Home Editorial & Features ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా?

0
240 Views

నిమ్మగడ్డపై చివరి అస్త్రం రెడీ చేసిన ప్రభుత్వం!

సలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? రాజ్యాంగ బద్దమైన సంస్థలను కాదని ప్రభుత్వం రాజ్యమేలాలని చూస్తోందా? లేక, తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోందా? అన్నది అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్‌లో పడిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికీ మధ్య కొనసాగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన మాట నెగ్గించుకున్నారు. కానీ, ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేదా? ప్రభుత్వం ఏం చేయనుంది? అనేది సర్వత్రా ఆసక్తిదాయకంగా మారింది! ప్రభుత్వ పెద్దల వైఖరి, కొన్ని లాజిక్కులు, కొన్ని కీలక పాయింట్లు ఆధారంగా చూసుకుంటే అనేక విషయాలున్నాయి. మొత్తానికి విషయం కోర్టుకి వెళ్లడం ఖాయమే. కానీ కోర్టుకి ఎవరు వెళ్తారు? అందరూ అనుకుంటున్నట్టు ప్రభుత్వమే కోర్టుకి వెళ్తుందా? నిమ్మగడ్డ వెళ్తారా? అనేది చూడాలి!

ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడం, ఆపడం ప్రభుత్వానికి సులువే. కాకపోతే కొంచెం నైతికత, న్యాయవిలువలు, చట్టాలు, హోదాలు మర్చిపోయి వ్యవహరించాల్సి ఉంటుంది. కొంత రిస్క్ కూడా చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే, ఆ దారిలో వెళ్తే స్థానిక ఎన్నికలు జరగవు. స్థానిక ఎన్నికలు అంటే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఒక్కరో ఆయన కార్యాలయ సిబ్బందో నిర్వహించలేరు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు నుండి గ్రామస్థాయి సిబ్బంది వరకు ఎన్నికల కమిషన్‌కి సరెండర్ అవ్వాలి. అలా అయితేనే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుంది. వారు లేకుండా నిమ్మగడ్డ ఏమి చేయలేరు.

ఈ నేపథ్యంలో ఈ అధికారులు, సిబ్బంది ఏ మాత్రం సహకరించకుండా సహాయ నిరాకరణ చేసే వీలుంది. ‘‘మేము కరోనా కారణంగా టీకా పంపిణీ విధుల్లో ఉన్నాం. ఎన్నికల విధుల్లో పాల్గొనలేము.’’ అంటూ సింపుల్‌గా ఒక సాకు లేఖని నిమ్మగడ్డకి రాసేసి సహాయ నిరాకరణ చేసినా చేయొచ్చు. అదే జరిగితే సిబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించలేరు. ఇది జరిగితే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ‘‘ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ఇచ్చినప్పటికీ అధికారులు సహకరించడం లేదు, మాకు సహకరించేలా ఆదేశించండి.’’ అంటూ నిమ్మగడ్డ కోర్టుకి లేదా, గవర్నర్ వద్దకి వెళ్లే అవకాశం ఉంది.

లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి బాస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘాన్నీ ఆశ్రయించవచ్చు. కోర్టులు, కేంద్రం, గవర్నర్, రాష్ట్రపతి ఎవరు చెప్పినా ప్రభుత్వం సహకరించకపోతే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ప్రభుత్వ ‘‘ఈ రెండు నెలలు మేము సహకరించలేము, మాకు ఈ మాత్రం గడువు ఇవ్వండి.’’ అని కోరుతూనే ఉంటుంది. సో, ఇది కీలక మార్గం కానుంది. నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్టు ప్రభుత్వమే కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నయా? లేదా? అంటే అనుమానమే. కోర్టులకు వెళ్లినా, వెళ్లకపోయినా ప్రభుత్వం మాత్రం ఈ రెండు నెలలు కచ్చితంగా ఎన్నికలు జరగనీయదు.

సో, కరోనా టీకా సాకుతో సహాయ నిరాకరణ చేయడం మొదటి మార్గం. లేదా కోర్టులో పిటిషన్ వేసి, ‘‘స్థానిక ఎన్నికలపై సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు.’’ అంటూ నేరుగా సుప్రీంలో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేసినా తాత్కాలికంగా ఎన్నికల ప్రక్రియని ఆపవచ్చు. అయితే, అప్పుడు ఒకవేళ సుప్రీం తీర్పు నిమ్మగడ్డకి అనుకూలంగా వస్తే మాత్రం ప్రభుత్వం ఇరుక్కుంటుంది. అలా కాకుండా కొన్ని న్యాయ సూత్రాలు, కీలక న్యాయ పాయింట్లు, గత స్థానిక ఎన్నికల వాయిదా కేసులో కోర్టులు చెప్పిన తీర్పులు, నిమ్మగడ్డ వ్యవహారంలో జరిగిన న్యాయ పరాభవాలు అన్నిటినీ మేళవించుకుని, న్యాయ నిపుణులతో చర్చించి ప్రభుత్వ తదుపరి నిర్ణయం ఉండవచ్చు! అయితే, ఇటు ప్రభుత్వం, అటు ఎస్ఈసీ నడుమ నలిగిపోతున్న అధికార యంత్రాంగం పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.