భక్తులు లేకుండానే భానుడి కల్యాణం

379
  • రుత్విజులతో అరసవల్లిలో సూర్యనమస్కారాలు

శ్రీకాకుళం, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీసూర్యనారాయణ స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు అరసవల్లిలో వైభవంగా జరిగాయి. చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా శనివారం రాత్రి 7 గంటలకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవాలు ఆలయ సంప్రదాయబద్దంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సింహవాహనంపై అలంకరించారు.

వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత సూర్యభగవానుడికి కన్నులపండువగా కళ్యాణం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు భక్తులు ఎవరిని ఈ కళ్యాణ ఉత్సవాలకు అనుమతించలేదు. కేవలం ఆలయ అర్చకులు మాత్రమే, కొద్దిమందితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలలో ఉంటున్న స్థానికులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆదిత్యుని ఆలయ చరిత్రలో ఇంత నిరాడంబరంగా వార్షిక కల్యాణోత్సవం జరగడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.

కాగా, కల్యాణోత్సవాలలో భాగంగా ఆదివారం కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రవేశద్వారం మూసివేసి ఆదిత్యునికి నిత్యసేవలు జరిపించారు అర్చకులు. స్థానిక భక్తులను సైతం ఆలయంలోకి అనుమతించడం లేదు. దేవాలయంలో ఆదివారం 12 మంది రుత్విజులతో సూర్యనమస్కారాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు సూర్య నమస్కారాలు ప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం భక్తుల మధ్యన కనీసం రెండు మీటర్ల భౌతిక/సామాజిక దూరం పాటించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 12 ద్వాదశ రూపాల్లో ఆదిత్యుని పూజించడం జరిగిందని, రోగపీడ నుండి విముక్తి కలగడానికి ఈ పూజలు నిర్వహించామని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మా పత్యేక ప్రతినిధి శృంగారం ప్రసాద్‌కు చెప్పారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో వైరస్ తగ్గుముఖం పట్టాలని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆలయంలోకి ఎక్కువ మంది భక్తులను అనుమతించకపోవడంతో స్వామివారి సన్నిధికి ముందున్న ఇంద్రపుష్కరిణి వద్ద భక్తులు సూర్యనమస్కారాలు చేశారు.