ప్రస్తుతం అమలులో ఉన్న పాత పద్దతిలో పరీక్షలు రాస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్ధులు

ఇంటర్‌మీడియట్ విద్య నియంత్రణ వ్యవస్థ విఫలం

అధికారుల ఉదాసీనతో కార్పొరేట్లకు కాసుల వర్షం…

ఆన్‌లైన్ బోధనలో సైన్సు ప్రయోగాలు ఎలా సాధ్యం?

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

మాజాభివృద్ధిలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుంది. అందులో ఇంటర్ విద్య పాత్ర ఎంతో ముఖ్యం. ప్రభుత్వం రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో అడ్మిషన్లు పొందాలంటే ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల్లో సీట్ల భర్తీని ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ ద్వారా కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది చూడాలి. పదో తరగతి తరువాత ఉన్నత విద్యకు వెళ్లాలంటే ఇంటర్ విద్యే కీలకం. ఈ సమయంలో ఇప్పటివరకు
ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి దశాబ్ద కాలంగా అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆన్‌లైన్ సాంకేతిక పరిజ్ఞానంతో కరోనా నేపథ్యంలో సైతం కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లు పేరుతో, కోచింగ్ పేరుతో దోపిడీ కొనసాగిస్తూనే వున్నాయి.

ఒక పక్క కోవిడ్ ఆరోగ్య సంక్షోభం కొనసాగుతున్నా ఇంటర్ విద్యలో అభ్యసనలో, బోధనా పద్ధతిలో సమూల మార్పులు రాబోతున్నాయని గుర్తించడంలో ప్రభుత్వం దానికి తగినట్లు ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించి సరైన దశ నిర్దేశం జరగాల్సిన అవసరం వుంది. ఇంటర్ విద్య మీద నియంత్రించాల్సిన ఇంటర్ బోర్డు నిద్రావస్థలో ఇప్పటివరకు కొనసాగింది. ఈ రోజు కరోనా నేపథ్యంలో సైతం ఆన్‌లైన్‌లో ఫీజుల ఒత్తిడి, ఆన్‌లైన్‌లోనే బోధన మీద కంట్రోల్ చేయడం లేదు. ప్రభుత్వం జూనియర్ కాలేజీల వ్యవస్థ రాష్ట్రంలో అంతంతమాత్రంగా వుంది. ప్రైవేటు కార్పొరేట్, ఇంటర్ విద్యా వ్యవస్థ ఎవరికి వారే యమునా తీరేలా విద్య పేరుతో సొమ్ములు చేసుకునేందుకు వెనుకాడడం లేదు. ఇంటర్ బోర్డు నిబంధనలు స్పష్టంగా వున్నప్పటికీ ఇప్పటివరకు ప్రైవేటు విద్యా సంస్థలు వాటిని కంట్రోల్ చేయకపోగా విచ్చలవిడిగా అడ్మిషన్లు జరిపాయి.

ఇంటర్ వద్య తరువాత ఇంజనీరింగ్, మెడిసన్, కామర్స్ లాంటి కీలక ఉన్నత విద్యకు వెళ్లడానికి ఇంటర్ విద్య మార్కులే ముఖ్యం. ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకోవడంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటివరకు సఫలీకృతం అయ్యాయి. ప్రైవేటు విద్యా సంస్థలు అధ్యాపకులను తొలగిస్తున్నారు. జీతాల్లో భారీ కోత విధిస్తున్నారు. ఇప్పటివరకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల జీతాలు పొందిన ఇంటర్ అధ్యాపక బృందం వారి సబ్జెక్టు మేరకు నేరుగా ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

