందుకు డిమాండ్ చేయలేదు?

ఇందులో కార్పొరేట్, రాజకీయ చర్చలకన్నా, మేథోపర చర్చలు జరిగి, పేదపిల్లలకు కార్పొరేటుకన్నా మెరుగైన విద్య అందించేలా ఉన్నతమైన సలహాలూ, సూచనలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిలకు అనుగుణంగా విద్యావిధానం అమలు జరగకపోవడం వల్ల విద్యలో పేద, ధనిక అంతరం పెరిగిపోయింది. అంతేగాకుండా కార్పొరేట్ బడుల వ్యాపారధోరణితో, అధిక ఫీజులు వసూలు చేయడంతో పేదకుటుంబాలు ఆర్థికంగా నిర్వీర్యమౌతున్నాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట పడాలంటే పేదల బడుల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయడమే సముచితం.

అలాగే ఈ విధానానికి అధికశాతం ప్రజలు మద్దతునిస్తున్నారని, ప్రభుత్వం సత్వరం తగు చర్యలకు సమాయత్తం కావాల్సి ఉంది. అదే సందర్భంలో తెలుగును పరిరక్షించేందుకూ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తున్నారు కాబట్టి సమస్యేమీ లేదు. అయితే, ఆంగ్లమాధ్యమం ప్రణాళికా బద్దంగా, పటిష్టంగా అమలు చేయడానికి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి తగ్గట్టు ఉపాధ్యాయ నియామకం జరగాలి. డీఎస్సీ ద్వారా ఆంగ్లభాషపై ప్రావీణ్యం గలవారిని ప్రత్యేకంగా ఎంపిక చేసి నియమించాలి.

గ్రామీణ ప్రాంత పిల్లల నేటి స్థాయికి తగ్గట్టు పాఠ్య పుస్తకాలు, బోధనాంశాల కూర్పు ఉండాలి. పాఠ్యాంశాలవారీగా బోధనాభ్యసన సామాగ్రి, వనరులు సమకూర్చబడాలని, అలాంటపుడే ఆంగ్ల మాధ్యమ బోధన సత్ఫలితాలనిస్తుందీ, పేదలకు ప్రయోజనకారిగా ఉంటుంది.

(రచయిత: బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు)