ఏపీ సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ హోం పేజీ

రాష్ట్ర ప్రభుత్వ ప్రయోగం వికటించనుందా?…

అడ్డగోలు నిర్ణయాలకు అడ్డుకట్ట వేసినట్టేనా??..

రాష్ట్రంలోని జర్నలిస్టుల వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకుంటున్న విధానం వికటించేలా అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిజం విలువల పరిరక్షణకు నడుం కట్టిన తీరు నిజమైన పాత్రికేయుల నుంచి ప్రశంసలు పొందేలానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం పరువుపోగొట్టుకునేలానో, కొంత మందిపై అక్కసుతో అందరిపైనా కక్షతీర్చుకునే పద్దతిలోనో ఉన్నట్లు అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తన ప్రయత్నాలలో భాగంగా ఇప్పటివరకు వ్యాపారంగా సాగుతూ వచ్చిన అక్రిడిటేషన్ల జారీ ఇకముందు నిస్పాక్షికంగా మంజూరు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర, జిల్లా కమిటీలను నియమించింది. అక్రిడిటేషన్ల వ్యామోహంతోనే అనేకమంది ఈ రంగంలోకి వచ్చి జీతభత్యాలు లేక, జీవన స్థితిగతులు అంతంతమాత్రంగా మారిన స్థితిలో వివిధ అపసవ్య మార్గాలను ఎంచుకున్న కొందరి వలన ఈ రంగం కలుషితం అవుతున్నట్లు పలువురు పేర్కొన్నారు.

అక్రిడిటేషన్ల జారీలో నిబంధనల ప్రకారం ఖచ్చితంగా జరీ చేసినా లేక, జీతభత్యాలు రావని ఈ రంగాన్ని పలువురు భవిష్యత్‌లో ఎంచుకునే మార్గం వీడే అవకాశంతో పత్రికా రంగంలో కేవలం అంకితభావం, అర్హులు మాత్రమే ఉన్నవారి వలన తప్పక ఫోర్త్ ఎస్టేట్ ప్రతిష్ట పెరుగుతుంది. ఈ విషయంలో చొరవ తీసుకున్న ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), కమిషనర్ తుమ్మా విజకుమార్‌రెడ్డి నిర్ణయం చాలా గొప్పదనే విధంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక, ఇటీవల తరచుగాలో మీడియాకి చెందిన వారిపై జూదం, వ్యభిచారం, బ్లాక్ మెయిలింగ్, దారి దోపిడీ, ఫోర్జరీ తదితర నేరాలకు పాల్పడుతున్నట్లు వార్తలు రావడం కూడా ఫోర్త్ ఎస్టేట్ రంగం కలుషితం అవుతోందన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. కనుక ప్రభుత్వం అక్రిడిటేషన్లు జారీ చేసే ముందు పోలీస్ ఎంక్వయిరీ జరిపించి మరీ జారీచేయాలని పలువురు పాత్రికేయులు కోరుతున్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాలుగా ద్విచక్ర వాహనాల నుండి టాటా ఎస్‌లు, కార్లు, జీపులు, మినీ ట్రక్కులు, భారీ లారీల వరకు ‘ప్రెస్’ అని స్టిక్కర్ వేసుకుని యథేచ్ఛగా తిరగటం అనేక సార్లు ఇలా తిరిగే వాహనాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు వార్తలు రావడం, పోలీసులకు ఇతర అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

పచారీ కొట్టోడూ ‘ప్రెస్సే’నట!?

‘ప్రెస్’ అనే పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ పదం వెనుక ఉన్న ప్రయోజనాల్ని అనుభవించే వారికే తెలుసు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రతి అడ్డమైనోడూ ప్రెస్ అని వాహనాలపై స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతుండడం పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. చివరికి పచారీ కొట్టోడూ, ‘ప్రింటింగ్ ప్రెస్‌’లో పనిచేసుకునే సగటు కార్మికుడు కూడా ‘ప్రెస్’ అనే పదాన్ని తన వాహనంపై రాసుకుని తిరుగుతుండడం క్షమించరాని నేరం అనేదానికంటే కూడా ఆ అక్రమాన్ని చూస్తూ కూడా మిన్నకుండిపోతున్న ‘వ్యవస్థ’ను తప్పుపట్టాలి. మీడియాలో పనిచేసే మిత్రులే చాలా వరకు ‘ప్రెస్’ ప్రయోజనాలు సరిగా వినియోగించుకోని పరిస్థితుల్లో అక్రమార్కులు, అనధికార వ్యక్తులు ‘ప్రెస్’ పేరిట విచ్చలవిడిగా బోర్డులు తగిలించుకుని రెచ్చిపోతున్నారు.

జేబులో గుర్తింపు కార్డు ఉన్న జర్నలిస్టుల పట్ల సైతం కఠినంగా వ్యవహరించే పోలీసులు అనధికార ‘ప్రెస్’ వాళ్ల పట్ల కనీసం స్పందించకపోవడం దారుణం. ఏదో ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అక్రమార్కులు ఇలాంటి ‘ప్రెస్’ చిట్కాలు వాడుతున్నారనుకుంటే పొరపాటే… నేరాలు చేసే వాళ్లు కూడా తాము వినియోగించే వాహనాలకు ‘ప్రెస్’ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ‘ప్రెస్’ స్టిక్కర్లు అతికించి ఉన్న వాహనాలు ఎన్నో తీవ్రమైన నేరస్తులు పట్టుబడినప్పుడు దొరికిన విషయం ఇక్కడ ప్రస్తుతించడం అవసరం. నిజమైన మీడియా ప్రతినిధులు (వాళ్లు యజమాని అయినా, రిపోర్టర్ అయినా, వీడియోగ్రాఫర్ అయినా, ఫొటోగ్రాఫర్ అయినా, కనీసం ఆ సంస్థలో పనిచేసే వర్కర్ అయినా) కచ్చితంగా గుర్తింపు కార్డు పొందే ఉంటారు.

ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు అందరికీ ఉండకపోయినా, కనీసం సంస్థ ఇచ్చే గుర్తింపు కార్డయినా ఉంటుంది. కానీ, అనధికార వ్యక్తుల వద్ద ఏం ఉంటుంది? తమ అన్నో, నాన్నో, బావో, ఇంకెవరో మీడియాలో పనిచేసినంత మాత్రాన అందరూ తమ వాహనాలపై ‘ప్రెస్’ అనే స్టిక్కర్లు అతికించుకోవడం ఎంత వరకు సమంజసం? ఇది అందరూ ఆలోచించాల్సిన వాస్తవం. ‘‘ఏంటండీ ప్రతివాడూ ‘ప్రెస్’ అంటాడు… ఎవరు ప్రెస్సో తెల్చుకోలేకపోతున్నాం’’ అనే మాటలు కానిస్టేబుల్, హోం గార్డుల నుంచి వినకూడదనుకుంటే మాత్రం నిజమైన మీడియా మిత్రులే ఇకమీదట ‘ప్రెస్’ అనే పదాన్ని వాడుకోవాల్సి ఉంటుంది.

మొన్నీమధ్య ఈ వార్త రాసిన ప్రతినిధికి ఓ పెద్దాయన తారసపడ్డాడట. ఆయన నడుపుతున్న ద్విచక్ర వాహనంపై ఉన్న ప్రెస్ స్టిక్కర్ చూసి ఆయన ఏదో పత్రికకు సీనియర్ రిపోర్టరో లేక, సబ్ ఎడిటరో అయి ఉంటారని భావించారట. తీరా ఆరా తీస్తే చివరికి ఆయన మార్కెట్లో ఓ పచారీ కొట్టాయన అని తేలిందట. కర్రీ పాయింట్లకు, హోటళ్లకూ అరువుపై సరకులు సరఫరా చేసే ఆ పెద్దాయన సాయంత్రం పూట అదే దుకాణాలకు వెళ్లి బాకీలు వసూలు చేసుకుంటారట. అలా వెళ్లేటప్పుడు అవతలివాళ్లను బెదిరించాలన్న ఉద్దేశంతోనో లేక పోలీసు కేసుల నుంచి తప్పించుకోవచ్చన్న ఆలోచనతోనే ఆయన వాహనానికి ప్రెస్ అన్న స్టిక్కర్ తగిలించుకున్నారు. చివరికి పచారీ కొట్టోడి వాహనంపై కూడా ‘ప్రెస్’ స్టిక్కర్ వచ్చిచేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించి ఈ అనధికార ‘ప్రెస్’ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇకనుండి ఆ వాహనాలకు సరైన పత్రాలు అనగా అక్రిడిటేషన్లు, లేదా మేనేజ్మెంట్లు జారీ చేసే గుర్తింపు కార్డులు లేకుండా తిరిగే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలని కూడా పాత్రికేయులు కోరుతున్నారు. ఏమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జర్నలిజం కూడా మంచి మార్గంలో వెళ్లేందుకు, కోల్పోతున్న పూర్వ వైభవం తీసుకొచేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యను మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కానీ, ఇప్పటికే రాష్ట్ర స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్ఎంఎసి) సమావేశం కాగా, తాజాగా జిల్లాల వారీగా ప్రభుత్వ అధికారుల కమిటీలు సమావేశమవుతూ అర్హులైన అభ్యర్ధులను ఎంపికచేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డీఎంఎసీ) సమావేశం నిన్న జరిగింది. ఆ సమావేశానికి డీఎంఎసీ అధ్యక్షుని హోదాలో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అధ్యక్షతవహించి అర్హులైన జర్నలిస్టుల జాబితాను ఎంపికచేశారు. 2021-2022 ద్వైవార్షిక కాలానికి మీడియా అక్రిడిటేషన్లు కోరుతూ 2,271 దరఖాస్తులు వస్తే అందులో తొలి విడత పేరిట కేవలం 457 మంది జర్నలిస్టులను మాత్రమే కమిటీ ఎంపికచేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన కొన్ని డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా 1,814 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం జరిగిందని కలెక్టర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.

దీనిని బట్టి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో ఎంత మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వస్తాయో లెక్కేసుకోవచ్చు. ఇవాళ సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ జిల్లా స్థాయి అధికారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం అంచనా వేస్తే, తొలి విడతలో కనీసం వెయ్యి పదిహేను వందల కార్డులు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నది స్పష్టమవుతోంది.

ఆ అధికారి చెప్పినదానిని బట్టి చూస్తే ఆ జిల్లాలో తొలి విడతలో కేవలం 15 నుంచి 20 మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు జారీకానున్నాయి. ఆ విధంగా రాష్ట్రంలోని 13 జిల్లాల పరిస్థితిని అంచనావేస్తే సంఖ్య వెయ్యికి లోపే ఉంటాయని తెలుస్తోంది.

ప్రభుత్వ ప్రయత్నం మంచిదే…

ప్రభుత్వ ప్రయత్నాన్ని ఎవరూ తప్పుబట్టాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో వ్యాపారంగా మారిన అక్రిడిటేషన్ కార్డుల జారీ వ్యవహారాన్ని ప్రక్షాళించి అర్హులైన వారికే ఇవ్వాలన్న ఆశయం మంచిదే. కాకపోతే, ఈ క్రమంలో నిజమైన, సీనియర్ జర్నలిస్టులను విస్మరించాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీడియా ప్రక్షాళన విషయంలో ఇప్పటి వరకూ అధికార పార్టీకి ఎలాంటి చెడ్డపేరూ లేదు. అయితే, తాజా పరిస్థితులు పరిశీలిస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కొనేలా ఉంది. విడతల పేరిట సీనియారిటీని పక్కనపెట్టి కార్డుల జారీని ప్రారంభిస్తే తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడమే కాదు… న్యాయపరమైన చిక్కులనూ ప్రభుత్వం ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

జర్నలిస్టు సంఘాలు తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.