ఇప్పటివరకు కార్పొరేట్ విద్యా సంస్థలు ఐఐటీ, ఎస్ఈటీ, ఇతర పోటీ పరీక్షలను ఎరగా చూపి లక్ష నుంచి 2 లక్షలకు పైగా ఫీజులు వసూలు చేశారు. హాస్టల్ ఇంటర్ విద్యార్థుల నుంచి 3 లక్షలకు పైగా వసూలు చేసిన సంఘటనలున్నాయి. హాస్టళ్లలో లక్షలు తీసుకున్నా భోజనం నాణ్యత అంతంతమాత్రమే వుంటోంది. అక్కడే కార్పొరేట్ హాస్టల్ ప్రాంగణంలో ప్రైవేటు క్యాంటీన్లో పిజ్జాలు, బర్గర్లు ఇతర స్నాక్‌లను అధిక ధరలతో విద్యార్థులను మరింత దోచుకోవడం పరిపాటిగా మారింది. ఇంటర్ విద్య ఉజ్వల భవిష్యత్‌కు ఓ కీలక మెట్టులాంటిది. ఈ సమయంలో నూతన ఆవిష్కరణలకు వేదిక కావాలి. ఫీజుల వసూలే లక్ష్యం కాకుండా ఉన్నత విద్యా ప్రమాణాలతో తరగతులు నిర్వహించాలంటే ప్రభుత్వ పర్యవేక్షణ తప్పనిసరి.

ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల పేరుతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విధానం యధేచ్చగా జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంది. ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వ సొమ్ముతోనే అభివృద్ధి చెందుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ స్కాలర్‌షిప్ డబ్బులు కార్పొరేట్ విద్యకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. మరోపక్క బడ్జెట్ కేటాయింపులు ఏడాది ఏడాదికి తగ్గిపోతున్నాయి. వెచ్చించిన నిధులు విద్య, జీతాలకు, స్కాలర్‌షిన్లకు పరిమితమవుతున్నాయి. ఆన్‌లైన్‌ నెపంతో అడ్డగోడులుగా ఫీజులు వసూలు ఆన్‌లైన్‌లో ఇంటర్ విద్య శిక్షణను కట్టడి చేయడంలో ప్రభుత్వం వెనుకబడే వుంది.

ఇంటర్ విద్యలో ఎంత ఆన్‌లైన్‌ శిక్షణ ఇచ్చినప్పటికీ నేరుగా ప్రత్యక్ష శిక్షణ, అనుమానాల నివృత్తి పరీక్షలు ఇలా విద్యార్థికి, లెక్చరర్లకు మధ్య ప్రత్యేక శ్రద్ధ, అవగాహనతో మరింత నైపుణ్యం పెంచే అవకాశముంటుంది. ఇప్పటికే విద్యార్థుల నుంచి మూడు నెలల ఫీజు అడ్వాన్స్‌గా ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజు వసూళ్లకు ఒత్తిల్లు చేస్తున్నాయి. వారానికి మూడు రోజులే శిక్షణ ఇస్తోంది. మూడు నెలల్లో విద్యార్థి తదుపరి ఫీజు చెల్లించకపోతే వెయిటింగ్ లిస్టులో వున్న మరొకరికి అన్‌లైన్ శిక్షణలో అవకాశం ఇస్తుంది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు నారాయణ, చైతన్య, అకాశ్, అవినాష్, దిశ, ఎస్ఆర్ఎ, శ్రీ గాయత్రి, అనేక విద్యా సంస్థలు మనుగడ కోసం ఎవరికి వారు అన్ని ప్రయత్నాలను చేస్తున్నాయి. ఫీజులు కట్టడంలో కొంత సానుకూలమైన వాతావరణం లేకపోయినప్పటికీ ఇంటర్ విద్యలో ఏం జరగబోతోందో అర్ధం కాలేని పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే ప్రభుత్వం 30 శాతం సిలబస్ తగ్గించాలన్న ఆదేశాల్లో కసరత్తు ప్రారంభమైంది. ఇంటర్ విద్యలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కరోనా ముందు కరోనా తరువాత రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల కష్టాలు, వ్యతిరేకత ఎలా వుంటుందో చూడాలి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో వేలాదిమంది విద్యార్థులు చేరినప్పటికీ అందులో సక్సెస్ ఉత్తీర్ణత శాతం 3 నుంచి 5 శాతం మాత్రమే. 90 శాతం పిల్లల నుంచి ముక్కు పిండి లక్షల రూపాయలు వసూలు చేయడమే రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల మాయాజాలం. ర్యాంకులు వచ్చిన పిల్లలు వారికి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితమైన అడ్మిషన్లు ఇస్తారు. వారు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవకపోయినా ర్యాంకులు సాధించే సత్తా ఉన్న పిల్లలు, కానీ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ముందు చూపుతో ర్యాంకులు కొట్టే విద్యార్థులను హైస్కూల్ దశ నుంచే గుర్తించి వారికి ఉచిత బోధనా, వసతి అవసరమైతే తిరిగి డబ్బులు కూడా చెల్లించేలా ఇప్పటివరకు సాగించారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ విద్యార్థులేనని భారీ ప్రకటనలు ఇచ్చి వేల సంఖ్యలో అడ్మిషన్లు పొందడం జరుగుతోంది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో వెయ్యి మంది అధ్యాపకులుంటే అందులో పది శాతం కూడా నైపుణ్యం, మెలకువలు, అనుభవం వున్న వారుండరు.

90 శాతం జూనియర్ లెక్చరర్లుగా, పార్ట్ టైం టీచర్లతో బోధన సాగిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు సైతం విద్యే తమకు జీవితమని గవర్నమెంట్ ఇంటర్ విద్యలో సీట్లు దొరక్క కాలేజీలు అందుబాటులో లేక ఉన్న చదువులు అంతంతమాత్రమేనని రోజు కూలీ చేసుకునే వారు సైతం కార్పొరేట్ విద్యకే మొగ్గు చూపడం పరిపాటిగా మారింది. కార్పొరేట్ విద్యా సంస్థలు తమ సంస్థల్లో 1, 2 శాతం అధ్యాపకులకు ఏడాదికి 20 నుంచి 35 లక్షల వరకు జీతాలు చెల్లిస్తుంది. మిగిలిన వారికి ఏడాదికి 2 లక్షల లోపే జీతాలుండడం గమనార్హం. ప్రభుత్వం ఇంటర్ విద్యను ఇప్పటివరకు గాలికొదిలేసింది.

కార్పొరేట్ విద్యా సంస్థలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే తరహాలో భారీ భవంతులు, అద్దెలకు తీసుకోవడం, భారీ ప్రకటనలు ఇవ్వడం, అడ్మిషన్లకు సైతం అధ్యాపకులకు కోతలు పెట్టడం పరిపాటిగా మారింది. కరోనా నేపథ్యంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఓ పక్క ఆన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను ఆకర్షిస్తూనే మరోపక్క భారీ అద్దె భవనాలను చిన్న చిన్న భవనాల్లోకి బదిలీ అవుతున్నారు. ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే జీతాల్లో భారీ కోత విధించారు. 50 శాతానికి పైగా ఉపాధ్యాయులను తొలగించారు. కరోనా ఇలాగే కొనసాగితే ఆరోగ్య సంక్షోభంతో విద్యా రంగంలో సమూల మార్పులు బోధనలో తీసుకురావాల్సి వుంది. దీనికి తగ్గట్టు విద్యార్థి ఆరోగ్య, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం లేకుండా ఒత్తిడి రాకుండా చూడాల్సి వుంది.

డిజిటల్ టెక్నాలజీ, ఆన్‌లైన్ క్లాసులకు ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ ఇంటర్ విద్యా సంస్థలు కూడా సిద్ధం కావాల్సి వుంది. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ విద్యలో నూతన ప్రక్రియకు మరింత సమన్వయం అవసరం. ఆన్‌లైన్‌లో శిక్షణే తప్పదంటే ఇంటర్ విద్యలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాబుల్లో ప్రత్యక్ష ప్రయోగాలు పెద్ద సమస్యగా పరిణమించబోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో సైతం ప్రయోగశాలలు నామమాత్రంగానే వుంటాయి.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఇంటర్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం విఫలమైంది. ఇది ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు వరంగా మారింది. కనీసం కరోనా ప్రభావంతోనైనా కార్పొరేట్ గుత్యధిపత్యానికి ప్రభుత్వ ఇంటర్ విద్యా వ్యవస్థ ప్రత్యామ్నాయం కావాల్సి వుంది. ప్రభుత్వ రంగంలో ఇంటర్ విద్య ఏర్పాట్లు చేయకుండా కార్పొరేట్ విద్యకు కట్టడి ఎలా చేస్తారో వేచి చూడాలి. ప్రైవేటు విద్యా సంస్థలు కేవలం ఐదు శాతం లాభాపేక్షతో పని చేయాలని ప్రభుత్వం నిబంధనలున్నాయి.

15 శాతం నిర్వహణ, మరో 15 శాతం నిర్మాణ తదితర ఖర్చులు 50 శాతం నిధులు ఉపాధ్యాయ, సిబ్బంది జీత భత్యాలు, మరో 15 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది గ్రాడ్యుటీ, పీఎఫ్, బీమా ఇతర ఖర్చులకు కేటాయింపులు ఉండాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. నిబంధనలకు తూట్లు కళాశాలలు 90 శాతం నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఉల్లంఘించిన కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల మీద చర్యలు శూన్యం. నియంత్రణా వ్యవస్థ నిద్రావస్థలో ముడుపులకు అలవాటుపడి ఉదాసీనతే ప్రజలు వేల కోట్ల రూపాయలు ఏటా రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ ఇంటర్ విద్యకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలను, వారి లక్షల ఫీజులను నియంత్రించి కట్టడి చేయాల్సిన ఇంటర్ బోర్డు ఉత్సవ విగ్రహంలా తయారైంది. విద్యా వ్యవస్థలో ప్రజా ప్రతినిధులుగా రాజకీయ పలుకుబడి కలిగిన వారు ఒత్తిళ్లకు ఇంటర్ బోర్డు కదలలేక కార్పొరేట్ దోపిడీ ఇష్టారాజ్యంగా మారింది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థకు వంద మందికి అనుమతి వుంటే వెయ్యి మందికి అడ్మిషన్లు ఇచ్చి లక్షలు దోచుకుంటున్న వైనం కొనసాగుతుంది. ఇంటర్ విద్యా అవసరాన్ని సొమ్ము చేసుకునే స్థితిలో ప్రభుత్వం ముందు చూపు కొరవడింది. మొదటి ర్యాంకు అని, అత్యధిక ర్యాంకులు అని ప్రకటనలు ఇవ్వడంతో బడుగు, బలహీన వర్గాలు కూడా పలానా కార్పొరేట్ కళాశాలలో విద్యార్థిని ఇంటర్ విద్యలో చేర్చడం స్టేటస్ సింబల్‌గా పెద్ద బ్రాండ్ ఇమేజ్‌గా ప్రైవేటు విద్యకే మొగ్గు చూపే స్థితి ఏర్పడింది. ఇంటర్ విద్యా వ్యాపారానికి కనీసం కరోనాతో అయినా ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. పదో తరగతి తరువాత ఉన్నత విద్యకు వెళ్లడానికి ఇంటర్ విద్యే కీలకం. రాష్ట్రంలో గడిచిన దశాబ్ద కాలంలో ప్రతి ఏటా లక్ష మంది విద్యార్థులు ఇంటర్ విద్య కోసం పెరుగుతున్నారు. 2018-19లో ఆరు లక్షల 19 వేల విద్యార్థులుండగా 2019-20 నాటికి ఆరు లక్షల 30 వేలు విద్యార్థులున్నారు. వీరిలో ఎక్కువ శాతం ఇంటర్ విద్యకే మొగ్గు చూపుతారు. రాష్ట్రంలో దాదాపు 2019 ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 వేల 230 జూనియర్ కాలేజీలున్నాయి.

ప్రత్యేక మహిళా కాలేజీలు 227 కలిపి మొత్తంగా 3 వేల 457 ఇంటర్ జూనియర్ కళాశాలలున్నాయి. దాదాపు ఈ కాలేజీలో 4 లక్షల 75 వేల 419 మంది చదువుకునే అవకాశముంది. వీరికి 29 వేల 654 మంది అధ్యాపకులుగా వున్నారు. ప్రభుత్వ రంగంలో ఇంటర్ విద్య 20 శాతం కూడా లేదు. ఇంటర్ విద్యలో అగ్రభాగం పశ్చిమగోదావరి జిల్లాలో 344 కాలేజీలుండగా ఇంటర్ విద్యలో అతి తక్కువ విజయనగరం జిల్లాలో 184 కాలేజీలు మాత్రమే వున్నాయి. విద్యార్థులు అత్యధికంగా కృష్ణా జిల్లాలో 60 వేల 786 మంది వున్నారు.

అతి తక్కువగా కడప జిల్లాలో 20 వేల 868 మంది వున్నారు. జూనియర్ ఇంటర్ అధ్యాపక బృందంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 3, 180 మంది ఉండగా అందులో సగం కూడా లేకుండా అతి తక్కువ విజయనగరం జిల్లాలో ఇంటర్ విద్యలో 1497 మంది ఉపాధ్యాయులు మాత్రమే వున్నారు. ఇంటర్ విద్య తరువాత డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్, లా, ఆర్ట్స్ ఇలా అనేక రంగాలకు తొలి మెట్టు. ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 1971లో ప్రారంభమైంది. ప్రైమరీ, సెకండరీ క్లాస్ జనరల్, ఒకేషనల్, మ్యాథ్, సైన్స్, హ్యుమానిటిస్, కామర్స్ దాదాపు 65 రకాల సబ్జెక్టులతో ఇంటర్ విద్య అందుబాటులో వుంది.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యలో ల్యాబులు 25 శాతం మించి కూడా లేదు. కార్పొరేట్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట ప్రయత్నాలు ఏమాత్రం ఫలితాలు ఇవ్వలేదు. పదో తరగతి తరువాత ఇంత పెద్ద ఎత్తున ఇంటర్లో లక్షల మంది చేరబోతుంటే ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వుంది. 2020-21 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఎంసెట్ తరహాలో అందుబాటులో వున్న గ్రామ సచివాలయాల్లో గానీ, నేరుగా ఆన్‌లైన్‌లో గానీ నమోదు చేసుకోవాలి. ఐదు ఎంపికలతో విద్యార్థులకు వారికి నచ్చిన కోర్సులను, కాలేజీలను అనుమతిస్తారు.

ఇంటర్ ఆన్‌లైన్‌ అడ్మిషన్లు మూడు రౌండ్‌లో కౌన్సెలింగ్ ద్వారా అన్‌లైన్‌లో ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కేటాయించిన విద్యార్థులకే శిక్షణ ఇస్తామని చెప్పి ప్రత్యేక ట్యూషన్ ఉన్నత మార్కులు రావాలంటే ఆన్‌లైన్‌ శిక్షణ పేరుతో లక్షల ఫీజుకు అలవాటుపడిన కార్పొరేట్ ఇంటర్ విద్యా వ్యవస్థ ప్రత్యామ్నాయ మార్గాలలో నిమగ్నమైంది.

ఆచార్య జీఎస్ఎన్ రాజు

‘‘ఇంటర్ విద్యలో అనారోగ్యకరమైన పోటీ తగదు ఇంటర్ విద్యలో ఆరోగ్యకరమైన పోటీ వుండాలి. కానీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అభ్యాసం జరుగుతున్న నేపథ్యంలో అనారోగ్యకరమైన పోటీ నెలకొంది. ఈ పరిస్థితిని ప్రభుత్వాలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల దూకుడును నియంత్రించడంలో ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్ విద్యలో తదుపరి ఉన్నత విద్యకు దోహదపడే విధంగా వృత్తి నైపుణ్య కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ కళాశాలలు తగినంతగా లేకపోవడం వల్ల ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల పెత్తనం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యలో దుష్పరిణామాలకు తావు లేకుండా ప్రైవేటు కళాశాలలకు అనుమతిచ్చినప్పుడే తగిన జాగ్రత్తలు వహించాలి.’’ అని సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య జీఎస్ఎన్ రాజు అభిప్రాయపడ్డారు.

ఆచార్య బాలమోహన్ దాస్

‘‘కార్పొరేట్ సంస్థలపై పర్యవేక్షణ అవసరం ఇంటర్ విద్యను పూర్తిగా ప్రభుత్వం నిర్వహించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగానికి అనుమతినిస్తూ సరైన విద్య గాడి తప్పకుండా తగిన జాగ్రత్తలు వహించాలి. కార్పొరేట్ విద్యా సంస్థల తప్పుడు పోకడలకు అడ్డుకట్ట వేయడంలో ఇంటర్ బోర్డు విఫలమవుతోంది. అనధికారికంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేసి ఆ సంస్థలకు అనుబంధంగా మౌళిక వసతులు లేని చిన్న చిన్న గుర్తింపు కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు అధికంగా వున్న నేపథ్యంలో ఎంసెట్ పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచడం సరికాదు. ఇంటర్‌తోపాటు సాంకేతిక కోర్సులు కూడా ప్రోత్సహించాలి. ఇంటర్ విద్యలో సంస్కరణలు రావాలి. పోటీ పరీక్షల నేపథ్యంలో కోచింగ్ నెపంతో కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయి. దీనిని నియంత్రించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించరాదు.’’ అని నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ పేర్కొన్నారు.

‘‘ఆ రెండు గ్రూపులపై మాత్రమే మక్కువ తగదు ఇంటర్ విద్యలో కేవలం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల పట్లే మక్కువ చూపుతున్నారు. ఇది సరికాదు. ఎకనమిక్, ఆర్ట్స్ గ్రూపుల పట్ల కూడా విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలి. కేవలం రెండు గ్రూపుల పట్ల ఆసక్తి చూపడంతో ప్రైవేటు కళాశాలలకు గిరాకీ పెరుగుతోంది. ర్యాంకు రావాలనే తపనతో తల్లిదండ్రులు తమ పిల్లలను అధిక ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు. ఇంటర్ దశలో ఒత్తిడితో విద్యనభ్యసించడం వల్ల ఆ తరువాత పోటీ ప్రపంచంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యం పెంపొందే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.’’ కౌన్సిలర్ ఫర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఎబ్రాడ్ క్యాంపస్ ప్రతినిధి కె.పార్ధసారధి తెలిపారు.

ఆచార్య కేఎస్ చలం

‘‘ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు హవా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌ల నిధులతో కార్పొరేట్ విద్యా సంస్థలు మూడు దశాబ్దాలుగా వందల కోట్లు సొమ్ము చేసుకున్నాయి. ప్రభుత్వ సొమ్ములతో ప్రైవేటు కళాశాలలు బాగుపడ్డాయి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందేవిధంగా జాతీయకరణ తరహాలో ఇంటర్ విద్య నిర్వహించాలి. లాభాలు లక్ష్యం కాకుండా సామాజిక బాధ్యతతో ఇంటర్ విద్య కొనసాగాలి. ఓట్ల కోసం, రాజకీయాల కోసం విద్యా విధానాలను రూపొందించడం సరికాదు. ఇంటర్ బోర్డులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాల్సి వుంది.’’ అని ద్రావిడ యూనివర్సిటీ మాసీ ఉపకులపతి, యూపీఎస్‌సీ పూర్వ సభ్యులు ఆచార్య కె.ఎస్.చలం అభిప్రాయపడ్డారు.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, +91 94919 99678; ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)